ఫిలిం అకాడెమీతో వైజాగ్ టాలీవుడ్ కి రూట్ మ్యాప్

Sun Jul 25 2021 20:18:16 GMT+0530 (IST)

Route map to Vizag Tollywood with Film Academy

విశాఖని మరో టాలీవుడ్ ఫిల్మ్ హాబ్ గా మార్చాలన్నది స్థానిక ప్రజల డిమాండ్. నాయకల్లోనూ బలమైన కోరిక ఉంది. అందుకు అనుకూలంగానే వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. సినీపెద్దలను పిలిచి వైజాగ్ టాలీవుడ్ అభివృద్ధికి ఏం చేయాలో ఇంతకుముందే జగన్ ముచ్చటించారు. ఇక్కడ పరిశ్రమను పెద్ద స్థాయిలో ప్లాన్ చేయాలనే ఆలోచన నాయకుల్లో ఉంది. కానీ రాజధాని అంశం దీనికి ప్రధాన అడ్డంకిగా మారింది.గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే మరో తెలుగు చలన చిత్ర పరిశ్రమ వైజాగ్ లో ఏర్పాటవుతుందని ప్రకటించారు. స్టూడియోల నిర్మాణానికి స్థలాలు కూడా కేటాయించేందుకు సిద్ధమయ్యారు. కానీ కొన్ని కారణాల వల్ల ఎక్కడా కార్యరూపం దాల్చలేదు. ఇక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక విశాఖని ఏకంగా పరిపాలనా రాజధానిగానే ప్రకటించి ఊహించని ట్విస్ట్ ఇచ్చిన సంగతి తెలిసిందే.

అటుపై కొందరు టాలీవుడ్ పెద్దలు ముఖ్యమంత్రి జగన్ ని కలిసి విశాఖ చిత్ర పరిశ్రమ అభివృద్దిపై చర్చించారు. ముఖ్యమంత్రి కూడా సానుకూలంగా స్పందించి..ఆ దిశగా తన సహకారం ఎప్పుడూ ఉంటుందని హామిచ్చారు. ప్రస్తుతం పరిపాలనా రాజధాని అంశం చట్టపరిధిలో ఉంది. చట్టపరంగా క్లియరెన్స్ రాగానే అన్నిరకాల పనులు విశాఖలో ప్రారంభం కానున్నాయి. అదే వేగంలో టాలీవుడ్ ఏర్పాట్లు కూడా జరుగుతాయని పరిశ్రమ వర్గాల నుంచి వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా మరో ఇంట్రెస్టింగ్ అప్ డేట్ ఒకటి వెలుగులోకి వచ్చింది.

విశాఖ ఆంధ్రా యూనివర్శిటీలో ఫిల్మ్ అకాడమీ ఏర్పాటు చేయలని ప్రతిపాదనలు వీసికి కి అందాయి. విశాఖ జిల్లాకు చెందిన నటుడు జోగినాయుడు ఏయూ వీసి ప్రసాద్ రెడ్డిని కలిసి వినతి పత్రం అందజేసారు. ఫిల్మ్ అకాడమీ ఏర్పాటుతో ఉత్తరాంధ్ర జిల్లాకు చెందిన ఔత్సాహికులకు ఈ కోర్సు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని పేర్కొన్నారు. సినీ పరిశ్రమ ఇప్పుడు ప్రతిభను గుర్తించి అవకాశాలు ఇస్తుందని... ఆ రకమైన ఫ్యాషన్ గలవారికి కోర్సులు అందుబాటులో ఉంచితే ఎంతో మేలు జరుగుతుందన్నారు. టాలీవుడ్ పరిశ్రమలో శ్రీకాకుళం- విజయనగరం- విశాఖపట్టణం నుంచి చాలా మంది కళాకారులున్నారని గుర్తు చేసారు. విజయనగరం కళల కాణాచి. శ్రీకృష్ణ దేవరాయల స్ఫూర్తిని కలిగి ఉంటుంది. విశాఖలో కళా ఔత్సాహికులు కళాభారతి షోలతో బిజీ ఆర్టిస్టులు ఉన్న నగరం. ఈ మూడు ఉత్తరాంధ్ర జిల్లాలు నాటకాలకు బుర్రకథలకు డాన్స్ కాంపిటీషన్ లకు ఎంతో ప్రాధాన్యతనిస్తాయని అన్నారు. అలాంటి జిల్లాలకు కళారంగంలో ప్రోత్సహించే కోర్సులు దగ్గరగా ఉంటే ఎంతో ఉపయోగం ఉంటుందని విశాఖలో పరిశ్రమ ఏర్పాటుకు ముందే అది జరిగితే ఎంతో ఉపయోగం ఉంటుందని ఔత్సాహికులు భావిస్తున్నారు.

వైజాగ్ టాలీవుడ్ చిత్తశుద్ధి ఎంత?

ఏపీ- తెలంగాణ విభజన అనంతరం టాలీవుడ్ పయనం ఎటువైపు? అన్న చర్చ విస్త్రతంగా సాగింది. బీచ్ సొగసుల విశాఖ నగరంలో టాలీవుడ్ ఏర్పాటు ఉంటుందని భావించారు. ఆ విషయాన్ని అప్పటి తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ సైతం ధృవీకరిస్తూ ఓ ప్రకటనలో వైజాగ్ లో టాలీవుడ్ అభివృద్ధి చెందుతుందని అన్నారు. ఆ తర్వాత వైజాగ్ బీచ్ పరిసరాల్లో స్టూడియోల ఏర్పాటు కోసం ప్రభుత్వం భూములిస్తుందని ప్రచారమైంది. తెదేపా ప్రభుత్వం వెళ్లాక.. ఇటీవల జగన్ ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తోంది. వైజాగ్ ని టూరిజం హబ్ గా మార్చాలంటే రంగుల పరిశ్రమ ఏర్పాటు అంశాన్ని సీరియస్ గా పరిగణించాలని జగన్ ప్రభుత్వం యోచిస్తోంది. సినిమా-ఐటీ-టూరిజం-పరిశ్రమలు- 5 స్టార్ హోటల్స్- అంతర్జాతీయ విమానాశ్రయం - రింగ్ రోడ్స్ అనే కాన్సెప్టుతో ప్రతిదీ రూట్ మ్యాప్ డిజైన్ చేస్తోంది. దీనికోసం వేలకోట్లు వెదజల్లేందుకు సిద్ధమవుతోంది. దీనికి వీఎండీఏ డీపీఆర్ లు సిద్ధం చేసింది.

ఇప్పటికే వైజాగ్ ఫిల్మ్ హబ్ నిర్మించడానికి అనుమతులు మంజూరు అయ్యాయి. విశాఖ రామానాయుడు స్టూడియోస్ పరిసరాల్లో ఫిల్మ్ నగర్ సాంస్కృతిక కేంద్రాన్ని నిర్మించడానికి కొంత భూమిని కేటాయించారు. అనుమతులు కూడా మంజూరయ్యాయి. భవన కార్యకలాపాలు త్వరలో ప్రారంభమవుతాయి. ఈ ఎఫ్.ఎన్.సి.సితో వైజాగ్ టాలీవుడ్ కు కనెక్టివిటీ మెరుగుపడుతుంది. అలాగే విశాఖలో తాత్కాలిక ఫిలింఛాంబర్ ని కూడా ఏర్పాటు చేశారని తెలుస్తోంది. రాబోయే రోజుల్లో వైజాగ్ కు మారాలని కోరుకునే సినీ పరిశ్రమ ప్రముఖులకు స్టూడియోల కోసం భూములు కేటాయించే అవకాశాలు ఉన్నాయి.

నిజానికి చెన్నయ్ నుంచి వచ్చే పరిశ్రమ కోసం నాడు హైదరాబాద్ లో భూములు ఇచ్చి పన్ను మాఫీలు చేసి ఎంకరేజ్ చేశాయి ప్రభుత్వాలు. ఇప్పుడు కూడా వైజాగ్ ఇండస్ట్రీ విషయంలో అదే జరగనుంది. వై.ఎస్.రాశశేఖరరెడ్డి పాలనలోనే వైజాగ్ లో టాలీవుడ్ ఏర్పాటు గురించి చర్చ సాగింది. ఆయన కుమారుడు .. ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి వైజాగ్ ను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా మార్చారు. తదుపరి కార్యకలాపాలు ప్రారంభం కాగానే వైజాగ్ టాలీవుడ్ గురించి కూడా ప్రకటిస్తారని చెబుతున్నారు. నిజానికి మొన్న ఉగాది రోజే వైజాగ్ టాలీవుడ్ పై జగన్ హింట్ ఇస్తారని భావించినా సెకండ్ వేవ్ వల్ల కుదరలేదని తెలిసింది.