Begin typing your search above and press return to search.

'క్రాక్' స్టేజ్ పై అత్యుత్సాహంతో ఆ సీక్రెట్ రివీల్

By:  Tupaki Desk   |   14 Jan 2021 5:30 PM GMT
క్రాక్ స్టేజ్ పై అత్యుత్సాహంతో ఆ సీక్రెట్ రివీల్
X
ఒక వైపున కరోనా స్ట్రెయిన్ అంటూ వార్తలు కంగారు పెడుతున్న సమయంలో, 'క్రాక్' సినిమా థియేటర్లలోకి దిగిపోయింది. జనం వస్తారో .. లేదోనని టీమ్ పడిన టెన్షన్ మొదటిరోజే ఎగిరిపోయింది. లాక్ డౌన్ కి ముందు థియేటర్లకు జనం ఎలా వచ్చారో, ఈ సినిమాకి అలా వస్తున్నారు. విడుదలైన ప్రతిచోటున ఈ సినిమా విజయవిహారం చేస్తోంది. 50 శాతం అక్యుపెన్సీతోనే మంచి వసూళ్లను రాబడుతూ దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా టీమ్, వైజాగ్ లో సక్సెస్ సెలబ్రేషన్స్ ను నిర్వహించింది.


ఈ సెలబ్రేషన్స్ కి కూడా జనం పెద్ద ఎత్తున తరలిరావడం విశేషం. వరలక్ష్మీ శరత్ కుమార్ ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్రను పోషించింది. ఈ వేదికపై ఆమె మాట్లాడుతూ ఒక సీక్రట్ రివీల్ చేసేసింది. తన పాత్ర ఈ సినిమాలో చనిపోతుందనే విషయాన్ని ఆమె బయటపెట్టేసింది. వరలక్ష్మీ శరత్ కుమార్ విలనిజానికి తెలుగులోను అభిమానులు ఉన్నారు. నిండుగా కనిపిస్తూ నిబ్బరంగా ఆమె విలనిజాన్ని పండించే తీరు .. నిర్భయంతో కూడిన డైలాగ్ డెలివరీ జనానికి బాగా నచ్చింది. దానికి తోడు ఆమె తెలుగు చాలా బాగా మాట్లాడటం వలన కూడా తొందరగా ఇక్కడివారికి కనెక్ట్ అయ్యింది. అందువలన ఆమె ఈ సినిమాలో ఎలాంటి పాత్రను పోషించిందా అనే కుతూహలం వాళ్లందరిలోను ఉంది.


సక్సెస్ సెలబ్రేషన్స్ లో ఆమె మాట్లాడుతూ, తనకి ఈ అవకాశం ఇచ్చిన గోపీచంద్ మలినేనికి కృతజ్ఞతలు తెలియజేసింది. రవితేజతో తనకి ఇంతకుముందే పరిచయం ఉందనీ, ఆయనతో కలిసి నటించడం ఆనందంగా ఉందని చెప్పింది. రాత్రివేళలో షూటింగు జరుగుతున్నప్పుడు టీమ్ డీలాపడిపోకుండా రవితేజ ఫుల్ ఎనర్జీని ఇచ్చేవారని అంది. ఇక సముద్రఖనితో కలిసి పనిచేసే అవకాశం కోసం ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నాననీ, ఆ అవకాశం ఈ సినిమాతో దక్కిందంటూనే, ఆయన తనను చంపేయడమే బాగోలేదంటూ కథలోని సస్పెన్స్ ను లీక్ చేసేసింది. ఇది సినిమా వసూళ్లకు అడ్డుపడే విషయం కాకపోయినప్పటికీ, అత్యుత్సాహంతో కొన్నిసార్లు అలా జరిగిపోతుంటుందంతే!