Begin typing your search above and press return to search.

అంటే అన్నామంటారు కానీ.. డబ్బుల కోసం ఆ పనేంది రెజీనా?

By:  Tupaki Desk   |   22 Oct 2021 11:30 PM GMT
అంటే అన్నామంటారు కానీ.. డబ్బుల కోసం ఆ పనేంది రెజీనా?
X
సెలబ్రిటీలు మహా సున్నితంగా.. సుకుమారంగా మారిపోయారు. అదేంటి.. వారెప్పుడు అలానే ఉంటారు కదా? అని అంటారా? మేం చెబుతున్నది మనసు గురించి. చూసేందుకు సున్నితంగా ఉన్నప్పటికీ మానసికంగా చాలా బలంగా ఉంటారు. ఎందుకంటే.. వారు అలా ఉండకుంటే.. ఇండస్ట్రీలో నిలవటం అంత తేలికైన విషయం కాదు. అవునన్నా.. కాదన్నా.. సెలబ్రిటీలు సమాజాన్ని ప్రభావితం చేస్తారు. వారు చేసే పనుల్ని ఆదర్శంగా తీసుకునే వారు చాలామందే ఉంటారు. అందుకే.. ప్రైవేటు లైఫ్ లో ఎలా ఉన్నా.. పబ్లిక్ లైఫ్ లోకి వచ్చేసరికి వారు చేసే పనుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని చెబుతారు. సెలబ్రిటీలకు ఉన్న ఇమేజ్ ను క్యాష్ చేసుకోవటానికి కంపెనీలు చాలానే ప్రయత్నాలు చేస్తుంటారు.

ప్రజలకు హాని కలిగించేది.. వారి ఆరోగ్యాన్ని దెబ్బ తీసే ఉత్పత్తులకు ప్రచారం చేయకుండా ఎవరికి వారు స్వీయ నియంత్రణ తీసుకోవటం కనిపిస్తుంటుంది. అందుకు భిన్నంగా కొందరు నటులు.. సెలబ్రిటీలు ఒప్పందాలకు ఓకే చెప్పి.. ఆ తర్వాత ప్రజల నుంచి వచ్చే విమర్శలకు వెనకడుగు వేస్తుంటారు. మొన్నీ మధ్యనే బిగ్ బి అమితాబ్ ఒక పాన్ మసాలా యాడ్ చేయటం.. దాని కారణంగా ప్రజల ఆరోగ్యానికి హాని కలుగుతుందన్న విషయాన్ని తెలిసినంతనే ఆయన ఆ బ్రాండ్ నుంచి బయటకు వచ్చేస్తున్నారు. ఇలా.. బ్రాండ్ లకు ప్రచారం చేసే విషయంలో చాలానే జాగ్రత్తలు తీసుకుంటారు.

అందుకు భిన్నంగా కొందరు మాత్రం.. ఎవరేం అనుకున్నా ఫర్లేదు.. తాము అనుకున్నది చేయటం.. ఆదాయమే ప్రధానమన్నట్లుగా వ్యవహరిస్తుంటారు. తాజాగా అలాంటి పనే చేశారు తెలుగులో పలు సినిమాలు చేసిన సుందరాంగి రెజీనా కసండ్రా. మొదట్లో అవకాశాలు బాగానే వచ్చినా.. తర్వాతి కాలంలో తగ్గటం.. ఇప్పటికి కొన్ని పాత్రలకు ఆమెకు మాత్రమే సూట్ అయ్యేలా పాత్రల్ని చేస్తున్నారు. సినిమా అవకాశాలు తక్కువగా ఉన్న వేళ.. యాడ్స్ మీద ఫోకస్ చేశారు. ఏమనుకున్నారో తెలీదు కానీ.. తాజాగా ఆమె ఒక విస్కీ బ్రాండ్ కు పని చేశారు.

ఆ బ్రాండ్ కు సంబంధించిన ఫోటోను షేర్ చేసిన రెజీనా.. ''తొమ్మిదేళ్ల వయసులో యాంకరింగ్ లోకి వచ్చా. ఇప్పుడు సినిమాలు.. ప్రకటనలు చేసే స్థాయికి చేరుకున్నా. నా జర్నీ ఎప్పటికి పదిలం. ఈ మూమెంట్స్ ను దీంతోనే సెలబ్రేట్ చేసుకుంటా' అని చెబుతూ సదరు బ్రాండ్ పేరు చెప్పిన వైనాన్ని చూసిన నెటిజన్లు తిట్టిపోస్తున్నారు. ఇప్పటికే తాగుడు ఎక్కువై యూత్ తూగుతున్నారన్న విమర్శ ఎక్కువగా వినిపిస్తున్న వేళ.. ఇలా చేయటం ఏమైనా పద్దతిగా ఉందా రెజీనా? అని ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి పనులు చేయటం.. ఎవరైనా తిడితే.. తెగ ఫీల్ కావటం బాగోలేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.