ఆహాలో సముద్రఖని క్రైమ్ థ్రిల్లర్

Thu May 26 2022 07:00:02 GMT+0530 (IST)

Samuthirakani Writer On AHA

తమిళ దర్శకుడు సముద్రకని తన సొంత భాషలో కంటే ఇప్పుడు తెలుగులోనే ఎక్కువగా బిజీ అవుతున్నాడు. దర్శకుడిగా కెరీర్ మొదలు పెట్టిన అతను ఆ తర్వాత నటుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్నాడు. ఏ సినిమా చేసినా కూడా అందులో హైలెట్ అయ్యే పాత్రలను కూడా సెలెక్ట్ చేసుకుంటున్నాడు. రీసెంట్ గా RRR సినిమాలో కూడా ఒక మంచి పాత్రలో కనిపించిన విషయం తెలిసిందే.అంతేకాకుండా టాలీవుడ్ ఇండస్ట్రీలో రాబోయే మరికొన్ని బిగ్ బడ్జెట్ సినిమాల్లో కూడా సముద్రఖని అనే ముఖ్యమైన పాత్రల్లో కనిపించబోతున్నాడు. అయితే సముద్రకని చేసిన కొన్ని ప్రయోగాత్మకమైన చిత్రాలు ఇప్పుడు తెలుగులో అనువాదం అవుతున్నాయి. ఈ నటుడికి తెలుగులో మంచి క్రేజ్ రావడంతో ముఖ్యమైన పాత్రల్లో నటించిన రైటర్ అనే సినిమాను ఆహా ప్లాట్ ఫామ్ లో విడుదల చేయబోతున్నారు.

క్రైమ్ థ్రిల్లర్ గా రూపొందిన రైటర్ సినిమా తమిళం బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో విజయాన్ని అందుకుంది. కొత్త దర్శకుడు ఫ్రాంక్లిన్ జాకోబ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఇప్పుడు ఆహా తెలుగులో మే 27 ప్రీమియర్ చేయనున్నట్లు ప్రకటించింది. ఒరిజినల్ వెర్షన్ కూడా ఆహా తమిళ్ ప్లాట్‌ఫారమ్‌లో ప్రసారం చేయడానికి కూడా అందుబాటులో ఉంది. ఇక సముద్రకని కేవలం నటుడిగానే కాకుండా మళ్లీ తన డైరెక్షన్ తో కూడా బిజీ అవ్వడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు.

ముఖ్యంగా తెలుగులో కూడా ఆయన పవన్ కళ్యాణ్ తో సినిమా చేయాలని అనుకుంటున్నాడు. తమిళంలో సముద్రకని నటించిన వినోదయ సితం సినిమాను తెలుగులో రీమేక్ చేయడానికి ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. త్రివిక్రమ్ రచన సహకారం తో సముద్రఖని పవన్ కళ్యాణ్ ను డైరెక్ట్ చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాడు. ఇక ఆ సినిమాలో మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కూడా నటించబోతున్నట్లుగా తెలుస్తోంది. త్వరలోనే అఫీషియల్ గా సినిమాను ఎనౌన్స్ చేసి రెగ్యులర్ షూటింగ్ కూడా స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారు. మరి ఈ ప్రాజెక్టు ఎంత వరకు సక్సెస్ అవుతుందో చూడాలి.