చిత్ర పరిశ్రమలో దారుణం.. వ్యాక్సిన్ పేరుతో సెలైన్ వాటర్?

Fri Jun 18 2021 23:00:01 GMT+0530 (IST)

Saline water under the name of vaccine

మనిషి చావు బతుకుల్లో ఉంటే సహాయం చేసేవారు ఉన్నట్టే.. బాధితుల నుంచి ఉంగరాలూ పర్సులూ దొబ్బేసే బ్యాచ్ కూడా ఉంటుంది. అసలే.. కరోనా పరిస్థితుల్లో వ్యాక్సిన్ దొరక్క చాలా మంది అవస్థలు పడుతుంటే.. ఫేక్ వ్యాక్సినేషన్ కు పాల్పడుతున్నారు కొందరు. ముంబై చిత్ర పరిశ్రమలో వెలుగు చూసిన ఈ వివాదం సంచలనంగా మారింది.కరోనా సెకండ్ వేవ్ తగ్గు ముఖం పట్టడంతో.. మహారాష్ట్ర ప్రభుత్వం షూటింగులకు అనుమతి ఇచ్చింది. అయితే.. షూటింగుల్లో పాల్గొనే సిబ్బంది మొత్తం వ్యాక్సిన్ ఖచ్చితంగా తీసుకోవాలని నిబంధన విధించింది. దీంతో.. పలు నిర్మాణ సంస్థలు తమ సిబ్బందికి ఉచితంగా వ్యాక్సిన్ వేయించాయి. ఇందుకోసం ఈ సంస్థలు.. ప్రైవేటు ఆసుపత్రులతో ఒప్పందం చేసుకున్నాయి. దీన్నే ఆసరాగా చేసుకున్న కొందరు బ్రోకర్లు తాము వ్యాక్సిన్ వేస్తామంటూ ముందుకు వచ్చారు. మే నెలలోనే ఈ డ్రైవ్ పూర్తయింది.

అయితే.. వ్యాక్సిన్ వేయించుకున్న వారికి ఇప్పటి వరకూ ధృవీకరణ పత్రం ఇవ్వలేదు. అంతేకాదు.. కొవిన్ యాప్ లో కూడా వీరి పేర్లు రిజిస్టర్ కాలేదు. దీంతో.. పలువురు పోలీసులను ఆశ్రయించడంతో.. ఈ ఫేక్ వ్యాక్సిన్ బాగోతం బయటపడింది. ఈ విషయం బయటకు రావడంతో.. తమకు కూడా ధృవపత్రాలు ఇవ్వలేదంటూ చాలా మంది రావడంతో.. ఈ బోగస్ వ్యాక్సినేషన్ వ్యవహారం చాలా పెద్దదేనని తేలింది.

వ్యాక్సిన్ వేస్తామంటూ వచ్చిన ఏజెన్సీల నిర్వాహకులు కూడా అందుబాటులో లేకపోవడంతో.. వారికి టీకా వేశారా? సెలైన్ వాటర్ ఎక్కించారా? అనే సందేహం కూడా వ్యక్తం చేస్తున్నారు చాలా మంది. సినిమా నిర్మాణ సంస్థలన్నీ దాదాపుగా ఒకే ఏజెన్సీకి బాధ్యతలు అప్పగించగా.. అందరినీ ఇలా ఫేక్ వ్యాక్సిన్ తో మోసం చేసినట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. వీళ్లకు వేసింది నిజమైనా వ్యాక్సినా? కాదా? అనే సందేహంతోపాటు ఇప్పుడు వీరు మళ్లీ వ్యాక్సిన్ తీసుకోవాలా? వద్దా? అనే సమస్య కూడా వచ్చి పడింది.