Begin typing your search above and press return to search.

రివ్యూలకు సినిమా రిజల్ట్‌ ని తారుమారు చేసే శక్తి ఉందా...?

By:  Tupaki Desk   |   7 July 2020 3:30 PM GMT
రివ్యూలకు సినిమా రిజల్ట్‌ ని తారుమారు చేసే శక్తి ఉందా...?
X
సినీ ఇండస్ట్రీలో రివ్యూలకి ప్రత్యేక స్థానం ఉంటుంది. ఒక సినిమా విడుదలైనప్పుడు ఆ సినిమా ఎలా ఉంది.. ఏమి బాగుంది.. ఏమి బాగాలేదు.. నటీనటుల యాక్టింగ్ ఎలా ఉంది.. డైరెక్టర్ పనితీరు ఎలా ఉంది అనే విషయాలను రివ్యూస్ చెప్తుంటాయి. రివ్యూస్ అనేవి సినిమా విషయంలో జరిగిన తప్పొప్పులను ఎత్తిచూపడంతో భవిష్యత్ లో వాటిని సరిచేసుకొని మంచి సినిమా బయటకి రావడానికి ఉపయోగపడతాయి. అంతేకాకుండా సినీ ప్రేక్షకుడి అభిరుచిని కూడా పెంపొందిస్తాయి. ఇక సినిమా రివ్యూ అనేది అభిప్రాయం మాత్రమే. సినిమాలో సత్తా ఉంటే రివ్యూస్ తో సంబంధం లేకుండా విజయవంతంగా ప్రదర్శించబడుతుంది. ఒక్కోసారి రివ్యూ రిపోర్ట్స్ పాజిటివ్ గా వచ్చినా బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయాలుగా నిలబడిన సందర్భాలు ఉన్నాయి. అలానే రివ్యూలో సినిమా బాగాలేదని చెప్పిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించిన సంఘటనలూ ఉన్నాయి.

నిజంగా సినిమాలను రివ్యూలు ప్రభావితం చేస్తాయా.. రివ్యూలకు సినిమా రిజల్ట్‌ ని తారుమారు చేసే శక్తి ఉందా.. అంటే మంచి సినిమాలను ఏ రివ్యూస్ కూడా ఆపలేవు అని చెప్పవచ్చు. అయితే తమ సినిమాలకు నెగిటివ్ రివ్యూస్ వచ్చినప్పుడు కొందరు అసహనానికి గురవుతూ ఉంటారు. వారికి ఏ అర్హత ఉందని ప్రశ్నిస్తూ ఉంటారు. భావ ప్రకటనా స్వేచ్ఛ అనేది భారత రాజ్యాంగం కల్పించిన హక్కు. ఏదైనా విషయం పై స్పందించే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది. దానికి అర్హతలతో సంబంధం లేదు. ఏ సమీక్షకుడు కూడా కావాలని సినిమా బాగాలేదని రివ్యూ రాయడు.. ఒకవేళ మంచి సినిమాని బాగాలేదని చెప్పినా ప్రేక్షకులు మంచి సినిమాని చూడకుండా ఉండరు. అయితే రివ్యూలు బాగా రాసినప్పుడు వారి అర్హత సామర్థ్యం ఎవ్వరికీ గుర్తు రావని.. తమ సినిమాల విషయంలో జరిగిన తప్పొప్పులను ఎత్తి చూపినప్పుడు మాత్రం అందరికీ అన్ని గుర్తుకు వస్తాయనేది ఎప్పుడు మీడియా వర్గాల్లో చర్చించుకునే విషయమే. నిజానికి ఏ సినిమా విషయంలోనైనా అంతిమ నిర్ణయం ప్రేక్షకుల చేతుల్లోనే ఉంటుందని అందరూ గుర్తు పెట్టుకోవాల్సిన విషయం.

మంచి సినిమాకి ఎన్ని నెగిటివ్ రివ్యూస్ వచ్చినా ఎవరూ ఆపలేరన్నది అందరూ అంగీకరించాల్సిన వాస్తవం. ఉదాహరణకి మార్కెట్ లోకి ఏదైనా కొత్త ప్రోడక్ట్ వచ్చినప్పుడు దానిని వాడిన వ్యక్తి అది ఎలా ఉందని చెప్పడం సహజంగా జరిగేదే. ఇప్పుడు ఈ-కామర్స్ సైట్స్ లో విరివిరిగా లభించే ప్రొడక్ట్స్ కొన్నప్పుడు కస్టమర్ దాని రివ్యూ ఇవ్వమని అడుగుతారు. ఒక కొత్త మొబైల్ వాడినప్పుడు దాంట్లో ఏమి బాగాలేదు ఏమి బాగుంది అని యూజ్ చేసిన వ్యక్తి చెప్తాడు. అంత మాత్రాన ఆ మొబైల్ తయారీ మీద కొన్ని జీవితాలు ఆధార‌ప‌డి ఉంటాయ‌ని.. సదరు వ్యక్తి బాగాలేదని చెప్తే ఆ మొబైల్ ఎవరూ కొనరు అనడం ఎంత వరకు కరెక్ట్ అనేది అందరూ ఆలోచించాలి. సినిమాలో బాగాలేని విషయాలను ప్రస్తావించినప్పుడు ఆ సినిమాపై ఆధారపడి చాలా జీవితాలు ఉన్నాయని.. బాగాలేని సినిమా బాగాలేద‌ని చెప్తే దాని మీద ఆధార‌ప‌డే వ్యక్తులు వీధిన ప‌డ‌తార‌న‌డం ఎంత వరకు సమంజసం. ఒక మంచి మొబైల్ ని మార్కెట్ అవకుండా చేయడం ఎంత కష్టమో ఒక మంచి సినిమాని జనాల్లోకి వెళ్లకుండా ఆప‌డం కూడా అంతే కష్టమనే విషయం అందరూ గుర్తించాలి.