Begin typing your search above and press return to search.

భానుమతి .. మౌనిక పాత్రల మధ్య తేడా అదే: సాయిపల్లవి

By:  Tupaki Desk   |   23 Sep 2021 8:30 AM GMT
భానుమతి .. మౌనిక పాత్రల మధ్య తేడా అదే: సాయిపల్లవి
X
సాయిపల్లవి - నాగచైతన్య జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో 'లవ్ స్టోరీ' సినిమా రూపొందింది. 'ఫిదా' తరువాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో సాయిపల్లవి చేసిన సినిమా ఇది. నారాయణ దాస్ నారంగ్ - రామ్మోహన్ రావు నిర్మించిన ఈ సినిమాకి పవన్ సీహెచ్ సంగీతాన్ని అందించాడు. ఈ నెల 24వ తేదీన ఈ సినిమా భారీస్థాయిలో థియేటర్లలో విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ లో సాయిపల్లవి బిజీగా ఉంది. తాజా ఇంటర్వ్యూలో ఆమె ఈ సినిమాను గురించిన విషయాలను పంచుకుంది.

"ఈ సినిమా స్క్రిప్ట్ ను శేఖర్ కమ్ములగారు నాకు పంపించారు. ఆ స్క్రిప్ట్ చదవగానే ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నాను. అంతగా ఈ కథ .. నేను పోషించిన మౌనిక పాత్ర నాకు కనెక్ట్ అయ్యాయి. 'ఫిదా' సినిమాలో భానుమతి పాత్రకు .. 'లవ్ స్టోరీ' సినిమాలో మౌనిక పాత్రకి మధ్య ఎలాంటి పోలికలు ఉండవు. భానుమతి తన వాళ్ల కోసం తన ఊళ్లోనే ఉండిపోవాలని అనుకుంటుంది. కానీ మౌనిక అలా కాదు .. ఎవరైనా తక్కువగా చూస్తే తానేమిటనేది పట్టుదలతో సాధించి చూపిస్తుంది. అందుకే ఈ పాత్ర నన్ను అంతగా ప్రభావితం చేసింది.

పల్లెటూరి నుంచి పట్నం వచ్చిన ఒక జంటకి ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి? వాటిని వాళ్లు ఎలా అధిగమించారు? అనే ఆసక్తికరమైన అంశం చుట్టూ ఈ కథ తిరుగుతుంది. కుల వివక్ష .. లింగ వివక్ష అనే అంశాలను శేఖర్ కమ్ములగారు సున్నితంగా ఆవిష్కరించిన తీరు ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుంది .. అందరినీ ఆలోచింపజేస్తుంది. నా వరకూ నేను నా పాత్ర పరంగాగానీ .. కథా పరంగా గాని తప్పుడు సంకేతాలు వెళ్లకుండా చూసుకుంటాను. ఒకవేళ డైలాగ్ పరంగా డౌట్ వచ్చినా వెంటనే మార్పిస్తాను. శేఖర్ గారి సినిమాల విషయంలో అలాంటి వాటి గురించిన ఆలోచన చేయవలసిన అవసరం ఉండదు.

చిరంజీవిగారి సినిమాలో చెల్లెలి రోల్ అని చెప్పేసి నేను నో చెప్పలేదు. రీమేక్ సినిమాలు చేసే ఆలోచన లేకపోవడం వలన అలా చెప్పాను. మూలకథలో చేసిన పాత్రలను ఫాలో అవుతూ .. అంతకంటే బెటర్ గా చేయాలని టెన్షన్ పడుతూ నేను చేయలేను. ఒకవేళ రీమేక్ సినిమాలు తప్పనిసరిగా చేయవలసి వస్తే కొన్ని నియమాలు పెట్టుకున్నాను .. వాటికి తగిన విధంగా ఉంటే చేయడానికి ప్రయత్నిస్తాను. రానున్న 'విరాటపర్వం' .. 'శ్యామ్ సింగ రాయ్' సినిమాల్లోని నా పాత్రలు కూడా కొత్తగానే ఉంటాయి. అవి తప్పకుండా ప్రేక్షకులకు నచ్చుతాయి" అని చెప్పుకొచ్చింది.