'సిటాడెల్' షూటింగ్‌లో సమంత ఎందుకంటే?

Tue Jan 24 2023 07:00:01 GMT+0530 (India Standard Time)

Samantha At Citadel Shooting

సమంత ఆటో ఇమ్యూన్ డిసీజ్ మయోసైటిస్ తో బాధపడుతున్న సంగతి తెలిసిందే. యశోధ మూవీ డబ్బింగ్ టైంలో సమంతకు ఉన్న ఈ వ్యాధి గురించి తానే స్వయంగా చెప్పి చాలా మందిని షాక్ కు గురి చేసింది. అయితే అప్పటి నుండి సమంత చాలా తక్కువ సార్లు మాత్రమే కనిపించింది. షూటింగ్ లకు విరామం తీసుకుంది. అయితే ఇన్నాళ్లు ఇంటి పట్టునే ఉన్న సమంత ఇప్పుడు మళ్లీ కెమెరా ముందుకు వచ్చేసింది.రాజ్ - డీకే డైరెక్షన్ లో 'సిటాడెల్' అనే స్పై థ్రిల్లర్ వెబ్ సిరీస్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇందులో వరుణ్ ధావన్ ప్రధాన పాత్రలో నటిస్తుండగా సమంత మరో కీలక పాత్రలో నటిస్తోంది.

అయితే షూటింగ్ నుండి విరామం తీసుకున్న సమంత ప్రస్తుతం సిటాడెల్ వెబ్ సిరీస్ షూటింగ్ లోకి అడుగు పెట్టింది. చిత్రీకరణ కోసం వరుణ్ తో కలిసి ముంబయిలోని సెట్లోకి అడుగు పెట్టింది సామ్. సామ్ సిటాడెల్ షూటింగ్ లోకి అడుగు పెట్టిందన్న విషయాన్ని వరుణ్ ధావన్ సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించారు.

రాజ్ - డీకే తెరకెక్కిస్తున్న 'సిటాడెల్' వెబ్ సిరీస్.. హాలీవుడ్ షో సిటాడెల్ కు రీమేక్ గా వస్తోంది. ఇందులో వరుణ్ ధావన్ సమంత స్పై ఏజెంట్లుగా కనిపించనున్నారు.

సామ్ హెల్త్ బాలేకపోవడంతో విజయ్ దేవరకొండతో నటిస్తున్న ఖుషీ సినిమా కూడా సగంలో ఆగిపోయింది. సిటాడెల్ షూటింగ్ అయిపోయిన తర్వాత సామ్ ఖుషీ సెట్ లోకి అడుగు పెట్టనుంది. వచ్చే నెల నుండి ఖుషీ చిత్రీకరణ పునఃప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది.

ఖుషీ చిత్రీకరణ కోసం సామ్ కూడా డేట్లు కేటాయించినట్లు సమాచారం. మరోవైపు గుణ శేఖర్ దర్శకత్వంలో రొమాంటిక్ ఫాంటసీ డ్రామా చిత్రం శాకుంతలం వచ్చే నెల 17వ తేదీన విడుదల కానుంది. ఈ చిత్రంలో సమంతతో పాటు ఆమె అభిమానుల్లో చాలా అంచనాలు నెలకొన్నాయి. శకుంతల దుష్యంతుల ప్రేమాయణం పెళ్లి తర్వాత జరిగిన పరిణామాలను గుణ శేఖర్ ఎలా తెరకెక్కించారో చూడాల్సి ఉంది.    నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.