సత్యదేవ్ 'తిమ్మరుసు' ఫస్ట్ లుక్..!

Sat Dec 05 2020 12:31:25 GMT+0530 (IST)

Satyadev Thimmarusu First Look

'బ్రోచేవారెవరు రా' 'బ్లఫ్ మాస్టర్' 'ఉమామహేశ్వర ఉగ్రరూపస్య' చిత్రాలతో హీరోగా నిలదొక్కుకున్నాడు టాలెంటెడ్ యాక్టర్ సత్యదేవ్. ఆయన నటిస్తున్న తాజా చిత్రం ''తిమ్మరుసు''. ‘అసైన్‌మెంట్ వాలి’ అనేది దీనికి ఉపశీర్షిక. ఈ చిత్రానికి శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వం వహిస్తున్నారు. ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ మరియు ఎస్ ఒరిజినల్స్ బ్యానర్స్ పై మహేష్ కోనేరు - సృజన్ ఎరబోలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో సత్యదేవ్ సరసన 'టాక్సీవాలా' ఫేమ్ ప్రియాంక జవాల్కర్ కథానాయికగా నటిస్తోంది. వైవిధ్యమైన కథాంశంతో తెరకెక్కుతున్న 'తిమ్మరుసు' సినిమా ఫస్ట్ లుక్ ను ఈరోజు(శనివారం) చిత్ర యూనిట్ విడుదల చేసింది.'తిమ్మరుసు' ఫస్ట్ లుక్ లో సత్యదేవ్ చేతిలో ఓ సూట్ కేస్ పట్టుకొని బైక్ పై కూర్చుని స్టైలిష్ గా కనిపిస్తున్నాడు. వైవిధ్యభరిత చిత్రాలు చేస్తూ వస్తున్న సత్యదేవ్ మరో కొత్త తరహా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ను డిసెంబర్ 9న విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ''తిమ్మరుసు సినిమా ఓ మంచి కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న చిత్రం. సత్యదేవ్ ను సరికొత్త కోణంలో ఆవిష్కరించే సినిమా ఇది. ఈరోజు ఫస్ట్ లుక్ ను విడుదల చేస్తున్నాం. డిసెంబర్ 9న టీజర్ ను విడుదల చేస్తాం. ఇప్పటికే చిత్రీకరణ దాదాపు పూర్తయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలో ఇతర విషయాలు తెలియజేస్తాం'' అని తెలిపారు. ఈ చిత్రానికి శ్రీ చరణ్ పాకల సంగీతం సమకూరుస్తుండగా.. అప్పు ప్రభాకర్ కెమెరామెన్ గా వ్యవహరిస్తున్నారు. ఇందులో బ్రహ్మాజీ - అజయ్ - ప్రవీణ్ - ఆదర్శ్ బాలకృష్ణ - ఝాన్సీ - వైవా హర్ష - సంధ్యా - జనక్ తదితరులు నటిస్తున్నారు.