సల్మాన్ 'రాధే' ట్రైలర్ విడుదల..!

Thu Apr 22 2021 11:38:10 GMT+0530 (IST)

Salman Khan Radhe Trailer Released

బాలీవుడ్ స్టార్ హీరో 'కండల వీరుడు' సల్మాన్ ఖాన్ నటించిన లేటెస్ట్ మూవీ ''రాధే''. 'యువర్ మోస్ట్ వాంటెడ్ భాయ్' అనేది దీనికి ట్యాగ్ లైన్. కొరియోగ్రాఫర్ కమ్ డైరెక్టర్ ప్రభుదేవా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చిన ఈ చిత్రాన్ని ఈద్ సందర్భంగా మే 13న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఈ యాక్షన్ ఎంటర్టైనర్ ని ఒకేరోజు థియేట్రికల్ మరియు డిజిటల్ రిలీజ్ చేస్తుండటం విశేషం. ఈ నేపథ్యంలో తాజాగా 'రాధే' ట్రైలర్ ని చిత్ర యూనిట్ విడుదల చేసింది.ముంబై నగరంలో జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాలను డ్రగ్ మాఫియాను క్లీన్ చేసే ఓ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ కథ ఇదని 'రాధే' ట్రైలర్ చూస్తుంటే అర్థం అవుతోంది. యాక్షన్ ప్యాకెడ్ ట్రైలర్ ద్వారా సల్మాన్ మరోసారి పవర్ ఫుల్ పాత్రలో నటించినట్లు తెలుస్తోంది. ఇందులో దిశా పటానీ హీరోయిన్ గా నటించగా.. రణదీప్ హుడా విలన్ గా కనిపిస్తున్నారు. జాకీ ష్రాఫ్ - 'ప్రేమిస్తే' భరత్ ఇతర కీలక పాత్రలలో నటించారు. ఈ సినిమా సౌత్ కొరియన్ మూవీ 'వెటరన్' కు రీమేక్ అని తెలుస్తోంది.

'రాధే' చిత్రానికి సాజిద్ వాజిద్ - దేవిశ్రీ ప్రసాద్ - హిమేశ్ రేష్మియా సంగీతం సమకూర్చారు. దేవిశ్రీ 'డీజే- దువ్వాడ జగన్నాథం' సినిమాలోని 'సీటీమార్' పాటను ఈ సినిమాలో రీమిక్స్ చేశారు. దీనికి సంచిత్ - అంకిత్ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్.. అవనంక బోస్ సినిమాటోగ్రఫీ అదనపు ఆకర్షణగా నిలిచాయి. జీ స్టూడియోస్ సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని సల్మాన్ ఖాన్ ఫిలిమ్స్ బ్యానర్ పై సల్మాన్ ఖాన్ - సోహైల్ ఖాన్ - రీల్ లైఫ్ ప్రొడక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ కలిసి సంయుక్తంగా నిర్మించారు. 'వాంటెడ్' 'దబాంగ్ 3' చిత్రాల తర్వాత ప్రభుదేవా - సల్మాన్ కాంబినేషన్లో వస్తున్న హ్యాట్రిక్ మూవీ 'రాధే' ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.