ధోని రిటైర్మెంట్ కలకలం.. క్లారిటీ ఇచ్చిన భార్య

Thu Sep 12 2019 21:38:18 GMT+0530 (IST)

Sakshi Dhoni tweets as speculation on MS Dhoni retirement grows

అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించే విషయంలో ఎటూ తేల్చకుండా ఉన్నాడు మహేంద్రసింగ్ ధోని. వన్డే ప్రపంచకప్ తర్వాత అతను క్రికెట్‌కు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. వెస్టిండీస్ పర్యటనకు వెళ్లని అతను.. ఆర్మీలో సేవలందించేందుకు వెళ్లి కశ్మీర్ లోయలో రెండు వారాలు గడిపాడు. ఆ తర్వాత కుటుంబంతో విహార యాత్రకు వెళ్లాడు. ధోని రిటైర్ మెంట్ ఇదిగో అదిగో అంటూ ప్రపంచకప్ తర్వాతి నుంచి ఎప్పటికప్పుడు ఊహాగానాలు వినిపిస్తూనే ఉన్నాయి. కానీ ఎప్పటికప్పుడు ఆ ప్రచారం చల్లబడిపోతోంది. తాజాగా గురువారం మరోసారి ధోని రిటైర్ మెంట్ గురించి గట్టి ప్రచారం సాగింది. ఈ రోజు ఉదయం ధోని తాను కలిసి ఆడిన ఒక మ్యాచ్ కు (2016 టీ20 ప్రపంచకప్‌లోది) సంబంధించిన ఫొటోను సోషల్ మీడియాలో పంచుకున్న కోహ్లి.. ఆ మ్యాచ్ లో తనను ధోని విపరీతంగా పరుగులు పెట్టించాడని కామెంట్ చేశాడు. ఐతే ఉన్నట్లుండి ఈ ధోని గురించి కోహ్లి ఇలా ట్వీట్ వేయడంతో అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఇంతలో ఎవరు పుట్టించారో ఏంటో కానీ.. ఈ రోజు సాయంత్రం 7 గంటలకు ధోని ప్రెస్ మీట్ పెట్టి రిటైర్ మెంట్ ప్రకటన చేయబోతున్నాడంటూ ఒక పుకారు బయల్దేరింది. మధ్యాహ్నం ఈ రూమర్ బయటికి రాగా.. సాయంత్రానికి విపరీతమైన ప్రచారం జరిగిపోయింది. ధోని రిటైర్ మెంట్ అంట అంటూ అభిమానులు ఉద్వేగానికి గురయ్యారు. తీరా తేలిందేమంటే ఇది ఉత్త ప్రచారమే అని. భారత క్రికెట్ చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ ఈ వార్తను ఖండించాడు. మరోవైపు ధోని భార్య సాక్షి సింగ్ సైతం స్పందించింది. వీటినే రూమర్లు అంటారు.. అంటూ ఓ కామెంట్ పెట్టి ఈ ప్రచారానికి తెరదించింది.