పాయల్ ఘోష్ పై చట్టపరమైన చర్యలకు సిద్ధమైన హీరోయిన్...!

Mon Sep 21 2020 18:30:52 GMT+0530 (IST)

Heroine ready for legal action against Payal Ghosh ...!

బాలీవుడ్ దర్శక నిర్మాత అనురాగ్ కశ్యప్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని నటి పాయల్ ఘోష్ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన పాయల్.. 'హ్యుమా ఖురేషి - రిచా చద్దా - మహిగిల్ వంటి వారు నాకు కాల్ దూరంలో ఉంటారని.. నేనెప్పుడు పిలిచినా వచ్చి నేనేం చేయమంటే అది చేస్తారని అనురాగ్ కశ్యప్ తనతో చెప్పాడ'ని పేర్కొంది. అయితే లైంగిక ఆరోపణలలో తన పేరును వాడటాన్ని నటి రిచా చద్దా తీవ్రంగా ఖండించారు. తన పేరు అవమానకర రీతిలో వాడారని.. వారిపై న్యాయ పోరాటానికి తాను సిద్ధంగా ఉన్నానని రిచా చద్దా ప్రకటించారు. రిచా తరపు న్యాయవాది తన క్లయింట్ పేరును వాడిన వ్యక్తిపై త్వరలోనే చట్టపరమైన తీసుకుంటున్నట్లు ఒక ప్రకటన విడుదల చేశారు.''కాంట్రవర్సియల్ మరియు నిరాధారమైన ఆరోపణల వివాదాల్లో మూడవ వ్యక్తి తనను తీసుకురావడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. నా క్లయింట్ రిచా చద్దా అన్యాయానికి గురైన మహిళలకు న్యాయం జరగాలని కోరుకునే వ్యక్తి. అలాంటి వ్యక్తి పేరును అవమానకర రీతిలో వాడారు. ఆధారాలు లేని తప్పుడు ఆరోపణలు చేయడమే కాకుండా ఇతర మహిళలను అనవసరంగా వివాదంలో తీసుకొచ్చి సమాజంలో వారి ఆత్మగౌరవాన్ని కించపరిచారు. ఓ మహిళకి తన స్వేచ్చా పోరాటంలో మరో మహిళ వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే హక్కు లేదు. దీనిని తీవ్రంగా ఖండిస్తూ న్యాయ పోరాటం చేయాలని నిర్ణయించుకున్నాం. త్వరలోనే చట్టపరమైన చర్యలు ప్రారంభిస్తాం'' అని రిచా తరపు న్యాయవాది పేర్కొన్నారు.

మరోవైపు పాయల్ ఆరోపణలకు మద్ధతు తెలుపుతూ కంగనా రనౌత్ అనురాగ్ కశ్యప్ పై చర్యలు తీసుకోవాలని కోరింది. అదే విధంగా రామ్ గోపాల్ వర్మ - తాప్సీ పొన్ను - అనుభవ్ సిన్హా - రాధికా ఆప్టే - కల్కి కొచిన్ వంటి పలువురు సెలబ్రిటీలు అనురాగ్ కశ్యప్ అలాంటి వాడు కాదంటూ ఆయనకు సపోర్ట్ చేస్తూ పోస్టులు పెట్టారు.