Begin typing your search above and press return to search.

డ్రగ్స్ కేసు: హీరోయిన్లకు బెయిల్ ఇవ్వండి అంటూ కోర్టుకు బెదిరింపు లేఖతో పాటు డిటోనేటర్ పార్శిల్?

By:  Tupaki Desk   |   20 Oct 2020 8:30 AM GMT
డ్రగ్స్ కేసు: హీరోయిన్లకు బెయిల్ ఇవ్వండి అంటూ కోర్టుకు బెదిరింపు లేఖతో పాటు డిటోనేటర్ పార్శిల్?
X
శాండిల్ వుడ్ డ్రగ్స్ వ్యవహారం కేసు విచారణ చేస్తున్న బెంగళూరు సిటీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు నటీమణులు రాగిణి ద్వివేది - సంజనా గల్రానీలను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో ఉన్న రాగిణి - సంజనాలకు బెయిల్ ఇవ్వడానికి బెంగళూరులోని ప్రత్యేక కోర్టు నిరాకరించింది. అయితే తనకు బెయిల్ మంజూరు చెయ్యాలని ఇప్పటికే నటి సంజనా కర్ణాటక హైకోర్టును ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో డ్రగ్స్ కేసులో అరెస్టు అయిన హీరోయిన్లకు బెయిల్ ఇవ్వకపోతే కోర్టును బాంబుతో పేల్చేస్తామని కోర్టుకు, జడ్జికి బెదిరింపు లేఖలు వచ్చినట్లు తెలుస్తోంది.

బెంగళూరు సిటీ సివిల్ కోర్టులోని సీసీహెచ్ 36వ కోర్టుకు సోమవారం సాయంత్రం సమయంలో కర్ణాటకలోని తుమకూరు జిల్లా నుంచి ఓ పార్శిల్ కవర్ పోస్టులో వచ్చింది. రాగిణి - సంజనాలు అమాయకులు.. అనవసరంగా ఇద్దరినీ అరెస్టు చేసి జైల్లో పెట్టారు.. వెంటనే వారిద్దరికి బెయిల్ ఇవ్వండి లేదా బెయిల్ రావడానికి సహకరించండి అంటూ న్యాయమూర్తిని బెదిరిస్తూ ఆ లేఖ రాయబడింది. బెదిరింపు లేఖలో పాటు క్వారీలలో ఉపయోగించే డిటోనేటర్ కూడా ఉందని తెలుస్తోంది. దీంతో న్యాయమూర్తి సీనప్పతో పాటు కోర్టు ఆవరణంలో ఉన్న న్యాయవాదులు ఆందోళనకు గురై సురక్షిత ప్రాంతానికి తరలి వెళ్లారు. విషయం తెలుసుకున్న బాంబు నిర్వీర్య దళం సిబ్బంది బెంగళూరు సిటీ సివిల్ కోర్టుకు వచ్చి పార్శిల్ కవర్ లోని డిటోనేటర్ కు అమర్చిన వైర్లు కట్ చేశారని మీడియా వర్గాలు వెల్లడించాయి.

ఇంతకముందు రాగిణి - సంజనాల డ్రగ్స్ కేసు విచారణ.. డీజే హళ్ళి, కేజీ హళ్ళి గొడవల కేసుల విచారణ నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ బెంగళూరు నగర పోలీసు కమిషనర్ మరియు జాయింట్ పోలీసు కమిషనర్ తదితరులను బెదిరిస్తూ ఓ లేఖ పంపించారు. ఈ కేసుల విచారణ నుంచి తప్పుకోవాలని, నిందితులకు బెయిల్ ఇవ్వకపోతే పోలీసు అధికారులు, న్యాయమూర్తుల కార్లను పేల్చివేస్తామని లేఖలలో పేర్కొన్నారు. ఇప్పుడు న్యాయమూర్తులను బెదిరిస్తూ డిటోనేటర్ పంపడం కలకలం రేపింది. ఈ రెండు ఘటనలపై కేసులు నమోదు చేసిన పోలీసు అధికారులు విచారణ ముమ్మరం చేశారు. కర్ణాటకలోని తుమకూరు జిల్లా గుబ్బి తాలుకా బేళూరు నుంచి ప్రత్యేక కోర్టుకు బెదిరింపు లేఖ మరియు డిటోనేటర్ పార్శిల్ వచ్చిందని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. కోర్టును బెదిరిస్తూ లేఖ పంపించిన నిందితులకు.. రాగిణి - సంజనాలకు సంబంధం ఏంటనే కోణంలో క్రైమ్ బ్రాంచ్ పోలీసులు విచారణ చేస్తున్నారు.