ఎట్టకేలకు 'రొమాంటిక్' పోస్టర్ తో రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు..!

Mon Mar 01 2021 11:02:06 GMT+0530 (IST)

Romantic Release Date Fixed

డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తనయుడు పూరీ ఆకాష్ హీరోగా నటించిన రెండో సినిమా ''రొమాంటిక్''. ఫస్ట్ సినిమా 'మెహబూబా' ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడంతో ఈసారి పూరీ తన కొడుకు కోసం ఓ రొమాంటిక్ ఎంటర్టైనర్ ని రెడీ చేసాడు. ఈ చిత్రానికి పూరీ జగన్నాథ్ కథ - స్క్రీన్ ప్లే - మాటలు అందించి దర్శకత్వ భాధ్యతలు తన శిష్యుడు అనిల్ పాడూరికి అప్పగించాడు. ఆకాశ్ సరసన ముంబై ముద్దుగుమ్మ కేతికా శర్మ హీరోయిన్ గా నటించింది. 2019 లో సెట్స్ పైకి వెళ్లి ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న 'రొమాంటిక్' సినిమా విడుదల తేదీపై ఎట్టకేలకు క్లారిటీ వచ్చేసింది.''రొమాంటిక్'' చిత్రాన్ని 2021 జూన్ 18న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా ఓ రొమాంటిక్ పోస్టర్ ని వదిలారు. రన్నింగ్ వెహికల్ లో హీరోయిన్ కేతికా శర్మ కు పూరీ ఆకాష్ లిప్ లాక్ ఇస్తూ కనిపిస్తున్న ఈ పోస్టర్ అట్రాక్ట్ చేస్తోంది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు మరియు సాంగ్స్ మంచి ఆదరణ తెచ్చుకుని సోషల్ మీడియాలో స్ట్రాంగ్ బజ్ క్రియేట్ చేసాయి. కాగా ఈ చిత్రంలో సీనియర్ నటి రమ్యకృష్ణ కీలక పాత్ర పోషించారు. మకరంద్ దేశ్ పాండే - ఉత్తేజ్ - సునయన ఇతర పాత్రల్లో కనిపించనున్నారు.

ఈ చిత్రానికి సునీల్ కశ్యప్ సంగీతం సమకూరుస్తున్నాడు. నరేష్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించగా.. జునైద్ సిద్దిఖీ ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. ఇందులో అన్ని పాటలకు లిరిసిస్ట్ భాస్కరభట్ల సాహిత్యం అందిస్తున్నారు. లావణ్య సమర్పణలో పూరీ జగన్నాథ్ టూరింగ్ టాకీస్ మరియు పూరీ కనెక్ట్స్ బ్యానర్స్ పై పూరీ - చార్మీ కౌర్ కలిసి ఈ 'రొమాంటిక్' చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 'ఇస్మార్ట్ శంకర్' వంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత పూరీ - చార్మీ నిర్మాణంలో వస్తున్న ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. ఈ మూవీతో పూరీ తనయుడు ఆకాష్ సూపర్ హిట్ అందుకుంటాడేమో చూడాలి.