Begin typing your search above and press return to search.

నో పెళ్లి.. ఆ స్థాయిలో లేదు.. సోసో!

By:  Tupaki Desk   |   25 May 2020 6:15 AM GMT
నో పెళ్లి.. ఆ స్థాయిలో లేదు.. సోసో!
X
సుబ్బు దర్శకత్వంలో తెరకెక్కుతున్న సాయి ధరమ్ తాజా చిత్రం 'సోలో బ్రతుకే సో బెటర్'. ఈ సినిమాలో తేజు సరసన నభ నటేష్ హీరోయిన్ గా నటిస్తోంది. తాజాగా ఈ చిత్రం నుండి 'నో పెళ్లి' అంటూ సాగే పాటను హీరో నితిన్ విడుదల చేశారు. సినిమా టైటిల్.. సాంగ్ పల్లవి చూస్తేనే కాన్సెప్ట్ అర్థం అయిపోతుంది కదా.. సరిగ్గా పాట అలాగే సాగింది. పెళ్లి చేసుకుంటే బతుకు బస్టాండ్ అవుతుందని.. అలాంటి పిచ్చి పని చెయ్యొద్దని.. సింగిల్స్.. మింగిల్స్ గా మారొద్దని.. ఏకత్వంలోని లోతు తత్త్వం ఉపదేశిస్తూ ఈ పాట సాగింది.

ఈ పాటకు సాహిత్యం అందించినవారు రఘురామ్. పాడినవారు అర్మాన్ మాలిక్. ఈ సినిమాకు థమన్ సంగీతం అందించిన సంగతి తెలిసిందే. లిరిక్స్ సింపుల్ గా క్యాచీగా ఉన్నాయి.. అర్మాన్ పాడిన తీరు కూడా బాగానే ఉంది కానీ థమన్ మాత్రం ఈ పాటతో నిరాశపరిచాడనే అనుకోవాలి. ఎందుకంటే పెళ్లి వద్దు అంటూ సూక్తి ముక్తావళి చెప్తూ సాగే పాటలు తెలుగులో చాలా ఉన్నాయి. 'మనీ' లో 'భద్రం బీ కేర్ఫుల్ బ్రదరూ'.. 'మన్మధుడు' లో 'వద్దురా సోదరా పెళ్లంటే నూరేళ్ల మంటరా/డోంట్ మ్యారీ' పాటలు వింటుంటే తాళి కట్టబోయే వాడు కూడా ఓ క్షణం పెళ్లి చేసుకోవాలా వద్దా అని సందిగ్ధంలో పడిపోయి పెళ్లి మానుకుంటాడు. కానీ 'నో పెళ్లి' మాత్రం ఆ స్థాయిలో లేదు.

ఇది పక్కన పెడితే ఈ సాంగ్ వీడియోలో మరో మెగా హీరో వరుణ్ తేజ్ - రానా దగ్గుబాటి కనిపించడం విశేషం. అసలే ఇద్దరూ మెగా హీరోలు బ్యాచిలర్లు.. ఇలా సభ్యసమాజానికి నో పెళ్లి మెసేజ్ ఇస్తున్నారు.. ఆ మెసేజ్ ను త్వరలో ఒకింటివాడు కాబోతున్న నితిన్ చేతే విడుదల చేయించారు. ఇదీ హైలైట్ అంటే..!