ఎండు `కొబ్బరి మట్ట`తో అలా కొట్టావేం?

Wed Aug 14 2019 18:08:09 GMT+0530 (IST)

Sampoornesh Babu Gets Good Name With Kobbari Matta Movie

వ్యంగ్యంగా వెళితే తొక్కేస్తారు జాగ్రత్త! అని హెచ్చరించిన వాళ్లు ఉన్నారు. బూర్జువా మనస్తత్వాలతో నెగెటివ్ యాటిట్యూడ్ పోగుబడి ఉండే చోట.. నటవారసులకు మాత్రమే పట్టంగట్టే చోట.. అసలు ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేని వాళ్లకు చోటు ఉంటుందా? అని పెదవి విరిచేశారు. పైగా పరిశ్రమ పైనా.. స్టార్ హీరోలపైన సెటైర్లు వేస్తే బతికి బట్ట కట్టలేవ్ తస్మాత్ జాగ్రత్త! అన్నారు. కానీ అవేవీ పని చేయలేదు. ప్రతిభ మాత్రమే ఇక్కడ పని చేస్తుంది!! అని ప్రూవ్ చేస్తూ ఆశ్చర్యపరుస్తున్నాడు. అతడు ఎవరు? అంటే ప్రత్యేకంగా చెప్పాలా? సంపూ అలియాస్ సంపూర్ణేష్ బాబు.ఒక వరస్ట్ హీరో కోసం వెతుకుతూ ఉంటే కాలికి తగిలిన బంగారు తీగ మా `సంపూర్ణేష్ బాబు` అని `హృదయ కాలేయం` దర్శకుడు కీర్తించారంటే అబ్బో.. సంపూలోని ఆ క్వాలిటీని మెచ్చుకోకుండా ఉండలేం. వైవిధ్యం.. కొత్తదనం.. సెటైర్.. వీటన్నిటి కలబోతతో కూడుకున్న క్రియేటివిటీ సంపూని స్టార్ ని చేసింది. ఆర్జీవీలా కాంట్రవర్శీ అయినా ఉండాలి. లేదా సంపూలా సెటైర్ అయినా వండాలి! అన్నట్టుగానే ఈ కొత్త ఫార్ములా భలేగా వర్కవుటైంది. `హృదయ కాలేయం` అన్న టైటిల్ తో ఎలా కొట్టాడో మరోసారి అలానే కొబ్బరి మట్ట అనే టైటిల్ తోనూ కొట్టేశాడు మరి.

ప్రతి సామాన్యుడి ఇంటి ముందు కనిపించే కొబ్బరి చెట్టు.. కొబ్బరి మట్ట అతడికి కాసులు పండిస్తోంది ఇప్పుడు. అబ్బే టీవీల్లో చూడొచ్చులే అనుకునే వాళ్లను సైతం థియేటర్లకు రప్పించింది ఆ టైటిల్. ఫలితం సంపూ నటించిన `కొబ్బరి మట్ట` సక్సెస్ కొట్టింది. ప్రస్తుతం ఏ నోట విన్నా ఇదే మాట. కొబ్బరి మట్ట ఎంత వసూలు చేసింది? ఎంత బిజినెస్ చేసింది? అన్నది అటుంచితే ఈ సినిమా విజయం గురించి సామాన్య జనం మాట్లాడుకోవడమే అతి పెద్ద సక్సెస్ కింద లెక్క. ఇటీవలే రిలీజైన ఓ అగ్ర హీరో సినిమాని సైతం వెనక్కి నెట్టి కొబ్బరి మట్ట సేఫ్ గేమ్ ఆడిందంటే దటీజ్ కాల్డ్ క్రియేటివిటీ. మెప్పించే కంటెంట్ జనాలకు ముఖ్యం కానీ స్టార్ డమ్ కాదని మరోసారి ప్రూవైంది. ఒళ్లంతా నొప్పులు వదిలేలా కంపరం పుట్టేలా ఎండు కొబ్బరి మట్ట పెట్టి కొట్టడం అంటే ఇదేనన్నమాట!!