Begin typing your search above and press return to search.

చీట్ చేయ‌ను.. రోజంతా ఒక బ‌కెట్ చాలు!

By:  Tupaki Desk   |   19 July 2019 4:29 PM GMT
చీట్ చేయ‌ను.. రోజంతా ఒక బ‌కెట్ చాలు!
X
న‌గ‌రీక‌ర‌ణ నేప‌థ్యంలో మెట్రోలకు నీటి క‌ట‌క‌ట త‌ప్ప‌డం లేదు. వంద‌ల‌ వేల ఎక‌రాల్లో రియ‌ల్ వెంచ‌ర్లతో ధ‌న‌దాహంతో చెల‌రేగిపోతున్నవారి వ‌ల్ల‌ మాన‌వాళికి పెనుముప్పు పొంచి ఉంద‌న్న సంగ‌తిని ఎవ‌రూ గుర్తెర‌గ‌లేదు. కేవ‌లం నీళ్లు లేక న‌గ‌రాల్ని ఖాళీ చేసే స‌న్నివేశం మునుముందు దాపురిస్తుంద‌న్నది ఎవ‌రూ ప‌ట్టించుకోలేదు. భ‌వంతులు రాళ్లు ర‌ప్ప‌లు త‌ప్ప న‌గ‌రాల్లో నీళ్లు క‌నిపించే ప‌రిస్థితి లేదు. ఆ ముప్పు ఎలా ఉండ‌బోతోందో రోజుకు అర బ‌కెట్ నీళ్ల‌తో గ‌డిపేస్తున్న హైద‌రాబాద్ వాసుల‌కు ఇప్పుడిప్పుడే అర్థ‌మ‌వుతోంది. చెన్న‌య్ లో ప‌రిస్థితి చెయ్యి దాటిపోవ‌డంతో ఇప్పుడు ప్ర‌జ‌ల్ని జాగ‌రూక‌త చేసేందుకు సెల‌బ్రిటీలు రెడీ అవుతున్నారు.

అలా పుట్టుకొచ్చిందే `వ‌న్ బ‌కెట్ ఛాలెంజ్`. ఒకరు ఒక్క బ‌కెట్ నీళ్ల‌తోనే స్నానం స‌హా రోజంతా అన్ని ప‌నులు పూర్తి చేయాలి. ఈ ఛాలెంజ్ కి ఓకే చెప్పి మ‌హాన‌టి ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్ కేటీఆర్ కి క‌నెక్ట‌య్యాడు. అలాగే మారుతి లాంటి ద‌ర్శ‌కులు హైద‌రాబాద్ నీటి క‌ట‌క‌ట గురించి తెరాస అధినాయ‌కుల్ని సామాజిక మాధ్య‌మాల్లో ప్ర‌శ్నించారు. అట్నుంచి స్పంద‌న బావుంది. ఆన్ లైన్ లో ఇలాంటి చ‌ర్చ వ‌ల్ల అది సామాన్యుల‌కు క‌నెక్ట‌వుతోంది. ఇప్పుడు ఈ ఎపిసోడ్ లోకి అక్కినేని కోడ‌లు స‌మంత కూడా ప్ర‌వేశించ‌డంతో దీనిపై మ‌రింత అవేర్ నెస్ పెరుగ‌డం హ‌ర్ష‌ణీయం.

వ‌న్ బ‌కెట్ ఛాలెంజ్ కి నేను సైతం అంటూ సామ్ బ‌రిలోకొచ్చారు. జూలై 21 వ తేదీన హైదరాబాద్‌లో ఉన్నవారంతా ఉదయం లేచిన దగ్గరి నుంచి రాత్రి పడుకునే వరకు తమ అవసరాల కోసం కేవలం ఒక్క బకెట్‌ వాటర్‌నే వాడాలన్న కండీష‌న్ కి సామ్ ఓకే చెప్పారు. ``చీట్ చేయను.. వన్ బకెట్ ఛాలెంజ్ కి నాతో కలిసి వ‌చ్చేది ఎవరు?. స్నానం ఎక్కువసేపు చేయడం.. వాహనాలను కడగడం.. ముఖం కడిగేటప్పుడు కుళాయి తిప్పేసి అలాగే వ‌దిలేయ‌డం లాంటి పనులు చేయను. నా వన్ బకెట్ ఛాలెంజ్ ఫోటోను పోస్ట్ చేస్తాను`` అని సామ్ సామాజిక మాధ్య‌మాల్లో ఛాలెంజ్ ని స్వీక‌రించారు. అక్కినేని కోడ‌లి ఛాలెంజ్ అంద‌రికీ న‌చ్చింది. ఎన్నో చెత్త చాలెంజ్ ల‌తో టైమ్ వేస్ట్ చేసే వాళ్లంతా స‌మంత‌ను చూసి నేర్చుకోవాల‌ని అభిమానులు కితాబిచ్చేస్తున్నారు. ఇది ప్ర‌జా ప్ర‌యోజ‌న‌క‌ర‌మైన ఛాలెంజ్ కాబ‌ట్టి అంద‌రూ స్వీక‌రించాల‌ని సామాజిక మాధ్య‌మాల్లో సామ్ ఫ్యాన్స్ కోరుతున్నారు.