Begin typing your search above and press return to search.

హీరోగా ఎంట్రీ ఇవ్వనున్న దర్శకుడి కొడుకు...?

By:  Tupaki Desk   |   5 July 2020 1:43 PM GMT
హీరోగా ఎంట్రీ ఇవ్వనున్న దర్శకుడి కొడుకు...?
X
సినీ ఇండస్ట్రీలో 'నెపోటిజం' పై ఎన్ని చర్చలు జరిగినా విమర్శలు వచ్చినా వారసులను పరిచయడం అనేది ఆగదు. టాలెంట్ తో పని లేకుండా.. యాక్టింగ్ వచ్చినా రాకున్నా.. బ్యాగ్రౌండ్ ఉంటే చాలు సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టేయవచ్చు అని సినీ అభిమానులు అనుకుంటూ ఉంటారు. ఇది ఒక్క టాలీవుడ్ సినీ ఇండస్ట్రీకే పరిమితం కాలేదు. అన్ని ఇండస్ట్రీలలో సినీ ప్రముఖులు తమ వారసులను పరిచయం చేస్తూ వస్తున్నారు. ఇప్పటికే టాలీవుడ్ కి చాలా మంది వారసులు హీరోలుగా పరిచయమయ్యారు. వీరే కాకుండా కొంతమంది హీరోలు దర్శకులు నిర్మాతలు కూడా తమ వారసులని సినిమాల్లోకి తీసుకొచ్చారు. వారిలో చాలా మంది తమ టాలెంట్ నిరూపించుకొని ఇండస్ట్రీలో నిలదొక్కుకున్నారు. ఒకరిద్దరు మాత్రం ఒక్క సినిమాకే పరిమితం అయ్యారు. ఈ నేపథ్యంలో ప్రముఖ నిర్మాత డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ అధినేత దానయ్య కుమారుడి ఎంట్రీకి కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయని వార్తలు వచ్చాయి.

ఈ క్రమంలో 'శతమానం భవతి' సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న సతీష్ వేగేశ్న తనయుడు సమీర్ ని ఇంట్రడ్యూస్ చేయాలని చూస్తున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో చర్చించుకుంటున్నారు. తన కొడుకు కోసం మెగా ఫోన్ పట్టనున్నాడట. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పనుల్లో బిజీగా ఉన్నాడట సతీష్ వేగేశ్న. అయితే ప్రస్తుతం ప్లాపుల్లో ఉన్న ఈ దర్శకుడు తన కొడుకును హీరోగా నిలబెట్టగలరా అని సినీ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. స్టార్ డైరెక్టర్ ప్రొడ్యూసర్స్ కొడుకులు కూడా సరైన హిట్లు లేక సతమతం అవుతున్నారు.. ఈ టైం లో సతీష్ వేగేశ్న తన కొడుకును హీరోని చేయడం సాహసమే అని కామెంట్స్ చేస్తున్నారు. నిజానికి టాలీవుడ్ లో ప్రొడ్యూసర్స్ డైరెక్టర్ల కొడుకులు ఇండస్ట్రీలో పెద్దగా సక్సెస్ అయిన దాఖలాలు లేవు.

దర్శకరత్న దాసరి నారాయణరావు తన కొడుకు అరుణ్ కుమార్ ని హీరోగా నిలబెట్టలేకపోయాడు. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు కొడుకు ప్రకాష్ ఒక్క సినిమాకే పరిమితమయ్యాడు. కోదండ రామిరెడ్డి తనయుడు వైభవ్ రెడ్డి తెలుగులో పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. బెల్లంకొండ సురేష్ కొడుకు శ్రీనివాస్ హీరోగా నిలదొక్కుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాడు. అల్లు అరవింద్ కుమారుల్లో బన్నీ హీరోగా సక్సెస్ అవ్వగా అల్లు శిరీష్ మాత్రం ఇంకా సరైన బ్రేక్ కోసం ట్రై చేస్తూనే ఉన్నాడు. పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాష్ ని హీరోగా నిలబెట్టే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. మరి ఇప్పుడు సతీష్ వేగేశ్న నిర్ణయం సరైనదేనా అని ఫిలిం వర్గాల్లో చర్చించుకుంటున్నారు. ఈ వార్తల్లో నిజమెంతో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.