Begin typing your search above and press return to search.

ట్రైలర్ టాక్: ఆ ఫైర్ కే ఫోన్ చేస్తున్నా..!

By:  Tupaki Desk   |   8 Dec 2019 4:08 AM GMT
ట్రైలర్ టాక్: ఆ ఫైర్ కే ఫోన్ చేస్తున్నా..!
X
కెయస్ రవికుమార్ దర్శకత్వంలో నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం 'రూలర్'. ఈ సినిమాలో బాలయ్య సరసన సోనాల్ చౌహాన్.. వేదిక హీరోయిన్లుగా నటిస్తున్నారు. డిసెంబర్ 20 న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా టీజర్ ఇప్పటికే విడుదలై బాలయ్య అభిమానులను మెప్పించింది. కాసేపటి క్రితం 'రూలర్' ట్రైలర్ కూడా విడుదలయింది.

ట్రైలర్ ఊరమాసు డైలాగ్ తో ప్రారంభమవుతుంది. విలన్ "ఎవరికిరా ఫోన్ చేస్తున్నావ్.. ఫైర్ ఇంజిన్ కా?" అంటూ గద్దిస్తాడు. అవతలి వ్యక్తి "ఫైర్ ఇంజిన్ కు కాదు.. ఆ ఫైర్ కే ఫోన్ చేస్తున్నా" అంటూ యమా కాన్ఫిడెంట్ గా బదులిస్తాడు. విలన్ కోపంతో "ఎవడ్రా ఆ ఫైర్?" అంటూ మరో ప్రశ్న వేస్తాడు. ఇలాంటి మాసు సంభాషణ తర్వాత బాలయ్య ఎంట్రి కత్తిలా ఉండకపోతే ఎలా? అందుకే బాలయ్య తనదైన శైలిలో గ్రాండ్ ఎంట్రీ ఇస్తారు. కారునుంచి స్టైల్ గా దిగుతూ.. హెలికాప్టర్ దిగి నడుస్తూ.. ఒక సోఫాపై కాలు మీద కాలేసుకుని స్టైల్ గా నవ్వుతూ ఇలా ఎంట్రీ ఫసాక్. ''ఈ ధాన్యం తింటున్న మీరే ఇంత పొగరు చూపిస్తుంటే.. ఈ ధాన్యం పండిస్తున్న రైతుకి ఇంకెంత పవరు పొగరు ఉంటుందో చూపించమంటావా?" అంటూ మరో సీన్ లో గర్జిస్తారు బాలయ్య.

హీరోయిన్ల గ్లామర్.. రొమాన్స్.. పంచ్ డైలాగ్స్.. విలన్లు.. యాక్షన్ సీన్లు.. ఎమోషన్ సీన్లు.. డ్యాన్సులు.. కామెడీ.. ఇలా బాలయ్య సినిమాలో ఏవి కావాలి అని అభిమానులు ఆశిస్తారో అన్నీ ఉన్నాయి. అయితే కమెడియన్ సప్తగిరి "ఎవరీ గులాబి పువ్వు" అంటూ.. బండి మీద నుంచి గాలిలో ప్రయాణం చేస్తూ పేడకుప్పలో మిస్సైల్ లాగా ల్యాండ్ కావడం లాంటి సీన్లకు ఈ తరం ప్రేక్షకులు కనెక్ట్ కావడం కష్టమే. దర్శకుడు కేయస్ రవి కుమార్ కమర్షియల్ ఫార్మాట్ ను శ్రద్ధగా అనుసరించి మరీ సినిమాను తెరకెక్కించినట్టు అనిపిస్తోంది. ఇది పక్కా ఊరమాస్ బాలయ్య ఫిలిం.. ఆలస్యం ఎందుకు.. ఎక్కువ ఆలోచించకుండా చూసేయండి.