న్యూస్ ఛానల్ డిబేట్స్ పై సెటైర్.. 'హ్యాపీ బర్త్ డే' టీమ్ వెరైటీ ప్రమోషన్స్..!

Wed Jun 29 2022 14:00:01 GMT+0530 (IST)

Satire on News Channel Debates .. 'Happy Birthday' Team Variety Promotions ..!

'మత్తు వదలరా' ఫేమ్ రితేష్ రానా దర్శకత్వంలోలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ "హ్యాపీ బర్త్ డే". లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో నరేష్ ఆగస్త్య - సత్య - 'వెన్నెల' కిషోర్ ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. రిలీజ్ కు రెడీ అయిన ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. దీని కోసం విభిన్నమైన ప్రమోషనల్ స్ట్రాటజీతో ముందుకు వెళ్తున్నారు.ఇందులో భాగంగా లేటెస్టుగా 'హ్యాపీ బర్త్ డే' టీమ్ ఓ ఫన్నీ వీడియోని రిలీజ్ చేసింది. 'మూవీలో హీరో ఎవరు?' అంటూ న్యూస్ ఛానల్ లో డిబేట్ మాదిరిగా ఈ ప్రోగ్రాం ను డిజైన్ చేశారు. గెటప్ శ్రీను ఈ డిబేట్ లో న్యూస్ రీడర్ దేవి శ్రీ ప్రసాద్ థమన్ గా కనిపిస్తుంటే.. నరేష్ అగస్త్య - సత్య - గుండు సుదర్శన్ గెస్టులుగా వచ్చారు. వెన్నెల కిషోర్ ఫోన్ లైన్ ద్వారా చర్చలో పాల్గొన్నారు.

నేను హీరో అంటే.. నేను హీరో అంటూ ఈ చర్చలో సత్య - అగస్త్య గొడవ పడుతుంటారు. ఈ సందర్భంగా గెటప్ శీను తన పక్కనే ఉన్న బాటిల్ తీసుకొని నటుడు సత్యపై విసిరి కొట్టడం నవ్వు తెప్పిస్తుంది. ఈ క్రమంలో వెన్నెల కిషోర్ న్యూసెన్స్ న్యూస్ అంటూ ఓ ఇంగ్లీష్ పదాన్ని వాడారు. దీంతో హోస్ట్ గా ఉన్న గెటప్ శ్రీను.. గెటవుట్ ఆఫ్ మై స్టూడియో అంటూ కిశోర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరకు హీరో ఎవరనేది చెప్పకుండానే చర్చను ముగించారు.

సరదాగా ప్రమోషన్స్ కోసం చేసిన ఈ ఫన్నీ వీడియో అందరినీ ఆకట్టుకుంటోంది. అదే సమయంలో ఇటీవల ప్రముఖ న్యూస్ ఛానల్ డిబేట్ లో జరిగిన ఇష్యూ పై సెటైర్ వేసినట్లు అనిపిస్తుంది. మూవీ ప్రమోషన్స్ లో భాగంగా టాలీవుడ్ యువ హీరో ఒకరు ప్రాంక్ వీడియో చేయడంపై ఓ ప్రముఖ న్యూస్ ఛానల్ డిబేట్ పెట్టడం.. ఈ క్రమంలో వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే.

ఆ షోని హోస్ట్ చేస్తున్న యాంకర్ లైవ్ డిబేట్ లో 'పాగల్' 'డిప్రెస్డ్ మ్యాన్' అంటూ హీరోని వ్యక్తిగతంగా ఎటాక్ చేసింది. దీనిపై అతను ఆగ్రహం వ్యక్తం చేసాడు. సహనం కోల్పోయిన యాంకర్ 'గెటౌట్' అంటూ హుకుం జారీ చేయడం.. ఈ క్రమంలో అతను నోటికి పనిచెప్పి 'F' అనే పదాన్ని వాడటం.. దీంతో 'వెధవ.. గెటవుట్' అంటూ యాంకర్ మళ్లీ గట్టి గట్టిగా అరవడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది.

ఇందులో ఎవరిది తప్పు అనే విషయంలో పలు రకాల వాదనలు వినిపించాయి. అయితే ఇప్పుడు 'హ్యాపీ బర్త్ డే' టీమ్ చేసిన వీడియో ఆ న్యూస్ ఛానల్ డిబేట్ మరియు సదరు యాంకర్ పై సెటైర్ వేసినట్లుగా ఉందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఏదైతేనేం ఈ ఫన్నీ వీడియో నెట్టింట వైరల్ అవడంతో.. అందరి దృష్టి ఈ సినిమాపై పడిందని చెప్పాలి.

"హ్యాపీ బర్త్ డే" చిత్రాన్ని జులై 8న వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయనున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ తో కలిసి క్లాప్ ఎంటర్టైన్మెంట్ ప్రతాకంపై ఈ సినిమాను రూపొందించారు. కాళ భైరవ సంగీతం సమకూర్చగా.. సురేష్ సారంగం సినిమాటోగ్రఫీ అందించారు. సర్రియల్ కామెడీ థ్రిల్స్ మరియు యాక్షన్ తో కూడిన సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.