పూజ హెగ్డే ప్లేస్ లో సమంత .. కారణం అదే!

Thu Nov 25 2021 15:18:00 GMT+0530 (IST)

Samantha In Pooja Hegde Place

'అరవింద సమేత' .. 'అల వైకుంఠపురములో' విజయాలతో త్రివిక్రమ్ మాంఛి జోరుమీదున్నాడు. ఆ తరువాత సినిమాను ఆయన మహేశ్ బాబుతో చేయనున్నాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సినిమాలో మహేశ్ బాబు జోడీగా ఆయన పూజ హెగ్డేను తీసుకున్నాడు. ఆమెకు ఆయన మూడోసారి కూడా ఛాన్స్ ఇవ్వడం అందరినీ ఆశ్చర్యపరిచింది. మొత్తానికి ఈ బుట్టబొమ్మ ఖాతాలో ఇంకో హిట్ పడిపోవడం ఖాయమని అనుకున్నారు. కానీ ఇప్పుడు ఈ సినిమాలో ఆమె చేయడం లేదనే టాక్ బలంగా వినిపిస్తోంది.అలా అని చెప్పేసి ఈ ప్రాజెక్టు నుంచి పూజ హెగ్డేను ఎవరూ తప్పించలేదు. ఆమెనే డేట్లు సర్దుబాటు చేయలేకపోతోందట. పూజ హెగ్డే నుంచి ఇటీవల వచ్చిన 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్' హిట్ కొట్టగా ప్రభాస్ సరసన నాయికగా ఆమె చేసిన 'రాధే శ్యామ్' జనవరి 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక చరణ్ జోడీగా ఆమె ప్రత్యేక పాత్రను పోషించిన 'ఆచార్య' ఫిబ్రవరి 4వ తేదీన థియేటర్లకు రానుంది. హిందీలో 'సర్కస్' .. తమిళంలో 'బీస్ట్' సినిమాలు సెట్స్ పై ఉన్నాయి. అందువలన త్రివిక్రమ్ - మహేశ్ కాంబోలో చేయాలని ఆమెకి ఉన్నప్పటికీ డేట్లు కుదరడం లేదట.

ఈ కారణంగానే ఈ సినిమాను చేయలేనని ఆమె త్రివిక్రమ్ కి చెప్పినట్టుగా ఒక టాక్ వినిపిస్తోంది. వచ్చేనెల నుంచే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. దాంతో హీరోయిన్ విషయంలో ఆలస్యం చేయకుండా సమంతను సంప్రదించారట. త్రివిక్రమ్ - మహేశ్ బాబు కాంబినేషన్ అంటే ఎవరు మాత్రం వదులుకుంటారు? అందువల్లనే ఎంత మాత్రం ఆలస్యం చేయకుండా సమంత గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని అంటున్నారు. త్వరలోనే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించనున్నట్టు తెలుస్తోంది. విడాకుల తరువాత సరైన ప్రాజెక్టు కోసం ఎదురుచూస్తున్న సమంతకు ఇది ఊరట కలిగించే అవకాశమే.

గతంలో సమంత ఇటు త్రివిక్రమ్ తోను .. అటు మహేశ్ తోను చేసింది. త్రివిక్రమ్ దర్శకత్వంలో ఆమె చేసిన 'అత్తారింటికి దారేది' .. 'సన్నాఫ్ సత్యమూర్తి' .. 'అ ఆ' సినిమాలు భారీ విజయాలను అందుకున్నాయి. సమంత కెరియర్లో భారీ వసూళ్లను రాబట్టిన సినిమాలుగా నిలిచాయి. ఇక మహేశ్ బాబు జోడీగా ఆమె చేసిన 'దూకుడు' .. 'సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు' సినిమాలు కూడా ఘన విజయాలను అందుకున్నాయి. అందువలన సహజంగానే ఈ సినిమాపై మరింతగా అంచనాలు పెరిగే అవకాశం ఉంది. చూడాలి మరి అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందో!