Begin typing your search above and press return to search.

మినీ రివ్యూ : సంధ్యా రాజు 'నాట్యం' ఎలా ఉందంటే..?

By:  Tupaki Desk   |   22 Oct 2021 11:03 AM GMT
మినీ రివ్యూ : సంధ్యా రాజు నాట్యం ఎలా ఉందంటే..?
X
ప్రముఖ కూచిపూడి డ్యాన్సర్ సంధ్యారాజు ప్రధాన పాత్రలో న‌టిస్తూ.. స్వీయ నిర్మాణంలో రూపొందించిన చిత్రం ''నాట్యం''. సంధ్య రాజు ఈ సినిమాతో నటిగానే కాకుండా కొరియోగ్రాఫర్ గా, ప్రొడక్షన్ డిజైనర్ మరియు కాస్ట్యూమ్ డిజైనర్‌ గా అరంగేట్రం చేశారు. రేవంత్ కొరుకొండ ఈ చిత్రానికి దర్శకత్వం - సినిమాటోగ్రఫీ - ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు. చిరంజీవి - బాల‌కృష్ణ‌ - వెంక‌టేష్‌ - రవితేజ - రామ్ చరణ్ వంటి స్టార్ హీరోలు ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగం అవడం.. సంధ్యారాజు ప్రయ‌త్నాన్ని అభినందిస్తూ ప్రశంస‌లు కురిపించ‌డంతో అంద‌రి దృష్టి ఈ సినిమాపై ప‌డింది. నిష్రింకాల ఫిల్మ్స్ బ్యానర్ పై రూపొందిన ఈ సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

నాట్యం - సంగీతం ప్రధానాంశాలుగా వచ్చిన ‘సాగ‌ర సంగమం’ ‘శంక‌రాభ‌ర‌ణం’ ‘స్వర్ణక‌మ‌లం’ ‘సిరిసిరి మువ్వ’ వంటి క‌ళాత్మక చిత్రాలు తెలుగు సినీ ప్రియుల‌పై చెర‌గ‌ని ముద్ర వేశాయి. కానీ క‌ళాత్మక సినిమాలకు ప్రశంస‌లు దక్కుతుంటాయే త‌ప్ప‌.. కాసులు కురిపించ‌వ‌ని చాలా సినిమాలు నిరూపించాయి. అందుకే ఫిల్మ్ మేకర్స్ ఆ త‌ర‌హా ప్రయ‌త్నాలు చేయడానికి సాహసించరు. ఇలాంటి ప‌రిస్థితుల్లో సంధ్యారాజు - ద‌ర్శకుడు రేవంత్ నృత్యం ప్రధాన క‌థాంశంగా తీసుకొని ''నాట్యం'' సినిమా తెరకెక్కించారు.

కథలోకి వెళ్తే.. సంప్రదాయ నృత్యానికి ప్రసిద్ధి చెందిన నాట్యం అనే గ్రామంలో సితార (సంధ్యా రాజు) కూడా ఒక‌ డ్యాన్సర్. సితార చిన్నతనంలోనే అద్భుత నర్తకి కాదంబరి కథ గురించి వింటుంది. ఆ కథ పై ఆసక్తితో నాట్యం నేర్చుకుంటుంది. తన గురువు (ఆదిత్య మేన‌న్‌) చెప్పిన కాదంబ‌రి క‌థ‌ను ఎప్పటికైనా అంద‌రి ముందు ప్రద‌ర్శించాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకుంటుంది. అయితే సితార కోరిక‌కు ఆమె గురువు అడ్డు చెప్పడానికి కారణమేంటి? అస‌లు కాదంబ‌రి క‌థ ఏంటి? ఆ క‌థ‌ను సితార ప్రజ‌లంద‌రి ముందు ప్రదర్శించిందా లేదా? సితార జీవితంలో వెస్ట్రన్ డ్యాన్సర్ రోహిత్ (రోహిత్ బెహ‌ల్‌) - హరి (క‌మ‌ల్ కామ‌రాజు) పాత్ర ఏంటి? చివరకు ఆమె కథ ఎలా ముగిసింది? అనేది తెలియాలంటే 'నాట్యం' సినిమా చూడాల్సిందే.

అయితే టాలీవుడ్ స్టార్స్ అందరూ ప్రమోట్ చేసిన 'నాట్యం' సినిమా తొలిరోజు మిశ్రమ స్పందన తెచ్చుకుంది. ఎంచుకున్న స్టోరీ లైన్‌.. దాన్ని ఆరంభించిన తీరు బాగున్నా.. భావోద్వేగ‌భ‌రిత‌మైన ఎమోష‌న‌ల్ డ్రామాగా చెప్పడంలో ఫెయిల్ అయ్యారని ప్రేక్షకులు చెబుతున్నారు. రొటీన్ స్క్రీన్ ప్లే.. సాగదీత సన్నివేశాలు.. హీరోహీరోయిన్ల మధ్య ప్రేమను ఎలివేట్ చేసే బలమైన సీన్స్ లేకపోవడం ఇందులో మైనస్ పాయింట్స్ అని తెలుస్తోంది. ముఖ్యంగా సెకండ్ హాఫ్ ఆశించిన స్థాయిలో లేకపోవడం.. సీరియల్ తరహా సీన్స్ జనాలు బోర్ గా ఫీల్ అయ్యేలా చేస్తున్నాయి. మొత్తం మీద 'నాట్యం' సినిమా అక్కడక్కడ మాత్రమే మెప్పించిందనిఆడియన్స్ తీర్పు ఇచ్చేశారు.

కాకపోతే 'నాట్యం' సినిమాలో నటించి నిర్మించిన సంధ్యా రాజు కు మంచి మార్కులు పడుతున్నాయి. తొలి సినిమానే అయినా సితార పాత్రలో సంధ్యా రాజు అభిన‌యం.. క్లాసిక‌ల్ డ్యాన్స్ విష‌యంలో ఆమె ప్రతిభ ప్రేక్షకుల్ని క‌ట్టిప‌డేస్తోంది. శ్రావ‌ణ్ భ‌ర‌ద్వాజ్ అందించిన పాట‌లను సంధ్యారాజు తెర మీద ఆవిష్కరించిన విధానం ఆకట్టుకుంటోంది. ఆరంభంలో క‌మ‌ల్ కామ‌రాజు తో.. ముగింపులో రోహిత్‌ తో సంధ్య చేసే డ్యాన్సులు ప్రేక్షకులను అలరిస్తున్నాయి. నిష్రింకాల ఫిల్మ్స్ బ్యానర్ ప్రొడక్షన్ వాల్యూస్ ని అందరూ మెచ్చుకుంటున్నారు. కథా నేపథ్యాన్ని నమ్మి నాట్యం గురించి చెప్పడానికి వారు చేసిన ప్రయత్నాన్ని కొనియాడుతున్నారు.

ఇకపోతే 'నాట్యం' సినిమా చూసిన నందమూరి బాలకృష్ణ చిత్ర బృందాన్ని అభినందించారు. ఇది సినిమా కాదని.. ఒక కళాఖండమని అన్నారు. నాట్య కళను భావితరాల వారికి అందించే ప్రయత్నం చేసిన సంధ్యా రాజు - దర్శకుడిని అభినందించారు. కొరియోగ్రఫీ చాలా బాగుందని.. దీన్ని తెర మీద ఆవిష్కరించిన విధానం బాగుందని బాలయ్య మెచ్చుకున్నారు. సంధ్యా రాజు తన పాత్రలో పరకాయప్రవేశం చేసారని చెప్పిన బాలకృష్ణ.. మిగతా నటీనటులు సాంకేతిక నిపుణులకు శుభాకాంక్షలు తెలియజేసారు.