సమంత వెనక ఇంటర్నేషనల్ షాడో!

Mon Nov 29 2021 08:58:03 GMT+0530 (IST)

Samantha Hollywood Experimenting Movie

ప్రయోగాలు చేయడం సమంతకు కొత్తేమీ కాదు. ఇటీవలే ఫ్యామిలీమ్యాన్ సీజన్ 2లో రాజ్జీ పాత్రతో సామ్ ఆకట్టుకుంది. ప్రపంచవ్యాప్తంగా సమంతకు అసాధారణ ఫాలోయింగ్ పెరగడం వెనక ఈ ప్రయోగాత్మక పాత్ర ప్రధాన కారణం. అలాంటి గొప్ప అవకాశాన్ని రాజ్ అండ్ డీకే బృందం కల్పించారు. అంతకుముందు ఓబేబి చిత్రంలో వృద్ధురాలి షేడ్ ఉన్న పాత్రతో అంతే గొప్పగా మెప్పించిన సామ్ మునుముందు ప్రయోగాల దారినే ఎంచుకోవడం చర్చనీయాంశంగా మారింది.ఇప్పుడు మరో ప్రయోగాత్మక పాత్రలో నటించే అవకాశం సమంతను వరించిందని తెలిసింది. ద్విలింగ సంపర్కురాలి(బైసెక్సువల్) పాత్రలో నటిస్తోందని ఇందులో డిటెక్టివ్ షేడ్ కూడా ఉంటుందని కూడా కథనాలొస్తున్నాయి. ద్విలింగ మహిళ అంటే సమాజంలో వారిని గుర్తించడం అంత సులువు కాదు. స్వలింగ సంపర్కులను గుర్తించినంత సులువుగా ప్రజలు గుర్తించలేరు.

ఇతర మహిళల పట్ల ఆకర్షితులుగా ఉంటూ.. వారి అందాన్ని పదే పదే ప్రశంసించే మహిళలను ద్విలింగ మహిళగా గుర్తించాలి. లేదా వారికి వారే స్వయంగా తమ సన్నిహితులకు ద్విలింగ సంపర్కం గురించి చెప్పాల్సి ఉంటుంది. ఇప్పుడు అలాంటి ఓ విలక్షణ పాత్రలో సమంత నటిస్తోంది. ఇలాంటి విలక్షణ పాత్రతో పాన్ ఇండియా లేదా పాన్ వరల్డ్ లెవల్లో మరోసారి సామ్ హాట్ టాపిక్ గా మారబోతోంది.

ఆసక్తికరంగా ఈ పాత్రలో అవకాశం రావడం వెనక ఓ ప్రముఖ హీరో షాడోగా వర్క్ చేశారట. ఇది హాలీవుడ్ ప్రాజెక్ట్. ఓబేబి ఫేం సునీత తాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సమంతను సునీతను కలిపిన షాడో హీరో ఎవరు? అంటే రానా దగ్గుబాటి అని గుసగుసలు వినిపిస్తున్నాయి. సునీత తాటిని కలిసి కథ విన్నవెంటనే సామ్ ఈ ప్రాజెక్టులో నటించేందుకు ఏమాత్రం సంశయించలేదుట.

ప్రస్తుతం సమంత వరుస ప్రాజెక్టులతో బిజీ. తెలుగులో శ్రీదేవి మూవీస్ సినిమాలో నటిస్తోంది. అలాగే తమిళంలో డ్రీమ్ వారియర్ పిక్చర్స్ కి సంతకం చేసిన సంగతి తెలిసిందే. ఆ రెండు చిత్రాలను బ్యాలెన్స్ చేస్తూ ఈ హాలీవుడ్ మూవీని పూర్తి చేయాల్సి ఉంటుంది. `అరేంజ్‌మెంట్స్ ఆఫ్ లవ్` అనే టైటిల్ ని ఫిక్స్ చేసినట్టు ఇటీవల అధికారిక ప్రకటన వచ్చింది. గురు ఫిలింస్ పతాకంపై సునీత తాటి నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఫిలిప్ జాన్ దర్శకత్వం వహించనున్నారు.