పిల్లల గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయిన రేణు దేశాయ్..!

Sat Dec 05 2020 15:08:35 GMT+0530 (IST)

Renu Desai emotional talking about Her children

'బద్రి' 'జానీ' సినిమాలలో హీరోయిన్ గా నటించిన రేణు దేశాయ్ ల్.. ఆ మధ్య నటనకు దూరం అయినప్పటికీ కాస్ట్యూమ్ డిజైనర్ గా రచయితగా నిర్మాతగా దర్శకురాలిగా ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. పవన్ కళ్యాణ్ ని ప్రేమ వివాహం చేసుకున్న రేణు.. ఆయనతో విడాకులు తీసుకొని తన ఇద్దరు పిల్లలు అకీరా నందన్ - ఆద్య లతో కలిసి జీవిస్తోంది. తండ్రికి దూరంగా ఉంటున్నప్పటికీ వారికి ఆ లోటు తెలియకుండా పెంచి పెద్ద చేస్తోంది. తాజాగా ఓ షో లో పాల్గొన్న రేణు దేశాయ్ తన పిల్లల గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యింది. యాంకర్ సుమ కనకాల నిర్వహిస్తున్న 'సుమక్క' యూట్యూబ్ చానెల్ లో ప్రసారం అవుతున్న ఓ కార్యక్రమంలో రేణు పాల్గొంది. రేణు దేశాయ్ బర్త్ డే నేపథ్యంలో ఈ స్పెషల్ ప్రోగ్రాం ని ప్రసారం చేశారు.సుమ - రేణుదేశాయ్ మధ్య సరదా సంభాషణలతో ఈ షో ఫన్నీగా సాగింది. ఈ షోలో తన పిల్లలు ఆద్య అకీరాల గురించి మాట్లాడిన రేణు దేశాయ్ కళ్లలో ఆనందబాష్పాలు కనిపించాయి. ఆద్య - అకీరాలే తనకు సర్వస్వం అని.. తన పిల్లలిద్దరూ ఏదైనా ఫంక్షన్స్ లేదా పవన్ షూటింగ్స్ కి వెళ్ళినప్పుడు అక్కడి డైరెక్టర్లు నటీనటులు ఆ ఇద్దరినీ చూసి తనకు ఫోన్ చేసి వారి గురించి మాట్లాడేవారని రేణు చెప్పుకొచ్చింది. మీ పిల్లలు చాలా చక్కగా ఉన్నారు.. అందరితో కలసి పోతున్నారు అని వాళ్ళు చెప్పినప్పుడు ఒక తల్లిగా ఆ క్షణాలు తనకెంతో సంతోషం కలిగించేవని తెలుపుతూ రేణు దేశాయ్ భావోద్వేగానికి గురైంది. ఈ సందర్భంగా సుమ 'బెస్ట్ మామ్ ఎవర్' అంటూ రేణు తన పిల్లలతో దిగిన ఫోటోను ముద్రించిన ఓ టీ కప్పు ని ఆమెకు గిఫ్ట్ గా అందించింది. ప్రస్తుతం 'సుమక్క' ఛానల్ లోని ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది.