ఆ హీరోయిన్ భర్త రాజకీయాల్లోకి..

Wed Jul 11 2018 16:32:24 GMT+0530 (IST)

‘బాయ్స్’తో తెలుగు ప్రేక్షకుల్ని పలకరించిన క్యూట్ బ్యూటీ జెనీలియా డిసౌజా.. ఆ తర్వాత ‘బొమ్మరిల్లు’.. ‘రెడీ’ లాంటి సినిమాలతో ఇక్కడి జనాల గుండెల్లో తిష్ట వేసుకు కూర్చుంది. ఏడెనిమిదేళ్ల పాటు టాలీవుడ్లో హీరోయిన్ గా కొనసాగిన జెన్నీ.. ఆరేళ్ల కిందట తన లాంగ్ టైం బాయ్ ఫ్రెండ్ రితీశ్ దేశ్ ముఖ్ ను పెళ్లి చేసుకుని వ్యక్తిగత జీవితంలో స్థిరపడిన సంగతి తెలిసిందే. వీళ్లిద్దరికీ ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. రితీశ్ బాలీవుడ్లో హీరోగానే కాక.. కామెడీ పాత్రలు.. నెగెటివ్ పాత్రలతో నటుడిగా ఓ మోస్తరు గుర్తింపే సాధించాడు. హిందీతో పాటు మరాఠీ సినిమాల్లోనూ నటించాడతను. అతడి సినీ కెరీర్ బాగానే సాగిపోతుండగా.. ఉన్నట్లుండి అతను రాజకీయాల వైపు చూస్తుండటం విశేషం.చాలా సింపుల్ గా ఉండే రితీశ్.. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి విలాస్ రావ్ దేశ్ ముఖ్ తనయుడు. ఒకటికి రెండు పర్యాయాలు మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న విలాస్.. అనారోగ్యంతో కొన్నేళ్ల కిందటే మృతి చెందాడు. ఆ తర్వాత కూడా రితీశ్ రాజకీయాల వైపు అడుగులేయలేదు. ఐతే ఎట్టకేలకు అతను తండ్రి వారసత్వాన్ని అందుకోబోతున్నట్లు సమాచారం. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో రితీశ్ ఎంపీ పదవికి పోటీ చేస్తాడట. అతడికి కాంగ్రెస్ పార్టీ టికెట్ కూడా ఖరారు చేసిందట. ప్రస్తుతం తన చేతిలో ఉన్న సినిమాలన్నీ ముగించాక రితీశ్ రాజకీయాలపై దృష్టిపెడతాడట. ఎన్నికలకు కొన్ని నెలల ముందు తన రాజకీయారంగేట్రాన్ని ప్రకటించి.. పూర్తి స్థాయిలో తాను పోటీ చేసే నియోజకవర్గంపై దృష్టిసారిస్తాడట. విలాస్ కు మంచి ఇమేజ్ ఉన్న నేపథ్యంలో రితీశ్ ఎంపీగా గెలిచినా ఆశ్చర్యం లేదని అంటున్నారు.