జస్ట్ 4 నెలల్లో 26 కేజీలు ఎలా తగ్గిందో చెప్పేసిన సానియా

Sun Dec 08 2019 12:53:43 GMT+0530 (IST)

Sania Mirza Shares Secrets Of Her Post-Pregnancy Weight

హైదరాబాదీ టెన్నిస్ స్టార్.. ఫ్యాషన్ ఐకాన్ గా చెప్పుకునే సానియామీర్జా ఆసక్తికర అంశాన్ని రివీల్ చేశారు. పాకిస్థానీ క్రికెటర్ ను పెళ్లాడిన ఆమె ఆ మధ్యన ఇజ్హాన్ కు జన్మనివ్వటం తెలిసిందే. ప్రెగ్నెన్సీ సమయంలో బరువు పెరగటం.. ఆ సందర్భంగా ఆమెపై బాడీ షేమింగ్ వ్యాఖ్యలు చేసిన వైనాన్ని ప్రస్తావిస్తూ.. కొన్ని విషయాల్ని వెల్లడించారు.ప్రెగ్నెన్సీ సమయంలో మహిళలు బరువు పెరగటం సహజమని.. దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. సాధారణంగా అందరిలానే తాను బరువు పెరిగానని.. అయినప్పటికీ తనను ట్రోల్ చేసి తప్పు పట్టారని వాపోయారు. కొడుకు పుట్టిన మూడు నెలల తర్వాత నుంచి తాను వ్యాయామం చేయటం షురూ చేసినట్లు వెల్లడించారు.

నిపుణుల సూచనలతో కఠినమైన వ్యాయామం చేసి కేవలం నాలుగు నెలల వ్యవధిలోనే ఇరవై ఆరు కేజీల బరువు తగ్గినట్లుగా చెప్పారు. పెళ్లికి ముందు తన తీరు ఎలా ఉందో ఇప్పుడూ అలానే ఉందన్న ఆమె.. పెళ్లికి ముందు వంట చేయటం రాదన్నారు. ఇప్పుడు కూడా రాదని.. అందుకే మంచి కుక్ ను ఇంట్లో పెట్టుకున్నట్లు చెప్పుకొచ్చింది. మిగిలిన విషయాల్ని వదిలేస్తే.. శ్రమించాలే కానీ బరువు తగ్గటం పెద్ద విషయమేమీ కాదన్న విషయాన్ని సానియాను లైవ్ ఎగ్జాంఫుల్ గా చెప్పొచ్చు.