Begin typing your search above and press return to search.

సంక్రాంతి ఫైట్: 'RRR' vs 'రాధే శ్యామ్' vs 'భీమ్లా నాయక్'

By:  Tupaki Desk   |   13 Oct 2021 10:30 AM GMT
సంక్రాంతి ఫైట్: RRR vs రాధే శ్యామ్ vs భీమ్లా నాయక్
X
కరోనా నేపథ్యంలో ఉత్తరాదిన థియేట్రికల్ బిజినెస్ ని దృష్టిలో పెట్టుకొని పాన్ ఇండియా చిత్రాలు విడుదలకు వెనకడుగు వేశాయి. అక్టోబర్ చివరి వారం నుంచి థియేటర్లు తెరుచుకోడానికి మహారాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో ఇప్పుడు ఒక్కొటొక్కటిగా రిలీజ్ డేట్స్ ని లాక్ చేసుకుంటున్నాయి. అల్లు అర్జున్ 'పుష్ప' సినిమా ఫస్ట్ పార్ట్ ని 2021 డిసెంబర్ 17న ప్రేక్షకుల ముందుకు తీసుకురాడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇక 2022 సంక్రాంతి కానుకగా జనవరి 7న దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ 'ఆర్.ఆర్.ఆర్' విడుదల కానుంది.

ఎన్టీఆర్ - రామ్ చరణ్ హీరోలుగా నటించిన 'RRR' సినిమా రిలీజ్ డేట్ ఇవ్వకముందే మహేష్ బాబు - ప్రభాస్ - పవన్ కళ్యాణ్ వంటి స్టార్ హీరోలు సంక్రాంతి బరిలో దిగుతున్నట్లు ప్రకటించారు. దీంతో ఫెస్టివల్ బాక్సాఫీస్ వద్ద తీవ్ర పోటీ అనివార్యంగా కనబడుతోంది. ఈ నేపథ్యంలో థియేటర్లలో సినిమాల క్లాష్ పై చర్చించడానికి చిత్ర పరిశ్రమ ఇప్పటికే ఓ కమిటీని ఏర్పాటు చేసిందని.. త్వరలోనే విడుదల తేదీలపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 'సర్కారు వారి పాట' చిత్రాన్ని జనవరి 13న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు కరోనా ఫస్ట్ వేవ్ టైం లోనే అనౌన్స్ చేశారు. ఫస్ట్ లుక్ పోస్టర్ దగ్గర నుంచి టీజర్ వరకూ అన్నిట్లో సంక్రాంతి రిలీజ్ అని చెబుతూ వచ్చారు. అయితే ఇప్పుడు RRR రాకతో మహేష్ సినిమా విడుదలను 2022 సమ్మర్ కి వాయిదా చేస్తున్నారని టాక్ నడుస్తోంది. ఈ మేరకు మహేష్ బాబును రాజమౌళి ఇప్పటికే ఒప్పించాడని నివేదికలు చెబుతున్నాయి. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

అలానే పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ప్రభాస్ 'రాధే శ్యామ్' చిత్రాన్ని జనవరి 14న విడుదల చేయనున్నట్లు మేకర్స్ అఫిషియల్ గా అనౌన్స్ చేశారు. 'ఆర్.ఆర్.ఆర్' చిత్రాన్ని జనవరి 7న థియేటర్లలోకి తీసుకొచ్చినా వెనక్కి తగ్గేది లేదని స్ట్రాంగ్ గా ఫిక్స్ అయ్యారు. వాయిదా వేసే అవకాశమే లేదని.. మకర సంక్రాంతి కి రావడం పక్కా అని ఇప్పటికే రెండుసార్లు యూవీ టీమ్ నిర్ధారించారు.

పవన్ కళ్యాణ్ మరియు రానా దగ్గుబాటి హీరోలుగా నటిస్తున్న 'భీమ్లా నాయక్' చిత్రాన్ని పండుగ సందర్భంగా జనవరి 12న విడుదల చేస్తామని ప్రకటించారు. అయితే సంక్రాంతి క్లాష్ ని నివారించేందుకు ఫిబ్రవరి 24 తేదీకి పోస్ట్ పోన్ చేస్తారని ఆ మధ్య వార్తలు వచ్చాయి. కానీ చిత్ర నిర్మాతలు మాత్రం సంక్రాంతి కే విడుదల చేయబోతున్నట్లు ప్రకటనలు ఇస్తున్నారు. ఏ అప్డేట్ ఇచ్చినా దాని మీద 2022 జనవరి 12 రిలీజ్ అని మెన్షన్ చేస్తున్నారు. దీన్ని బట్టి చూస్తే రెండు పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ కు పోటీగా భీమ్లా నాయక్ కూడా బరిలో దిగాలని చూస్తున్నట్లు అర్థం అవుతోంది.

ఇకపోతే ముగ్గురు స్టార్ హీరోలు వస్తున్నా సరే వెంకటేష్ - వరుణ్ తేజ్ నటించిన 'ఎఫ్ 3' చిత్రాన్ని సంక్రాంతి సమయంలోనే విడుదల చేయాలని అనుకున్నారు. అలానే అక్కినేని నాగార్జున - నాగచైతన్య కలిసి చేస్తున్న 'బంగార్రాజు' సినిమాను కూడా ఫెస్టివల్ సీజన్ లో దింపాలని ప్లాన్ చేసుకున్నారు. అయితే ఇప్పుడు మాత్రం ఈ రెండు సినిమాలు సైలెంట్ అయిపోయాయి. వీటితో పాటుగా సంక్రాంతి బెర్త్ కోసం తెగ ట్రై చేసిన చిరంజీవి 'ఆచార్య' కూడా ముందుకు జరిగింది. 2022 ఫిబ్రవరి 4వ తేదీని ఈ సినిమా కోసం లాక్ చేశారు.

ప్రస్తుతానికైతే సంక్రాంతి వార్ లో 'ఆర్ ఆర్ ఆర్' - 'రాధే శ్యామ్' వంటి రెండు పాన్ ఇండియా చిత్రాలు.. తెలుగులో మాత్రమే రిలీజ్ అయ్యే 'భీమ్లా నాయక్' పోటీ పడనున్నాయనే విషయం స్పష్టం అయింది. వీటితోపాటు 'వలిమై' 'బీస్ట్' వంటి డబ్బింగ్ సినిమాకు కూడా వచ్చే అవకాశం ఉంది. ఏదేమైనా ఇది గత దశాబ్ద కాలంలో అతిపెద్ద బాక్సాఫీస్ ఫైట్ అవుతుందని చెప్పవచ్చు. రాజమౌళి - ఎన్టీఆర్ - రామ్ చరణ్ - పవన్ కళ్యాణ్ - ప్రభాస్ సినిమాలకు సాధారణంగానే భారీ ఓపెనింగ్స్ వస్తుంటాయి. అలాంటిది సంక్రాంతి పండుగ అంటే థియేటర్ల వద్ద హంగామా మామూలుగా ఉండదు. ఏమి జరుగుతుందో చూడాలి.