అక్కినేని కోడలు .. ఇంతకు ముందు చేయనిది!

Tue Jan 21 2020 15:50:28 GMT+0530 (IST)

 Samantha reveals Her from Family Man

ఇంతకుముందు ఎప్పుడూ చేయనిది ఇంకేదో కొత్తగా చేయాలని అనుకున్నది.. చేసే అవకాశం దక్కితే.. అలాంటి అరుదైన అవకాశాన్ని కాదని అనుకుంటారా? అందుకే ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2 వెబ్ సిరీస్ లో అవకాశం వచ్చిన వెంటనే అంగీకరించిందట సమంత. తెలుగు కుర్రాళ్లు రాజ్ అండ్ డీకే ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ కి దర్శకత్వం వహిస్తున్నారు. సీజన్ 1 బంపర్ హిట్ కొట్టింది. ఇప్పుడు సీజన్ 2లో సమంత జాయిన్ అవ్వడం ప్రధాన ఆకర్షణగా మారింది. సమంత చేరికతో ఇక సీజన్ 2 తెలుగు ఆడియెన్ కి మరింతగా కనెక్టయ్యే ఛాన్సుంది. ఇప్పటివరకూ కేవలం యూత్ మాత్రమే ఆదరించిన ఈ వెబ్ సిరీస్ ని ఇకపై ఫ్యామిలీస్ వీక్షించే వీలుందని అంచనా వేస్తున్నారు.ఇటీవలే సమంత పార్ట్ చిత్రీకరణ పూర్తయింది. ఈ సందర్భంగా టీమ్ కి సెండాఫ్ చెబుతూ సామ్ ఎంతో ఎమోషన్ అయ్యింది. ఇంతకుముందెప్పుడూ చేయని సరికొత్త పాత్రలో నటించానన్న ఆనందం తనలో కనిపించింది. ``ఫ్యామిలీ మ్యాన్ సెట్స్ లో ప్రతి రోజు మరపురానిది. ఇంతకుముందు నేను చేసిన చాలా పాత్రలతో పోలిస్తే ఎంతో విభిన్నమైన పాత్రలో నటించాను. నన్ను నమ్మి ఈ అవకాశం ఇచ్చిన రాజ్ అండ్ డీకే లకు కృతజ్ఞతలు. నిన్నటిరోజున నన్ను ఒక చీకటి గదిలో బంధించేస్తే.. నన్ను నేను కనుగొన్నట్టుగా ఉంది`` అంటూ కవితాత్మకంగా స్పందించింది సోషల్ మీడియాలో. చివరి రోజు షూటింగులో పాల్గొన్నానని సామ్ వెల్లడించింది. దాంతో పాటే ఆన్ లొకేషన్ కి చెందిన ఒక ఫోటోని షేర్ చేసింది. ఇన్ స్టాలో సమంత పాత్రకు సంబంధించిన గెటప్ ని స్వయంగా రివీల్ చేయడంతో ఆ ఫోటో ప్రస్తుతం అభిమానుల్లో వైరల్ గా మారింది. బీచ్ పరిసరాల్లో నిలుచున్న సామ్ పూర్తిగా వెల్ లుక్ లో కనిపిస్తోంది. డెనిమ్ జీన్స్ లోనెక్ టాప్.. దానిపై గళ్ల చొక్కా.. చేతులు మడత పెట్టి నడుముపై చేతులు ఆన్చి తీక్షణంగా చూస్తూ.. అసలు ఆ లుక్ చూస్తుంటే రౌడీ లా కనిపిస్తోంది సామ్. ఫ్యామిలీ మ్యాన్ లో విలనీని ఏ రేంజులో పండించిందో దీనిని బట్టి అర్థమవుతోంది.

ఫ్యామిలీ మ్యాన్ కథానాయకుడు మనోజ్ భాజ్ పాయ్ మాట్లాడుతూ సామ్ నటనపై ప్రశంసలు కురిపించారు. ``సమంత ఫెంటాస్టిక్ నటి. నీతో కలిసి నటించడం అమేజింగ్. ఒక కంఫర్ట్ జోన్ వదిలి విభిన్నమైన పంథాలో నటించావు`` అంటూ జాతీయ అవార్డ్ గ్రహీత మనోజ్ భాజ్ పాయ్ సామ్ పై ప్రశంసలు కురిపించారు. వెబ్ సిరీస్ లో అద్భుతమైన పాత్ర తో హిందీ రంగంలో ప్రవేశించావు అంటూ ప్రశంసించారు. ఇక ఈ వెబ్ సిరీస్ లో సామ్ గెటప్ ఆసక్తిని రేకెత్తిస్తోంది.