రాజ్ కుంద్రాకు షాకిచ్చిన సచిన్ జోషి

Fri Jul 23 2021 21:00:01 GMT+0530 (IST)

Sachin Joshi Shocks Raj Kundra

అశ్లీ చిత్రాల వ్యవహారంలో అరెస్ట్ అయిన రాజ్ కుంద్రాకు మరో షాక్ తగిలింది. ఇప్పటికే ముంబైలోని బాలీవుడ్ ను కుంద్రా వ్యవహారం షేక్ చేస్తోంది. కుంద్రాకు సంబంధించిన ఇతర వ్యవహారాలు బిజినెస్ వివాదాలు బయటకు వస్తుండడం వైరల్ గా మారింది. కుంద్రాతో ప్రత్యక్షంగా.. పరోక్షంగా బాధితులుగా మారిన వారు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు.ప్రముఖ నటుడు నిర్మాత సచిన్ జోషి కూడా ఇందులో తాను కూడా బాధితుడినే అని తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజ్ కుంద్రా అతడికి చెందిన సట్యూగ్ గోల్డ్ సంస్థ చేతిలో తాను మోసపోయినట్టు సచిన్ జోషి తెలిపాడు. అంతేకాదు ఈ వ్యవహారంలో తాను కోర్టులో కేసు వేసి పోరాడి విజయం సాధించినట్లు తాజాగా తెలిపాడు.

సట్యూగ్ అనే కంపెనీకి అప్పట్లో రాజ్ కుంద్రా చైర్మన్ గా ఉండేవాడు. బంగారంపై ఆదాయం అందిస్తామంటూ నాడు ఓ స్కీమ్ పెట్టాడు. దాన్ని నమ్మిన సచిన్ జోషి కిలో బంగారాన్ని ఆ కంపెనీలో పెట్టుబడిపెట్టాడు. ఐదేళ్లు పూర్తయిన తర్వాత సచిన్ జోషికి బంగారం తిరిగి ఇవ్వకుండా రాజ్ కుంద్రా కంపెనీ అడ్డగోలుగా వ్యవహరించింది. దీనిపై సచిన్ జోషి కోర్టుకెళ్లాడు. కేసును పరిశీలించిన కోర్టు.. రాజ్ కుంద్రా కంపెనీ సచిన్ కు రూ.25 లక్షల 50వేలు చెల్లించాలని తీర్పునిచ్చింది.

‘నిజం ఏదో ఒకరోజు బయటకు వస్తుంది’ అంటూ కోర్టు తీర్పు అనంతరం సచిన్ జోషి ట్విట్ చేశాడు.ఈ కేసులో రాజ్ కుంద్రా ఆరేళ్ల క్రితం తమకు అప్పగించాల్సిన కిలో బంగారాన్ని చట్టపరమైన ఖర్చులను చెల్లించాల్సి ఉందని.. తాను కష్టపడి సంపాదించిన సొమ్మును ఓ ప్రముఖుడిని నమ్మి పెట్టుబడిగా పెట్టి మోసపోయానని సచిన్ జోషి అన్నారు. తనలా ఎవరూ మోసపోకూడదనే పోరాటం చేశానని.. చివరకు ఇప్పుడు రాజ్ కుంద్రాపై గెలిచానని తెలిపారు. రాజ్ కుంద్రా మోసం బట్టబయలు అయ్యిందని తెలిపారు.