Begin typing your search above and press return to search.

అప్పుడే సంక్రాంతి కోసం కొట్టుకుంటున్నారు.. ఏమి జరుగుతుందో..!

By:  Tupaki Desk   |   31 July 2021 11:41 AM GMT
అప్పుడే సంక్రాంతి కోసం కొట్టుకుంటున్నారు.. ఏమి జరుగుతుందో..!
X
టాలీవుడ్ లో కొన్నేళ్ల తర్వాత సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద స్టార్ హీరోలు తలపడనున్నారు. కరోనా నేపథ్యంలో ఈ ఏడాది పండక్కి దూరంగా ఉన్న అగ్ర హీరోలందరూ 2022 సంక్రాంతి కోసం ఇప్పటికే కర్చీఫ్స్ వేసి పెట్టారు. మహేష్ బాబు 'సర్కారు వారి పాట'.. పవన్ కళ్యాణ్ - రానా దగ్గుబాటి 'అయ్యప్పనుమ్ కొశీయుమ్' రీమేక్.. ప్రభాస్ 'రాధే శ్యామ్' చిత్రాలను ఒకే సీజన్ లో విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు.

కోవిడ్ పరిస్థితుల నేపథ్యంలో ఇప్పటికే షూటింగులు పూర్తి చేసుకుని విడుదలకు రెడీగా ఉన్న పెద్ద సినిమాలను ఇంకా ప్రేక్షకుల ముందుకు తీసుకురాలేదు. థియేటర్లు తెరిచినా వాటిని ఎప్పుడు రిలీజ్ చేయాలా మేకర్స్ ఆలోచనలో పడిపోయారు. వీటి పరిస్థితి ఇలా ఉంటే అప్పుడే వచ్చే సంక్రాంతి కోసం స్టార్ హీరోలు డేట్స్ బ్లాక్ చేసుకున్నారు. ఇప్పుడు ఈ లిస్ట్ లోకి వెంకటేష్ 'ఎఫ్ 3' కూడా వచ్చి చేరింది. ఇదే క్రమంలో అప్పుడే సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్స్ కూడా స్టార్ట్ అయ్యాయి.

స్టార్ హీరోల సినిమాలు ఒకే సీజన్ లో రిలీజ్ అయితే థియేటర్ల వద్ద సందడి ఎంత ఉంటుందో అంతకు మించి సోషల్ మీడియాలో హంగామా ఉంటుంది. అప్పుడే 2022 సంక్రాంతి సినిమాలు ఫిక్స్ అవడంతో ఐదు నెలల ముందుగానే అభిమానుల హడావిడి మొదలైంది. ఈసారి సంక్రాంతి విన్నర్ మా హీరో అంటే.. కాదు మా హీరో సంక్రాంతి మొగుడు అంటూ కామెంట్స్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలో గతంలో సంక్రాంతి బరిలో దిగిన లెక్కలు అన్ని బయటకు తీస్తూ విమర్శలు, దానికి ప్రతి విమర్శలు చేసుకుంటున్నారు.

కరోనా మహమ్మారి కారణంగా ఇండస్ట్రీలో పరిస్థితులు ఎప్పుడు ఎలా ఉంటాయో చెప్పలేక పోతున్నాం. కోవిడ్ ప్రభావం తగ్గడంతో ఈ ఏడాది ప్రారంభంలో రెండు మూడు నెలలు థియేటర్లలో సినిమాలు బాగానే నడిచాయి. దీంతో ఇబ్బడిముబ్బడిగా సినిమాలన్నీ విడుదల తేదీలను అనౌన్స్ చేశాయి. కానీ నెల తిరిగే సరికి ఈసారి సెకండ్ వేవ్ రావడంతో మళ్ళీ మొదటికే మోసం వచ్చింది. అందరూ తమ సినిమాలను వాయిదా వేసుకుంటూ వచ్చి, ఇప్పుడు రీ షెడ్యూల్ చేసుకుంటున్నారు. నిజానికి ఇప్పుడు సంక్రాంతికి రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న వాటిలో మూడు సినిమాలు ముందుగా అనుకున్న ప్రకారం ఆగస్ట్ లోపు రావాల్సినవనే సంగతి తెలిసిందే.

ఇకపోతే ఇప్పుడు కరోనా థర్డ్ వేవ్ ప్రమాదం పొంచి ఉందనే వార్తలు వస్తున్నాయి. సంక్రాంతికి ఇంకా ఐదున్నర నెలల సమయం ఉంది. ఈ గ్యాప్ లో ఏమి జరుగుతుందో తెలియని పరిస్థితి. థర్డ్ వేవ్ వార్తలు నిజమైతే షూటింగ్ లు జరగడం కూడా కష్టమే. ఇవన్నీ దాటుకుని సినిమా కంప్లీట్ చేసినా థియేటర్స్ దొరకడం అనేది పెద్ద సమస్యగా మారుతుంది. ప్రతి సంక్రాంతి పండుగ రెండు పెద్ద సినిమాలు రెండు చిన్న సినిమాలు అనే విధంగా ఉండేది కాబట్టి.. థియేటర్లు సర్దుబాటు చేసేవారు. కానీ ఇప్పుడు వస్తున్నది ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోలైన మహేష్ బాబు - పవన్ కళ్యాణ్ - ప్రభాస్ ల పెద్ద సినిమాలు. వీరి సరసన ఇప్పుడు వెంకీ మామ కూడా వచ్చి చేశాడు. వీటికి తోడు 'బీస్ట్' అనే డబ్బింగ్ సినిమా కూడా రావాలని చూస్తోంది. మరి వీటన్నింటికి థియేటర్స్ అడ్జస్ట్ చేయడం చేయడం అంటే అంత ఈజీ కాదు. కానీ ఇవేమీ ఆలోచించని హీరోల ఫ్యాన్స్ మాత్రం ఇప్పటి నుంచే కొట్టుకోవడం ఏంటని సగటు సినిమా అభిమాని కామెంట్ చేస్తున్నారు.