హైకోర్టు ముందుకు రియా చక్రవర్తి బెయిల్ పిటిషన్ విచారణ...!

Tue Sep 29 2020 18:01:00 GMT+0530 (IST)

Rhea Chakraborty's bail petition to be heard in High Court ...!

బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతి కేసులో వెలుగులోకి వచ్చిన డ్రగ్స్ వ్యవహారంలో హీరోయిన్ రియా చక్రవర్తి మరియు ఆమె సోదరుడు షోవిక్ ని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం జైలులో ఉన్న వీరిద్దరు పెట్టుకున్న బెయిల్ పిటిషన్ ను బాంబే హైకోర్టు నేడు విచారించనుంది. వీరితో పాటు ఈ కేసులో నిందితులుగా ఉన్న మరో ఐదుగురు వ్యక్తుల అభ్యర్థనపై కూడా హైకోర్టు విచారణ చేపట్టనుంది. గతంలో రియా బెయిల్ అభ్యర్థనను న్యాయస్థానం తోసిపుచ్చిన నేపథ్యంలో ఈసారైనా ఆమెకు బెయిల్ వస్తుందా లేదా అనేది చూడాలి.అయితే డ్రగ్స్ కేసులో రియా మరియు ఆమె సోదరుడికి బెయిలు మంజూరు చేయవద్దంటూ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో సోమవారం తన నివేదికలో పేర్కొంది. రియా మరియు ఆమె సోదరుడు డ్రగ్స్ తీసుకోవడమే కాకుండా ఇతరులకు సరఫరా కూడా చేశారని.. ఎన్‌డీపీఎస్ యాక్ట్ ప్రకారం ఇది అత్యంత తీవ్రమైన నేరమని పేర్కొంది. అదే విధంగా వీరికి డ్రగ్స్ సిండికేట్ తో సంబంధాలు ఉన్నాయని.. రియా డ్రగ్స్ అక్రమ రవాణాలో పాలుపంచుకున్నారని నిరూపించేందుకు తగిన ఆధారాలు లభించాయని ఎన్సీబీ వెల్లడించిందని సమాచారం. ఈ నేపథ్యంలో రియాకు బెయిల్ వస్తుందా అనే దానిపై సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

కాగా సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసులో ప్రధాన నిందితురాలిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న అతని గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తి.. డ్రగ్ వ్యవహారాల్లో సంబంధం కలిగి ఉందనే ఆరోపణలతో సెప్టెంబరు 9న ఆమెను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అరెస్టు చేసింది. ప్రస్తుతం బైకుల్లా జైలులో ఉన్న రియా నుంచి ఎన్సీబీ అధికారులు కీలక సమాచారం రాబట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో రియా వాట్సాప్ చాట్ ఆధారంగా హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ని ఎన్సీబీ విచారించింది. అలానే సుశాంత్ మాజీ మేనేజర్ జయ సాహా వాట్సాప్ చాట్స్ ఆధారంగా దీపికా పదుకొనే - శ్రద్ధా కపూర్ - సారా అలీఖాన్ ల స్టేట్మెంట్స్ రికార్డ్ చేశారు.