హ్యాండిచ్చిన ప్రియాంకకు సల్మాన్ కితాబు

Wed Aug 08 2018 14:06:06 GMT+0530 (IST)

బాలీవుడ్లో సల్మాన్ ఖాన్ తో పని చేయడానిక ప్రతి హీరోయిన్ తహతహలాడుతుంది. అతడితో పని చేసే అవకాశం వస్తే ఎగిరి గంతేస్తుంది. స్టార్ ఇమేజ్ ఉన్న హీరోయిన్ల ఫీలింగ్ కూడా ఇలాగే ఉంటుంది. కానీ ఇప్పుడో కథానాయిక సల్మాన్ సినిమా నుంచి తనకు తానుగా తప్పుకోవడం చర్చనీయాంశమవుతోంది. ఆ హీరోయిన్ మరెవరో కాదు.. ప్రియాంక చోప్రా. బాలీవుడ్లో పెద్ద రేంజికి ఎదిగి.. ఆపై హాలీవుడ్లోనూ అవకాశాలు దక్కించుకున్న ప్రియాంక.. సల్మాన్ కొత్త సినిమా ‘భారత్’ నుంచి హఠాత్తుగా తప్పుకోవడం చర్చనీయాంశమైంది. తన ప్రియుడు నిక్ జోనాస్ తో పెళ్లి కోసమే ఆమె ఈ సినిమా నుంచి వైదొలిగిందని ముందు వార్తలొచ్చినా.. అలాంటిదేమీ లేదని.. ఇందులో పెద్దగా ప్రాధాన్యం లేని పాత్ర నచ్చకే ఆమె తప్పుకుందని.. అదే సమయంలో వేరే ప్రాజెక్టుల్లో నటిస్తోందని చర్చ నడిచింది.ఈ విషయమై ఇన్నాళ్లూ మౌనంగా ఉన్న సల్మాన్.. తాజాగా ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ స్పందించాడు. ప్రియాంక విషయంలో అతను చాలా సానుకూలంగా మాట్లాడటం విశేషం. ప్రియాంకకు తనతో నటించడం ఇష్టం లేకే తన సినిమా నుంచి తప్పుకుందేమో అని సల్మాన్ సందేహం వ్యక్తం చేయడం విశేషం. ‘‘ప్రియాంక ఓ పెద్ద హాలీవుడ్ సినిమా ఒప్పుకుందని మాకు ముందే తెలిసి ఉంటే మా చిత్రం నుంచి వెళ్లిపోకుండా ఆమెను ఆపేవాళ్లం కాదు. ఆమె ముందే మాకు సమాచారం ఇవ్వాల్సింది. ఆమె మా సినిమా నుంచి తప్పుకున్నది పెళ్లి కోసమా.. హాలీవుడ్ సినిమా కోసమా అన్నది ఆమెకే తెలియాలి. బహుశా నాతో పని చేయడం ఇష్టం లేకే ఆమె ఈ సినిమాకు దూరమైందేమో? కానీ ఆమె కెరీర్ పట్ల మేమంతా చాలా సంతోషంగా ఉన్నాం. హాలీవుడ్లో పని చేస్తూ గర్వకారణంగా నిలుస్తోంది. సల్మాన్ తో పని చేయకూడదనుకుంటే ఏంటి.. హాలీవుడ్ టాప్ స్టార్‌తో పని నటించి దేశానికి పేరు తీసుకొస్తోంది. ఆమెకు మా మద్దతు ఎప్పటికీ ఉంటుంది’’ అంటూ కొంచెం వెటకారంగానే ప్రియాంకకు కాంప్లిమెంట్ ఇచ్చాడు సల్మాన్.