'సర్కారు వారి పాట' మండే టెస్ట్ పాసయ్యేనా?

Mon May 16 2022 13:32:16 GMT+0530 (IST)

Sarkaru Vaari Paata Movie

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన యాక్షన్ ఎంటర్ టైనర్ 'సర్కారు వారి పాట' ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. మే 12న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన విషయం తెలిసిందే. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీని యంగ్ డైరెక్టర్ పరశురామ్ తెరకెక్కించారు. అత్యంత భారీ స్థాయిలో విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మిశ్రమ స్పందనని సొంతం చేసుకుంది. దీంతో ఫ్యాన్స్ కొంత వరకు నిరుత్సాహానికి గురయ్యారు.దాదాపు రెండేళ్ల విరామం తరువాత మహేష్ నుంచి వచ్చిన సినిమా కావడంతో ఈ చిత్రం ఎలాగైనా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలుస్తుందని ఫ్యాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకులు భావించారు. కానీ ఫలితం మాత్రం అందుకు బిన్నంగా వుండటంతో ఫ్యాన్స్ కొంత వరకు నిరుత్సాహానికి గురవుతున్నారట. ఈ మూవీ విడుదలై అప్పుడే నాలుగు రోజులు పూర్తయి ఐదవ రోజు లోకి ఎంటరైంది. బక్సాఫీస్ వద్ద కొంత వరకు ఫరవాలేదనిపించింది.

అయితే ఈ మూవీకి అసలు టెస్ట్ మండే నుంచే మొదలైనట్టుగా చెబుతున్నారు. సినిమా ఆశించిన స్థాయిలో లేకపోవడంతో మండే ఈ మూవీ అసలు స్టామినాని స్పష్టం చేస్తుందని ఈ రోజుతో సినిమా సత్తా ఏంటో క్లారిటీ రానుందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. గురు శుక్ర శని ఆదివారాలు వీకెండ్స్ కావడం వల్ల సినిమా అసలు సత్తా బయటపడలేదని మండే రోజే అసలు విషయం బయటికి రానుందని చెబుతున్నారు.

మండే టెస్ట్ గనక పాస్ అయితే మరి కొన్ని రోజులు 'సర్కారు వారి పాట' తన హవాని కొనసాగిస్తుంది. ఇక్కడే విషయం చెప్పాలి. 'సర్కారు వారి పాట' కు పోటీగా బాక్సాఫీస్ బరిలో మరో కొత్త సినిమా లేదు. అదే ఈ సినిమాకు ప్రధాన ప్లాస్ పాయింట్ గా మారిందని తెలుస్తోంది.

దీని వల్లే సినిమా మరిన్ని వసూళ్లని రాబట్టడం ఖాయం అని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. ఇప్పటికే మండే మార్నింగ్ షోస్ పడిపోవడంతో ఈవినింగ్ ఈ సినిమా మండే ఫలితం తేలబోతోందని దీన్ని బట్టే ఈ సినిమా రన్ ఆధారపడి వుంటుందని తెలుస్తోంది.

తమన్ సంగీతం అందించిన ఈ మూవీ సాంగ్స్ తో ఇప్పటికే మంచి టాక్ ని సొంతం చేసుకుంది. ఓవర్సీస్ లో భారీ వసూళ్లని రాబడుతున్న ఈమూవీ బాక్సాఫీస్ వద్ద కూడా అదే స్థాయిలోఆకట్టుకుంటుందని యుఎస్ మార్కెట్ లో ఈ సినిమా మంచి వసూళ్లని రాబట్టిందని ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ ఇదే తరహాలో వసూళ్లని రాబట్టే అవకాశం వుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. కానీ మండే దాటితేగానీ మహేష్ సినిమా సత్తా ఏంటన్నది తెలియదని కూడా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయట. మరి 'సర్కారు వారి పాట' మండే టెస్ట్ పాసవుతుందా? అన్నది తెలియాలంటే మరి కొన్ని గంటలు వేచి చూడాల్సిందే.