Begin typing your search above and press return to search.

డ్రగ్స్‌ కేసులో కీలక పరిణామం.. మరో వారం రోజులు కస్టడీలోనే...!

By:  Tupaki Desk   |   19 Sep 2020 2:00 PM GMT
డ్రగ్స్‌ కేసులో కీలక పరిణామం.. మరో వారం రోజులు కస్టడీలోనే...!
X
కన్నడ చిత్ర సీమలో వెలుగు చూసిన డ్రగ్స్‌ కేసులో హీరోయిన్‌ రాగిణి ద్వివేది మరియు సంజన గల్రానీలు అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. రాగిణి, సంజనలకు పలువురు డ్రగ్‌ పెడ్లర్లతో సంబంధాలు ఉన్నాయని.. వారు పార్టీలలో డ్రగ్స్ తీసుకున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే జ్యూడిషియల్‌ కస్టడీలో ఉన్న వీరిద్దరూ బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకున్నారు. ఈ రోజు బెయిల్‌ మీద బయటకు వస్తామని భావిస్తుండగా వారి ఆశలపై కోర్ట్ నీళ్లు చల్లినట్లు తెలుస్తోంది. వీరు పెట్టుకున్న బెయిల్ పిటిషన్ విచారణ ఈ రోజు జరగాల్సి ఉండగా.. దాన్ని సెప్టెంబర్ 21 కి వాయిదా వేశారు. బెంగుళూరు సెంట్ర‌ల్ క్రైమ్ బ్రాంచ్ అధికారులు తమ దర్యాప్తు ఇంకా పూర్తి కాలేదని.. బెయిల్‌ పిటిషన్‌ విచారణని వాయిదా వేయాలని కోరినట్లు తెలుస్తోంది. దీంతో బెంగళూరులోని నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌ స్టాన్సెస్ ప్రత్యేక కోర్టు రాగిణి మరియు సంజన ల బెయిల్ పిటిషన్ విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేసింది.

కాగా, డ్రగ్స్‌ కేసులో రాగిణి ద్వివేది - సంజన గల్రానిలను ప్రస్తుతం పరపన అగ్రహార జైలులో ప్రత్యేక సెల్‌ లో ఉంచారని తెలుస్తోంది. ఇక వీరిద్దరితో పాటు రవిశంకర్ - రాహుల్ థోన్స్ - నైజీరియా సైమన్ సహా తొమ్మిది మందిని పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా ఈ కేసులో ప్ర‌ధాన నిందితుడు లూమ్‌ పెప్పర్‌ సాంబాను కూడా బెంగుళూరు సెంట్ర‌ల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సెలబ్రిటీలకు మత్తు పదార్థాలను సరఫరా చేస్తున్నట్లు నిందితుడు ఒప్పుకున్నాడని సమాచారం. ఇదిలా ఉండగా డ్రగ్స్ కేసులో ఐంద్రితా రే మరియు దిగంత్‌ ల జంటను విచారించిన పోలీసులు.. వారి నుంచి కొన్ని వస్తువులు స్వాధీనం చేసుకొని పంపించారని తెలుస్తోంది. ఇదే క్రమంలో కన్నడ నటులు అకుల్ బాలాజీ - సంతోష్ కుమార్ మరియు మాజీ ఎమ్మెల్యే కుమారుడు యువరాజ్‌ లను సీసీబీ విచారణకు పిలిచారు.