యూఏస్ లో సర్కారు వారి నాన్-RRR రికార్డ్..!

Thu May 12 2022 19:22:06 GMT+0530 (IST)

Sarkaru Vaari Paata In USA

సూపర్ స్టార్ మహేశ్ బాబు సినిమాలకు ఓవర్ సీస్ లో మంచి మార్కెట్ ఉంటుందనే సంగతి తెలిసిందే. ఇప్పుడు లేటెస్టుగా ''సర్కారు వారి పాట'' సినిమాతో యూఏస్ లో మరోసారి తన సత్తా చాటారు మహేష్.పరశురాం పెట్లా దర్శకత్వంలో మహేష్ హీరోగా నటించిన 'సర్కారు వారి పాట' సినిమా యూఎస్ ప్రీమియర్స్ బుధవారం ప్రదర్శించబడ్డాయి. ప్రీమియర్ షోల ద్వారా ఈ చిత్రం $925K వసూలు చేసినట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలో 'భీమ్లానాయక్' ($870K) - రాధేశ్యామ్ ($900K) - ఆచార్య ($650K) సినిమాలను అధిగమించింది. దీంతో కరోనా పాండమిక్ తర్వాత USAలో ప్రీమియర్స్ ద్వారా అత్యధిక వసూళ్ళు రాబట్టిన రెండో భారతీయ సినిమాగా SVP మూవీ రికార్డ్ క్రియేట్ చేసింది.

ప్రస్తుతానికి యూఏస్ ప్రీమియర్స్ రికార్డ్ RRR సినిమా పేరిట ఉంది. ఐదు భాషల్లో రిలీజ్ అయిన ఈ సినిమా ప్రీమియర్స్ మరియు ఫస్ట్ డే వసూళ్ళు కలుపుకొని 5.5 మిలియన్ డాలర్లు రాబట్టింది. అయితే ఇప్పుడు 'సర్కారు వారి పాట' తెలుగులో మాత్రమే రిలీజ్ అయింది.

471 లొకేషన్లలో ప్రీమియర్స్ ద్వారానే 9 లక్షల 25వేల డాలర్లు రావడం చాలా పెద్ద విషయమనే అనుకోవాలి. ఇప్పటి వరకు మహేష్ బాబు కెరీర్ లో 'స్పైడర్' మూవీ ప్రీమియర్స్ ద్వారా అధిక వసూళ్లు అందుకున్న చిత్రంగా ఉండగా.. ఇప్పుడు 'సర్కారు వారి పాట' టాప్ లో నిలిచింది.

కరోనా పాండమిక్ తర్వాత ఓవర్ సీస్ లో RRR మినహా మరే మూవీ ప్రీమియర్స్ ద్వారా మిలియన్ మార్క్ అందుకోలేదు. కాకపోతే SVP సినిమా ప్రీమియర్స్ ప్రదర్శించిన మరికొన్ని లొకేషన్లకు సంబంధించిన డేటా ఇంకా రిపోర్ట్ చేయాల్సి ఉంది. ఆ వసూళ్ళు కూడా కలిపితే ప్రీమియర్ గ్రాస్ పెరిగే అవకాశం ఉంది.

ఏదేమైనా ఓవర్ సీస్ లో మహేష్ బాబు మరోసారి తన స్టామినా చూపించారనే అనుకోవాలి. అయితే ఈ వీకెండ్ లో 'డాక్టర్ స్ట్రేంజ్' వంటి హాలీవుడ్ సినిమాని తట్టుకొని.. 'సర్కారు వారి పాట' ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి.

మహేశ్ కెరీర్ లో 27వ చిత్రంగా వచ్చిన 'సర్కారు వారి పాట' కు పరశురామ్ పెట్లా దర్శకత్వం వహించారు. ఇందులో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించగా.. వెన్నెల కిషోర్ - సముద్ర ఖని కీలక పాత్రలు పోషించారు.

ఎస్ఎస్ థమన్ సంగీతం సమకూర్చారు. మైత్రీ మూవీ మేకర్స్ - జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్ - 14 రీల్స్ ప్లస్ బ్యానర్స్ పై నవీన్ ఎర్నేని - వై రవిశంకర్ - రామ్ ఆచంట - గోపీ ఆచంట సంయుక్తంగా భారీ బడ్జెట్ తో నిర్మించారు.