అర్జున్ రెడ్డి కాంబో అప్పుడే రిపీట్!

Mon Oct 14 2019 11:00:57 GMT+0530 (IST)

సాధారణ సినిమాలు వేరు.. క్రేజీ కాంబినేషన్లు వేరు.  సందీప్ రెడ్డి వంగా- విజయ్ దేవరకొండ కాంబినేషన్ ఎలాంటిదో ఎవరిని అడిగినా చెప్పేస్తారు. మరోసారి ఇద్దరూ కలిసి పనిచేస్తున్నారంటే చాలు ఆ సినిమా ప్రకటించిన రోజే క్రేజీ ప్రాజెక్టుగా మారిపోతుంది.  ఎందుకంటే వారిద్దరి కాంబినేషన్లో తెరకెక్కిన తొలి సినిమా ప్రభావం అలాంటిది. 'అర్జున్ రెడ్డి' తర్వాత సందీప్ కు బాలీవుడ్ అవకాశం రావడం.. తన సినిమానే హిందీలో 'కబీర్ సింగ్' గా రీమేక్ చేసి బ్లాక్ బస్టర్ సాధించడం ఇప్పుడు ఓ చరిత్ర.  ఆ సినిమా తర్వాత సందీప్ తన రెండవ బాలీవుడ్ సినిమాకు రెడీ అవుతున్నాడు.  ఈమధ్యే అధికారికంగా సినిమా గురించి వెల్లడించారు. సందీప్ బాలీవుడ్ జర్నీ సరే.. మరి విజయ్ దేవరకొండతో మరో సినిమా ఎప్పుడు చేస్తాడు? ఈ విషయమే రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో అడిగితే క్షణం తడుముకోకుండా  బదులిచ్చాడు. ప్రస్తుతం చేస్తున్న హిందీ సినిమా తర్వాత విజయ్ తోనే చేస్తానని వెల్లడించాడు.

సందీప్ తన మొదటి బాలీవుడ్ సినిమాతో హిందీ ప్రేక్షకులను క్లీన్ బౌల్డ్ చేశాడు. ఒక్కసారిగా బాలీవుడ్ లో క్రేజీ డైరెక్టర్ గా మారాడు. అందుకే మరో ఆఫర్ వెతుక్కుంటూ వచ్చింది.  ఈ సినిమా తర్వాత విజయ్ కాంబినేషన్ లో సినిమా అంటే ఆది దాదాపుగా ప్యాన్ ఇండియా ఫిలిం అయ్యే ఉంటుంది. ఏదేమైనా విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కు ఇది క్రేజీ అప్డేట్ అనే చెప్పాలి.