Begin typing your search above and press return to search.

ప్రకాష్‌ రాజ్‌ కు ప్రత్యామ్నాయం అయ్యేనా?

By:  Tupaki Desk   |   31 July 2021 9:30 AM GMT
ప్రకాష్‌ రాజ్‌ కు ప్రత్యామ్నాయం అయ్యేనా?
X
టాలీవుడ్‌ లో దాదాపుగా రెండు దశాబ్దాల కాలంగా ప్రకాష్‌ రాజ్‌ విలన్‌ గా మరియు క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా కొనసాగుతున్న విషయం తెల్సిందే. సుదీర్ఘ కాలంగా ప్రకాష్‌ రాజ్ ను చూస్తున్న ప్రేక్షకులు కాస్త కొత్తదనంను కోరుకుంటున్నట్లుగా అనిపిస్తుంది. పైగా ఫిల్మ్‌ మేకర్స్ కూడా ప్రకాష్‌ రాజ్‌ ను ఇంతకు ముందు మాదిరిగా మోస్ట్‌ వాంటెడ్ అన్నట్లుగా భావించడం లేదు. గతంలో మాదిరిగా ప్రతి సినిమాకు ప్రకాష్‌ రాజ్‌ అన్నట్లుగా పరిస్థితి లేదు. ఇప్పుడు ప్రకాష్‌ రాజ్‌ తక్కువ సినిమాలు చేస్తున్నాడు. ఒకప్పుడు కొన్ని పాత్రలను ప్రకాష్ రాజ్ మాత్రమే చేయగలడు.. ఆయనతో చేయిస్తేనే ఆ పాత్రలు బాగుంటానే అభిప్రాయం ఉండేది. కాని ఇప్పుడు సీనియర్‌ యాక్టర్స్ చాలా మంది అయ్యారు.

జగపతి బాబు మొదలుకుని తమిళ దర్శకుడు కమ్‌ నటుడు సముద్ర ఖని వరకు ఎంతో మంది క్యారెక్టర్‌ ఆర్టిస్టులుగా విలన్స్ గా నటిస్తున్నారు. దాంతో ప్రకాష్‌ రాజ్‌ కాస్త పరిమిత పాత్రలతో కనిపిస్తున్నాడు. ముఖ్యంగా ప్రస్తుతం టాలీవుడ్‌ లో క్యారెక్టర్‌ ఆర్టిస్టులుగా విలన్‌ పాత్రల్లో మోస్ట్‌ వాంటెడ్‌ అన్న వారిలో సముద్రఖని ముందు ఉన్నారు. జగపతిబాబు కూడా వరుస సినిమాల్లో చేస్తూ ఉన్నా సముద్రఖని విషయంలో దర్శకులు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ఆయన అల వైకుంఠపురంలో సినిమాలో కనబర్చిన వేరియేషన్స్‌ మరియు ఇతర సినిమాల్లో ఆయన ప్రదర్శిస్తున్న నటన ప్రతిభ సినిమాపై అంచనాలు పెంచే విధంగా ఉంటుంది.

సినిమా స్థాయిని ఒక హీరో తో పాటు క్యారెక్టర్‌ ఆర్టిస్టు కూడా పెంచగలడు. ఆ విషయాన్ని సముద్రఖని నిరూపించారు. తెలుగు లో వరుసగా సినిమాలు చేస్తున్న సముద్రఖని మోస్ట్‌ వాంటెడ్‌ క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా మారిపోయాడు. ఆయన్ను ఫిల్మ్‌ మేకర్స్ వెంట పడి మరీ తమ సినిమాల్లో నటింపజేస్తున్నారు. ప్రస్తుతం సూపర్‌ స్టార్‌ మహేష్ బాబు నటిస్తున్న సర్కారు వారి పాట చిత్రంలో నటిస్తున్నాడు. ఇప్పటికే జక్కన్న రాజమౌళి దర్శకత్వం లో ఆర్‌ ఆర్‌ ఆర్‌ సినిమా లో నటించాడు. సినీ ఇండస్ట్రీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం ఈయన చేతిలో దాదాపుగా చిన్నా పెద్ద సినిమాలు కలిపి అరడజను వరకు ఉన్నాయి. అన్ని సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలను సొంతం చేసుకోవడం ఖాయం అన్నట్లుగా మంచి నమ్మకంతో ఉన్నాయి.

ఆర్‌ ఆర్‌ ఆర్‌ మరియు సర్కారు వారి పాట సినిమాల్లో ఈయన పాత్ర కనుక సూపర్‌ హిట్‌ అయ్యి మరింత గుర్తింపు వస్తే ఇక ప్రకాష్‌ రాజ్‌ కు పూర్తి ప్రత్యామ్నాయం ఈయన అంటూ ఇండస్ట్రీ వర్గాల్లో మరియు మీడియా వర్గాల్లో టాక్‌ వినిపిస్తుంది. ప్రకాష్‌ రాజ్‌ కూడా ప్రస్తుతం పలు సినిమాల్లో నటిస్తు ఉన్నా ఆయన ఇండస్ట్రీలో అడుగు పెట్టి సుదీర్ఘ కాలం అయిన కారణంగా ఆయన్ను కాస్త పక్కకు పెట్టి కొత్త వారితో వర్క్‌ చేయాలని స్టార్‌ ఫిల్మ్‌ మేకర్స్ భావించడం తప్పేం కాదంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

సముద్ర ఖని రాబోయే రెండు సంవత్సరాల్లో టాలీవుడ్‌ లో మోస్ట్‌ వాంటెడ్‌ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌ కమ్‌ విలన్ గా నిలవడం ఖాయం అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. సముద్ర ఖని సినిమా లు వచ్చే ఏడాది నుండి వరుస పెట్టి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. కనుక ఇకపై టాలీవుడ్‌ లో అంతా కూడా సముద్ర ఖని పేరు వినిపించే అవకాశం ఉందని అంటున్నారు. దర్శకుడిగా సుదీర్ఘ కాలంగా ఇండస్ట్రీలో ఉన్న సముద్ర ఖని కి రాని గుర్తింపు ఇప్పుడు నటుడిగా వస్తోంది. కనుక ముందు ముందు సముద్ర ఖని భారీ విజయాలను దక్కించుకుంటాడేమో చూడాలి.