Begin typing your search above and press return to search.

'ఖైదీ' నిర్మాతలతో సమంత ద్విభాషా చిత్రం..!

By:  Tupaki Desk   |   15 Oct 2021 10:43 AM GMT
ఖైదీ నిర్మాతలతో సమంత ద్విభాషా చిత్రం..!
X
దక్షిణాది అగ్ర కథానాయికల్లో ఒకరైన సమంత సినిమాలకు బ్రేక్ తీసుకుంటున్నట్లు వెల్లడించిన సంగతి తెలిసిందే. 'శాకుంతలం' సినిమా తర్వాత మరో ప్రాజెక్ట్ కి సైన్ చేయకపోవడంతో సామ్ ఏదో బలమైన నిర్ణయం తీసుకోబోతోందని అర్థం అయింది. ఈ క్రమంలోనే అక్కినేని నాగ చైతన్యతో తన వివాహ బంధాన్ని తెంచుకుంటున్నట్లు ప్రకటించి షాక్ ఇచ్చింది. అప్పటి నుంచి మీడియాకు దూరంగా ఉంటున్న సమంత.. సినిమాలకు సంబంధిచింది ఎలాంటి కొత్త అప్‌డేట్స్ ఇవ్వలేదు.

నేడు దసరా పండుగ సందర్భంగా సమంత తన కొత్త ప్రాజెక్ట్ ను అధికారికంగా ప్రకటించారు. తెలుగు తమిళ భాషల్లో రూపొందే ఓ బైలింగ్వల్ చిత్రానికి సామ్ కమిట్ అయ్యారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ మీద 'ఖైదీ' నిర్మాతలు ఎస్ఆర్ ప్రకాష్ బాబు - ఎస్ఆర్ ప్రభు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇది వారి సంస్థలో రూపొందనున్న 30వ సినిమా. డెబ్యూ డైరెక్టర్ శాంత రూబెన్ జ్ఞానశేఖరన్ ఈ సినిమాని తెరకెక్కించనున్నారు. సమంత తమ సినిమాలో నటిస్తున్నందుకు నిర్మాతలు సోషల్ మీడియా వేదికగా సంతోషం వ్యక్తం చేశారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన ఇతర వివరాలు వెల్లడి కానున్నాయి.

విడాకుల ప్రకటన తర్వాత సమంత వీలైనంత త్వరగా ఆ మూడ్ నుంచి బయటకు రావాలని నిర్ణయించుకుందని అర్థం అవుతోంది. ఎప్పటిలాగే షూటింగ్ లతో బిజీ అవడానికి ప్లాన్ చేసుకున్న సామ్.. ఇప్పటికే పలు ప్రాజెక్ట్స్ ఓకే చేసింది. ఈ క్రమంలోనే తెలుగు తమిళ ద్విభాషా చిత్రాన్ని ప్రకటించారు. దీంతో పాటు మరికొన్ని ప్రాజెక్ట్స్ చర్చల దశలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే గుణశేఖర్ దర్శకత్వంల 'శాకుంతలం' మూవీని కంప్లీట్ చేసి డబ్బింగ్ చెప్పడం స్టార్ట్ చేసింది. విజయ్ సేతుపతి - నయనతారలతో కలిసి ఓ మల్టీస్టారర్ మూవీ షూటింగ్‌ లచేస్తోంది సమంత.

కాగా, సమంత - నాగచైతన్య తమ పదేళ్ల స్నేహం బంధం.. ఏడేళ్ల ప్రేమ.. నాలుగేళ్ళ వివాహ బంధానికి స్వస్తి పలుకుతున్నట్లు ఇటీవలే ప్రకటించారు. ఇకపై తాము భార్యాభర్తలుగా ఉండబోమని.. స్నేహితులుగా కొనసాగుతామని తెలిపారు. ఈ లవ్లీ కపుల్ తమ ప్రేమ కథకు ఊహించని విధంగా అర్థాంతరంగా ముగింపు పలకడం అభిమానులు ఆవేదనకు గురి చేసింది. అయితే సమంత - చైతన్య మాత్రం విడాకుల ప్రకటన తర్వాత కెరీర్ మీద ఫోకస్ పెట్టాలని డిసైడ్ అయ్యారు. ఈ క్రమంలో వరుస సినిమాలకు కమిట్ అవుతూ బిజీగా మారుతున్నారు.