'సామీ సామీ' సాంగ్: మాస్ స్టెప్పులతో ఈలలు వేయిస్తున్న పుష్పరాజ్-శ్రీవల్లి జోడి..!

Thu Oct 28 2021 11:33:34 GMT+0530 (IST)

Saami Saami From Pushpa Alluring Folk Number

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ - డైరెక్టర్ సుకుమార్ - మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్ లది హిట్ కాంబినేషన్ అనే సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు వీరి కలయికలో వచ్చిన రెండు సినిమాలు మ్యూజికల్ హిట్స్ గా నిలిచాయి. ఈ క్రమంలో వీరు ముగ్గురు కలిసి చేస్తున్న ''పుష్ప'' సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇది బన్నీ - సుక్కూ కాంబోలో వస్తున్న భారీ యాక్షన్ డ్రామా. ఇందులో రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తుండగా.. మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్ విలన్ గా చేస్తున్నారు. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.ఫస్ట్ పార్ట్ ని ''పుష్ప: ది రైజ్'' పేరుతో డిసెంబర్ 17న పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయనున్నారు. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ మొదలు పెట్టిన మేకర్స్.. రెగ్యులర్ అప్డేట్స్ తో ఫ్యాన్స్ ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ - టీజర్ మంచి స్పందన తెచ్చుకున్నాయి. అలానే 'దాక్కో దాక్కో మేక' 'శ్రీవల్లి' పాటలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలో తాజాగా 'సామీ సామీ' అనే మరో సాంగ్ లిరికల్ వీడియోని చిత్ర బృందం విడుదల చేసింది. తెలుగు తమిళ మలయాళ కన్నడ వెర్సన్ లో మాత్రమే ఈ పాట వచ్చింది.

'నువ్ అమ్మీ అమ్మీ అంటాంటే.. నీ పెళ్లాన్నైపోయినట్టుందిరా సామీ.. నా సామీ.. సామీ సామీ అంటాంటే నా పెనిమిటి లెక్క సక్కంగుంది సామీ.. నా సామీ' అంటూ సాగిన ఈ పాట ఆడియన్స్ ని అలరిస్తోంది. అందమైన అటవీ ప్రాంతంలో అల్లు అర్జున్ - రష్మిక తో పాటుగా ఎక్కువ మంది డ్యాన్సర్స్ తో ఈ పాటను చిత్రీకరించారు. పుష్పరాజ్ ప్రేమలో ఉన్న శ్రీవల్లి.. అతని మీద ఎంత ప్రేమ ఉన్నదో ఈ పాట రూపంలో తెలియజేస్తోంది.

రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ పాటకు మాంచి ఫోక్ బీట్ ని ట్యూన్ చేశారు. గేయ రచయిత చంద్రబోస్ పల్లె పదాలతో ఈ గీతానికి సాహిత్యం అందించారు. సింగర్ మౌనిక యాదవ్ ఎంతో హుషారుగా సాంగ్ పాడారు. ఈ పాటకు శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. ఇందులో బన్నీ - రష్మిక వేసిన మాస్ స్టెప్పులు వీక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఇద్దరూ డీ గ్లామర్ లుక్ లో.. గెటప్స్ కు తగిన కాస్ట్యూమ్స్ లో సందడి చేశారు. రష్మిక లుక్ రంగస్థలం సినిమాలో రామలక్ష్మి ని గుర్తు చేస్తోంది.

'పుష్ప' చిత్రానికి ఎస్. రామకృష్ణ - మోనిక ప్రొడక్షన్ డిజైనర్లుగా వర్క్ చేశారు. మిరోస్లా కుబా బ్రోజెక్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. కార్తీక శ్రీనివాస్ ఎడిటింగ్ బాధ్యతలు చూసుకుంటున్నారు. ఆస్కార్ అవార్డ్ విన్నర్ రసూల్ పోకుట్టి దీనికి సౌండ్ డిజైనింగ్ చేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ - ముత్యంశెట్టి మీడియా బ్యానర్స్ పై నవీన్ ఎర్నేని - వై రవిశంకర్ భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలుగు తమిళ మలయాళ కన్నడ హిందీ భాషల్లో ''పుష్ప'' సినిమా విడుదల కానుంది.