ఆ విషయంలో తొందరేమీ లేదంటున్న మహేష్ అండ్ టీమ్...?

Thu Jul 16 2020 22:00:01 GMT+0530 (IST)

Mahesh and team seem to have no problem with that ...?

సూపర్ స్టార్ మహేష్ బాబు తన నెక్స్ట్ సినిమా 'సర్కారు వారి పాట' ను అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. 'గీత గోవిందం' ఫేమ్ పరశురామ్ పెట్లా దర్శకత్వం వహించనున్న ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ - జీఎమ్బీ ఎంటర్టైన్మెంట్స్ - 14 రీల్స్ ప్లస్ నిర్మాణ సంస్థలు కలిసి నిర్మించనున్నాయి. ఈ సినిమాలో మహేష్ సరసన 'మహానటి' కీర్తి సురేష్ ని హీరోయిన్ గా ఫైనలైజ్ చేసారని సమాచారం. ఇక ఈ సినిమాలో మహేష్ కి ప్రతినాయకుడిగా ఎవరు నటిస్తున్నారు అనే దానిపై డైలీ ఏదొక న్యూస్ వస్తూనే ఉంది. ఈ క్రమంలో శాండిల్ వుడ్ స్టార్ హీరోలు ఉపేంద్ర మరియు కిచ్చా సుధీప్ ల పేర్లు తెరపైకి వచ్చాయి. వీరితో పాటు టాలెంటెడ్ యాక్టర్ అరవింద్ స్వామి 'సర్కారు వారి పాట'లో విలన్ గా నటించబోతున్నాడు అంటూ మరో న్యూస్ కూడా వచ్చింది. అయితే మహేష్ అండ్ టీమ్ విలన్ గా ఎవరిని తీసుకోవాలనే దానిపై అసలు ఆలోచన చేయడం లేదట.దేశవ్యాప్తంగా ఏర్పడిన పరిస్థితుల వలన గత నాలుగు నెలలుగా సినిమా షూటింగులు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సూపర్ స్టార్ మహేష్ తన తండ్రి బర్త్ డే నాడు 'సర్కారు వారి పాట' ప్రాజెక్ట్ అనౌన్స్ చేసారు. అయితే కరోనా మహమ్మారి ప్రభావం రోజురోజుకి ఎక్కువ అవుతుండటంతో ఇప్పట్లో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేసే ఆలోచన చేయడం లేదని తెలుస్తోంది. అందువలన సినిమాలో నటించబోయే ప్రధాన పాత్రల గురించి ఇప్పుడే డిస్కషన్ ఎందుకని ఆలోచిస్తున్నారట. ముఖ్యంగా ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకునే వారిని క్రైసిస్ తర్వాత సెలెక్ట్ చేద్దాం అనే ఉద్దేశ్యంలో ఉన్నారట. అందులోనూ ఇప్పుడే వారిని ఫైనలైజ్ చేసినా కరోనా డేస్ ఎన్ని రోజులు ఉంటాయో తెలియదు.. దీంతో ఫ్యూచర్ లో వారి డేట్స్ ఇష్యూ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని భావిస్తున్నారట. అంతేకాకుండా ఇప్పుడే స్టార్ యాక్టర్స్ ని ఫైనలైజ్ చేస్తే వారికి కొంత రెమ్యూనరేషన్ ని అడ్వాన్స్ గా కూడా ఇప్పుడే ఇవ్వాల్సి ఉంటుందని కూడా మేకర్స్ ఆలోచిస్తున్నారట. అందుకే ప్రొడ్యూసర్స్ లో ఒకరైన మహేష్ అండ్ టీమ్ క్రైసిస్ తర్వాత విలన్ రోల్స్ తో పాటు ఇతర ప్రధాన పాత్రలను ఎంపిక చేసుకోవచ్చు అని భావిస్తున్నారట.

ఇదిలా ఉండగా సందేశాత్మక అంశాలతో కంప్లీట్ ఎంటర్టైనర్ గా తెరకెక్కబోతున్న 'సర్కారు వారి పాట' పై అటు మహేష్ ఫ్యాన్స్ లోనూ ఇటు సినీ అభిమానుల్లోనూ భారీ అంచనాలే ఏర్పడ్డాయి. దీనికి తగ్గట్టే అనౌన్స్మెంట్ పోస్టర్ లో చెవికి రింగు.. రఫ్ గా కనిపించేలా గడ్డం.. మెడ మీద రూపాయి కాయిన్ టాటూతో మాసీ లుక్ లో మహేష్ అదరగొట్టాడు. ఇక ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాకి ఆర్ట్ డైరెక్టర్ గా ఏయస్ ప్రకాష్ పని చేస్తుండగా మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటింగ్ చేయబోతున్నారు. పీఎస్ వినోద్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించనున్నాడు.