రోజా భర్త సెల్వమణి సంచలన వ్యాఖ్యలు

Sun Oct 24 2021 17:00:01 GMT+0530 (IST)

Roja Husband Sensational Comments

‘సినిమా సెలబ్రెటీలపై ప్రేక్షకులకు ఓ మంచి నమ్మకం ఉంది. ఆ నమ్మకాన్ని చిన్న చిన్న వివాదాలతో చీఫ్ గా చేయొద్దు. రాజకీయంగా యుద్దాలు చేసినపర్వాలేదు. కానీ చిన్న ఎలక్షన్లలో ఇలా వ్యక్తిగతంగా పరువు పోగొట్టుకోవడం వల్ల జనాల్లో చాలా చులకన అవుతారు. ’అని రోజా భర్త డైరెక్టర్ సెల్వమణి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల టాలీవుడ్ మూవీ అసోసియేషన్ ఎన్నికలు జరిగాయి. ఈ సందర్భంగా ఆయన ఓ యూట్యూబ్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్యూలో పలు ఆసక్తి విషయాలు చెప్పారు. ఆయన చెప్పిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.



‘నా దృష్టిలో సినిమా ఇండస్ట్రీకి ప్రేక్షకుల్లో మంచి పేరుంది. దీనికి చెడ్డపేరు చెడ్డపేరు తీసుకురావద్దు. అసోసియేషన్ ఎన్నికల పేరిట ఒకరిపై ఒకరు ధూషణలు చేసుకోవడం ద్వారా ఎవరికీ ప్రయోజనం ఉండదు. మొత్తంగా సినిమా ఇండస్ట్రీ పరువే పోతుంది. ఇక ఎలక్షన్లో ఎవరు అధ్యక్షుడిగా ఉన్న ఏమీ చేయలేదు. చేయడానికి అసలు అక్కడ పనేముంది...? ఇన్నిరోజులు అధ్యక్ష స్థానాల్లో ఉన్నవారు ఏం చేశారు..? కొత్తగా ఎన్నికైనవారు కూడా ఏం చేయరనేదే నా అభిప్రాయం ఇంత మాత్రాన వ్యక్తిగత ధూషణలకు పోతే ఇండస్ట్రీ మీద ఉన్ననమ్మకం పోతుంది.’

‘ప్రకాశ్ రాజ్ నా క్లోజ్ ఫ్రెండ్. అయన ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు నాకు తెలిసింది. కానీ ఎన్నికల్లో ఆయనకు మద్దతు ఇస్తానని ఇవ్వలేనని చెప్పలేను. ఎందుకంటే ఎలక్షన్ వరకు నేను అతనికి దూరంగానే ఉన్నా. కనీసం సలహాలు కూడా ఇవ్వలేదు. ఎందుకంటే ఎన్నికల్లో పోటీ చేసేవారికి ఆలోచనలు వేరే ఉంటాయి. ఆ సమయంలో కొందరి అభిప్రాయాలు నచ్చకపోవచ్చు. అటువంటి సమయంలో అతనికి దూరంగా ఉండడమేబెటరని ఆలోచించా. అందుకే ఈ ఎన్నికల్లో ఎలాంటి జోక్యం చేసుకోలేదు.’

‘మోహన్ బాబు సార్ నాకు బాగా తెలుసు. కానీ విష్ణు గురించి పెద్దగా తెలియదు. కానీ మోహన్ బాబు గారు మంచి పేరున్న వ్యక్తి. అయితే ఆయన స్థాయికి ఈ ఎన్నికలు పెద్దవి కావు. ఆయన జీవితంలో ఇలాంటి ఎన్నికలు ఎన్నో చూశారు. అయితే ప్రత్యక్షంగా ఆయన ఎన్నికల్లో పాల్గొనడం నచ్చలేదు. అయినా బాధ్యతాయుతంగా వ్యవహరించారనే అనుకుంటున్నా. మొత్తంగా అసోసియేషన్ కమిటీలో ఎవరు ఉన్నా ఒక్కటే. కాకపోతే వారు చేసే పనులు సక్రమంగా నిర్వహించాలి. ’

‘సినిమా ఇండస్ట్రీ కష్టాలు ఇప్పటివి కావు. ఎన్నో రోజుల నుంచి ఉంటున్నాయి. ఎందరో అధ్యక్షులు మారారు. కానీ ఎవరూ ఏం చేయలేదు. ఇప్పుడు కొత్తగా ఎన్నికైన వారు కూడా ఏదో చేస్తారని అనుకోను. కానీ వారి పనితీరును అందరూ గమనిస్తారు. అసోసియేషన్ వల్ల ఏం ఉపయోగం లేదని నేను అనుకుంటున్నాను. కానీ ఇంతగా హైప్ క్రియేట్ అవుతుందని ఎవరూ ఊహించలేదు. ఇక్కడ వ్యక్తిగతంగానే ఎక్కువగా ఆరోపించుకున్నారు. సినిమా ఇండస్ట్రీ గురించి ఎవరూ మాట్లాడలేదు. దీంతో ముందు ముందు అసోసియేషన్ ఏదో చేస్తుందని నేను అస్సలు అనుకోను.’

‘ఫ్యామిలీ లైఫ్ బాగా ఎంజాయ్ చేస్తాం. ప్రతీ పండుగకు ఎక్కడున్నా అందరం ఒక్కచోటుకు వస్తాం. నా అంతకుముందు చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. కానీ ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నా. రోజా అభిప్రాయాలను ఎప్పుడూ గౌరవిస్తూ ఉంటాను. పిల్లలతో కలిసి ఉండడంతో చాలా సంతోషంగా ఉంటాను. రోజా రాజకీయాల్లో వెళ్లినప్పుడు మొదట భయం వేసింది. తాను ఎలా నెగ్గుకొస్తుందోనని అనుకున్నాను. కానీ తన ప్రతిభ చూసిన తరువాత నాకు నమ్మకం ఏర్పడింది. దీంతో ఆమె ఏ పనిచేసినా కరెక్టే చేస్తుందని నమ్ముతాను’ అని రోజా భర్త సెల్వమణి సంచలన విషయాలను పంచుకున్నారు.