Begin typing your search above and press return to search.

దర్శకరత్న దాసరి వర్ధంతి కార్యక్రమానికి చిరు ఎందుకు రాలేదో...?

By:  Tupaki Desk   |   31 May 2020 4:02 AM GMT
దర్శకరత్న దాసరి వర్ధంతి కార్యక్రమానికి చిరు ఎందుకు రాలేదో...?
X
తెలుగు సినీ పరిశ్రమలో తిరుగులేని శక్తి స్వరూపంలా ఎదిగారు దర్శకరత్న దాసరి నారాయణరావు. దర్శకుడిగా రచయితగా నటుడిగా మల్టీటాలెంటెడ్ అనిపించుకున్నారు. ప్రపంచంలోనే అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించిన డైరెక్టర్ గా గిన్నిస్ బుక్ లో ఎక్కారు దాసరి. ఇండస్ట్రీ పెద్దగా టాలీవుడ్ మొత్తాన్ని ఏకతాటిపై నడిపించారు. దాసరి దగ్గరకు వెళ్లకుండా ఇండస్ట్రీలో ఏ పని జరగదు.. ఏ సమస్యా పరిష్కారమవ్వదు అనే స్థాయికి ఎదిగారు. అంతటి ధైర్యం.. తెలివి.. సమయస్ఫూర్తి దాసరి సొంతం. తెలుగు ప్రేక్షకులను సినీ పరిశ్రమను ఆయన వదిలి వెళ్లిపోయినా దర్శకరత్నగా ప్రేక్షకుల గుండెల్లో ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతారు. కాగా దాసరి నారాయణరావు 3వ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ ఫిలింఛాంబర్‌ లో టాలీవుడ్ ప్రముఖులు ఆయన విగ్రహానికి నివాళులు అర్పించి అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. హీరో శ్రీకాంత్ - నిర్మాత సి. కళ్యాణ్ - దర్శక నిర్మాత తమ్మరెడ్డి భరద్వాజ - దర్శకులు రేలంగి నరసింహారావు - తుమ్మలపల్లి రామసత్యనారాయణ - నిర్మాత ప్రసన్న కుమార్ తదితరులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల వలన సినిమా ఇండస్ట్రీలో జరిగిన నష్టాన్ని దాసరి‌ గారు అయితే వేరే రకంగా పూడ్చేవారు. దాసరి గారిని తలుచుకోని రోజు అనేది ఉండదు. ఏ సమస్య వచ్చినా ముందుండే వ్యక్తి. ప్రతి సినిమా టెక్నీషియన్‌ కు నటుడికి విలువ ఇచ్చి మాట్లాడేవారు. ఆయన లేని లోటు కనిపిస్తోంది. ఈరోజు ఆయన మూడో వర్ధంతి సందర్భంగా 200 నుండి 300 మందికి అన్నదానం చేస్తున్నామని.. వచ్చే ఏడాది మరింత ఘనంగా చేస్తాము అని తెలిపారు.

అయితే ఈ కార్యక్రమానికి దాసరిని అమితంగా ఇష్టపడే మెగాస్టార్ చిరంజీవి కూడా వచ్చి ఉంటే బాగుండేదని సినీ అభిమానులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి - దర్శకరత్న దాసరి నారాయణరావు మధ్య అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వారిద్దరికీ ఒకరి మీద ఒకరికి ఎనలేని గౌరవం ఉండేది. అప్పట్లో చిరంజీవి సినిమాకి సంభందించి ఏ ఫంక్షన్ చేసిన దానికి దాసరే ముఖ్య అతిధిగా ఉండేవారు. అలాంటి వారిద్దరి అనుబంధంలో కొన్నేళ్లు మనస్పర్ధలు వచ్చాయనేది అందరికీ తెలిసిన విషయమే. ముఖ్యంగా చిరంజీవి పొలిటికల్ ఎంట్రీ తర్వాత వీరి మధ్య గ్యాప్ ఎక్కువగా వచ్చిందనేది ఎక్కువమంది అభిప్రాయం. అయితే దాసరి చిరంజీవి రీఎంట్రీ మూవీ 'ఖైదీ నెం. 150' ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు అతిధిగా వెళ్లారు. దాసరి హాస్పిటల్ లో ఉండగా చిరంజీవి వెళ్లి కలిసి ఆప్యాయంగా మాట్లాడారు. అంతేకాకుండా అల్లు రామలింగయ్య అవార్డు కూడా బహుకరించారు. దాసరి మరణం వలన చిరంజీవి కూడా చాలా రోజులు బాధ పడ్డారు.

ఈ మధ్య దాసరి జయంతి సందర్భంగా ''ఇది గురువు గారితో నా చివరి జ్ఞాపకం.. వియ్ మిస్ యూ సార్'' అంటూ వారిద్దరూ ప్రెస్స్ మీట్ లో పాల్గొన్న ఫోటో షేర్ చేసి భావోద్వేగ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. దా - దానంలో కర్ణుడు మీరు.. స - సమర్ధతలో అర్జునుడు మీరు.. రి - రిపువర్గమేలేని ధర్మరాజు మీరు.. మీరు మా మధ్య లేకపోయినా మీ స్ఫూర్తి ఎప్పుడూ సజీవంగానే వుంటుంది. ప్రతీ భావిదర్శకుడి జీవితానికి మార్గదర్శకమవుతుంది అంటూ దాసరి పట్ల తనకున్న అంకిత భావాన్ని తెలియజేసారు. అలాంటిది చిరంజీవి దాసరి వర్ధంతి వేడుకలకు వెళ్ళకపోవడం ఏంటని పలువురు సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో నెలకొని యున్న పరిస్థితుల వలన రాలేకపోయాడా అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే కొంతమంది మాత్రం మెగాస్టార్ ఒక కార్యక్రమానికి అటెండ్ అయితే పెద్ద సంఖ్యలో జనం గుమిగూడే అవకాశం ఉంది.. ప్రస్తుత పరిస్థితుల్లో ఇది మంచిది కాదని అలోచించి రాకపోయుంటాడు అని అభిప్రాయపడుతున్నారు. కారణాలు ఏవైనా మెగాస్టార్ చిరంజీవి కూడా దాసరి వర్ధంతి కార్యక్రమానికి వచ్చి ఉంటే బాగుండేదని సినీ అభిమానులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.