Begin typing your search above and press return to search.

టాలెంటెడ్ హీరో 'ఓటీటీ సూపర్ స్టార్' గా మారనున్నాడా...?

By:  Tupaki Desk   |   6 July 2020 2:30 AM GMT
టాలెంటెడ్ హీరో ఓటీటీ సూపర్ స్టార్ గా మారనున్నాడా...?
X
సినీ ఇండస్ట్రీలో ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా అడుగుపెట్టి ఓవర్ నైట్ స్టార్లవ్వడం కష్టం. ఎవరో ఒకరిద్దరికి మాత్రమే అలాంటి అదృష్టం కలుగుతూ ఉంటుంది. కానీ కొందరు మాత్రం ఎన్నో ఒడిడుకులు ఎదుర్కొని సినిమా కష్టాలు అన్నీ చూసి ఇండస్ట్రీలో నిలదొక్కుకున్నవారు ఉన్నారు. అలాంటి వారిలో నటుడు సత్యదేవ్ ఒకరు. 'మిస్టర్ పర్ఫెక్ట్' మూవీలో చిన్న రోల్ పోషించాడు సత్యదేవ్. అసలు ఆ సినిమాలో తను నటించాడని కూడా చాలా మందికి తెలియదు. తర్వాత 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' 'అత్తారింటికి దారేది' లాంటి ఎన్నో సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటిస్తూ వచ్చిన సత్య దేవ్ పూరీ దర్శకత్వంలో వచ్చిన 'జ్యోతి లక్ష్మి' సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అప్పటి నుంచి చిన్న సినిమాలకు హీరోగా కొనసాగుతూ వచ్చాడు.

ఈ క్రమంలో గత కొన్ని ఏళ్లుగా వైవిధ్యభరిత పాత్రలను ఎంచుకుంటూ తన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్న సత్యదేవ్.. ప్రస్తుతం టాలీవుడ్లో ఎలాంటి క్యారెక్టర్ అయినా సమర్థవంతంగా చేయగల నటుడిగా పేరు సంపాదించుకున్నాడు. వైవిద్యభరితమైన నటన, నూటికి నూరు శాతం కష్టపడే స్వభావం ఆయనని ఇండస్ట్రీలో నిలబెట్టాయని చెప్పవచ్చు. 'క్షణం' 'అంతరిక్షం' 'ఘాజీ' 'బ్లఫ్ మాస్టర్' 'ఇస్మార్ట్ శంకర్' 'బ్రోచేవారెవరు రా' 'సరిలేరు నీకెవ్వరు' వంటి సినిమాలు సత్య దేవ్ కి మంచి పేరు తెచ్చిపెట్టాయి. అంతేకాకుండా 'గాడ్స్ ఆఫ్ ధర్మపురి' 'లాక్డ్' అనే రెండు వెబ్ సిరీస్ లలో కూడా నటించాడు ఈ టాలెంటెడ్ యాక్టర్.

కాగా ఇప్పుడు హీరో సత్యదేవ్ కి 'ఓటీటీ స్టార్ హీరో' అనే స్టాంప్ పడిపోయిందని కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇటీవల సత్యదేవ్ నటించిన సినిమాలు ఓటీటీలో రిలీజ్ అవుతుండటమే దీనికి కారణం. సత్యదేవ్ హీరోగా నటించిన సినిమాలు వరుస పెట్టి ఓటీటీలలో డైరెక్టుగా రిలీజ్ అవుతున్నాయి. ఇప్పటికే '47 డేస్' అనే సినిమా జీ 5 ఓటీటీలో విడుదల అయింది. 'లాక్డ్' వెబ్ సిరీస్ ఆహాలో స్ట్రీమింగ్ అవుతుండగా 'గాడ్స్ ఆఫ్ ధర్మపురి' జీ 5లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇక సత్యదేవ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'ఉమామహేశ్వర ఉగ్రరూపస్య' కూడా ఓటీటీలో రిలీజ్ కానుంది. ప్రముఖ డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్ నెట్ ఫ్లిక్స్ లో జూలై 15న విడుదల కానుందని సమాచారం. 'మహేషింతే ప్రతీకారం' అనే మలయాళ చిత్రానికి రీమేక్ గా తెరకెక్కిన 'ఉమామహేశ్వర ఉగ్రరూపస్య' చిత్రాన్ని 'బాహుబలి' చిత్రాన్ని నిర్మించిన ఆర్కా మీడియా వర్క్స్‌ మరియు మహాయాన మోషన్‌ పిక్చర్స్‌ సంయుక్తంగా నిర్మించాయి.

ఇలా సత్యదేవ్ ఏదొక విధంగా ఓటీటీలలో కనిపిస్తుండటంతో 'ఓటీటీ సూపర్ స్టార్' అనే ట్యాగ్ లైన్ తెచ్చుకుంటాడని ఇండస్ట్రీ వర్గాల్లో అనుకుంటున్నారు. నెట్ ఫ్లిక్స్ అయినా.. ప్రైమ్ ఐనా.. ఆహా అయినా.. జీ 5 అయినా ఓటీటీ స్టార్ మాత్రం సత్యదేవ్ అని కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలాగే కొనసాగితే రాబోయే రోజుల్లో 'ఓటీటీ సూపర్ స్టార్ సత్య దేవ్ జిందాబాద్' అంటూ ఫ్యాన్స్ అసోసియేషన్ ఫామ్ చేస్తారేమో అంటున్నారు. అయినా రాబోయే రోజుల్లో ఓటీటీలదే రాజ్యం అంటున్నారు. అందులోనూ ఇప్పుడు ఇండస్ట్రీలో పరిస్థితులు చూస్తుంటే ఇప్పుడప్పుడే థియేటర్స్ లో బొమ్మ పడేలా లేదు. కనీసం సత్యదేవ్ అయినా తన సినిమాలతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నారు.