Begin typing your search above and press return to search.

'మానాడు' దర్శకుడితో నాగచైతన్య..?

By:  Tupaki Desk   |   29 Jan 2022 10:30 AM GMT
మానాడు దర్శకుడితో నాగచైతన్య..?
X
యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో ఫుల్ జోష్ లో ఉన్నారు. 'వెంకీమామ' 'మజిలీ' 'లవ్ స్టోరీ' వంటి హ్యాట్రిక్ విజయాలు అందుకున్న చైతూ.. ఇటీవల సంక్రాంతికి 'బంగార్రాజు' చిత్రంతో మరో బ్లాక్ బస్టర్ తన ఖాతాలో వేసుకున్నారు. ప్రస్తుతం యువ హీరో పలు ఆసక్తికరమైన ప్రాజెక్ట్స్ లో నటిస్తున్నారు. అయితే చైతూ త్వరలో తమిళ దర్శకుడు వెంకట్ ప్రభుతో ఓ మూవీ చేయబోతున్నారని సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది.

కోలీవుడ్ లో విలక్షణ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న వెంకట్ ప్రభు.. 'గోవా' 'సరోజ' 'గ్యాబ్లింగ్' 'రాక్షసుడు' వంటి సినిమాలతో పాటు 'లైవ్ టెలికాస్ట్' అనే వెబ్ సిరీస్ తో తెలుగు ప్రేక్షకులను అలరించారు. ఇటీవల శింబు హీరోగా తెరకెక్కించిన టైం లూప్ కాన్సెప్ట్ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ 'మానాడు' బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఇప్పుడు సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో ఈ సినిమా తెలుగు రీమేక్ కు సన్నాహాలు జరుగుతున్నాయి.

వెంకట్ ప్రభు ప్రస్తుతం అశోక్ సెల్వన్ హీరోగా 'మన్మథ లీల' అనే తెలుగు తమిళ ద్విభాషా చిత్రం చేస్తున్నారు. ఈ క్రమంలో త్వరలో నాగచైతన్యతో ఓ సినిమా చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఇదే కనుక నిజమైతే ఈ ప్రాజెక్ట్ కచ్చితంగా బైలింగ్విల్ అవుతుంది. వెంకట్ ప్రభు చాలా కాలంగా తెలుగులో సినిమా చేయడానికి ట్రై చేస్తున్నారు. అప్పట్లో 'గ్యాబ్లింగ్' మూవీలో అక్కినేని నాగార్జున నటించనున్నారనే ఊహాగానాలు కూడా వచ్చాయి. ఇప్పుడు తెలుగులో చైతన్య - వెంకట్ ప్రభు కాంబోలో సినిమా రాబోతోందని టాక్ వినిపిస్తోంది.

ఇదిలా ఉంటే నాగచైతన్య ప్రస్తుతం విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో 'థాంక్యూ' మూవీ చేస్తున్నారు. 'లాల్ సింగ్ చద్దా' సినిమాతో అక్కినేని వారసుడు బాలీవుడ్ లో అడుగుపెట్టడానికి రెడీ అవుతున్నాడు. ఇదే క్రమంలో ఓ హారర్ వెబ్ సిరీస్ తో ఓటీటీలో ఎంట్రీ ఇవ్వబోతున్నారు. అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ కోసం విక్రమ్ కె కుమార్ తో రూపొందించే ఓ వెబ్ సిరీస్ లో చైతూ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నారు.

భవిష్యత్ లో పరశురామ్ పెట్లా దర్శకత్వంలో చైతన్య ఓ సినిమా చేయనున్నారు. అలానే చై కోసం 'నాంది' ఫేమ్ విజయ్ కనకమేడల ఓ స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నారని తెలుస్తోంది. ఇంద్రగంటి మోహన్ కృష్ణ - నందిని రెడ్డి వంటి దర్శకులు కూడా చైతూ డేట్స్ కోసం వేచి చూస్తున్నట్లు చాలా రోజులుగా టాక్ వినిపిస్తోంది. ఈ క్రమంలో ఇప్పుడు వెంకట్ ప్రభు పేరు తెరపైకి వచ్చింది. మరి త్వరలోనే నాగచైతన్య తదుపరి సినిమాల దర్శకుల మీద క్లారిటీ వస్తుందేమో చూడాలి.