మహేష్ కోపంలో అర్థం ఉంది

Wed Jul 21 2021 13:14:19 GMT+0530 (IST)

Mahesh Babu Worried About Sarkaru Vaari Paata Movie Leaks

ఏ హీరో అయిన తన సినిమా జనాల్లోకి వెళ్లి మంచి ఆధరణ దక్కించుకోవాలని కోరుకుంటాడు. కాని జనాల్లోకి వెళ్లే విషయంలో ఒక పద్దతి మెయింటెన్ చేయాల్సి ఉంటుంది. సినిమా ఫస్ట్ లుక్ లేదా స్టోరీ డైలాగ్ ఏదైనా కూడా ఒక పరిధి వరకు చిత్ర యూనిట్ సభ్యులు రివీల్ చేస్తూ ప్రమోషన్ చేయాల్సి ఉంటుంది. అలా కాదని సినిమాకు సంబంధించిన ఫొటోలు పదే పదే లీక్ అవ్వడం.. పదే పదే సినిమాలోని డైలాగ్ లు స్టోరీ లైన్ లీక్ అవ్వడంతో పాటు షూటింగ్ కు సంబంధించిన విషయాలు బయటకు తెలియడం అనేది సినిమాకు ఎంతో కొంత నష్టం చేకూర్చే అవకాశం ఉంది. కనుక సినిమ యూనిట్ సభ్యులు లీక్ ల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు.ముఖ్యంగా పెద్ద సినిమాల విషయంలో లీక్ లు అనేవి ఈమద్య కాలంలో చాలా కామన్ అయ్యాయి. దాంతో జక్కన్న వంటి దర్శకులు సినిమాకు సంబంధించిన ఏ సన్నివేశం కాని ఫొటో కాని లీక్ అవ్వకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నారు. చిన్న లీక్ అయినా కూడా వెంటనే స్పందించేలా ఒక టీమ్ ఉంటుంది. కాని సర్కారు వారి పాట సినిమా లీక్ ల విషయమై యూనిట్ సభ్యులు శ్రద్ద పెట్టడం లేదు అనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికే సర్కారు వారి పాట సినిమాకు సంబంధించిన పలు ఆన్ లొకేషన్ స్టిల్స్ మరియు స్టోరీ డైలాగ్ లు కూడా లీక్ అయ్యాయి.

ఈ విషయమై మహేష్ బాబు ఒకటి రెండు సార్లు చిత్ర యూనిట్ సభ్యులకు తెలియజేసినా కూడా మళ్లీ లీక్ లు కంటిన్యూ అవుతున్నాయి. దాంతో ఈ విషయమై మరోసారి చిత్ర యూనిట్ సభ్యులపై మహేష్ బాబు అసంతృప్తి వ్యక్తం చేశారనే వార్తలు వస్తున్నాయి. సినిమా విషయాలు ఇలా లీక్ అయితే ఎలా అంటూ యూనిట్ సభ్యులను సున్నితంగా మహేష్ బాబు హెచ్చరించాడట. లీక్ కు సంబంధించిన కారణాలను అన్వేషించే పనిలో చిత్ర యూనిట్ సభ్యులు పడ్డారని తెలుస్తోంది.

సినిమా లీక్ ల విషయంలో మహేష్ బాబు కోపం తెచ్చుకోవడంలో తప్పేం లేదని.. ఏ హీరో అయినా ఇలాగే ఉండాలంటూ కొందరు ఇండస్ట్రీ వర్గాల వారు మరియు మీడియా సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది. సినిమా లీక్ విషయంలో సీరియస్ గా లేకుంటే ఫొటోలు.. డైలాగ్ లు మాత్రమే కాకుండా వీడియోలు కూడా లీక్ అయ్యి సినిమా కే నష్టం తెచ్చే అవకాశం ఉంది. అందుకే జాగ్రత్తగా ఉండాలంటూ మహేష్ కోపంగా చెప్పడంలో తప్పేం లేదని కొందరు అభిప్రాయం. సినిమా లీక్ ల వల్ల కొన్ని సార్లు క్రేజ్ తగ్గే అవకాశాలు కూడా ఉన్నాయి. సినిమా క్రేజ్ పెంచే లీక్ లు కూడా అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి అది వేరే విషయం కాని.. ఏదైనా అఫిషియల్ గా వస్తేనే బాగుంటుంది కదా. అందుకే యూనిట్ సభ్యుల లీక్ ల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండటం మంచిది.

మహేష్ బాబు సర్కారు వారి పాట నుండి ఇకపై అయినా లీక్ లు లేకుండా చూసుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. అభిమానులు అఫిషియల్ పోస్టర్ లు వీడియోలను కోరుకుంటారు కాని లీక్ లను అస్సలు ప్రోత్సహించరు. నిజమైన అభిమానులు.. సినీ ప్రేమికులు అయితే లీక్ వీడియోలను ఫొటోలను నెట్టింట షేర్ చేయరు. మహేష్ బాబు సర్కారు వారి పాట ఫస్ట్ లుక్ వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు బర్త్ డే సందర్బంగా రాబోతుంది. కనుక ఇక సర్కారు వారి పాట లీక్ ల కోసం నెట్ లో సెర్చ్ చేయనక్కర్లేదు.