ఆదివారం వస్తున్న అగ్ర హీరోలు

Mon Oct 14 2019 10:34:13 GMT+0530 (IST)

సంక్రాంతి వస్తుందంటే తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి గురించి మాత్రమే కాదు ఆ సీజన్ లో వచ్చే సినిమాల గురించి కూడా తెలుగు ప్రేక్షకులు ఆలోచిస్తారు. సంవత్సరం మొత్తంలో రిలీజ్ అయ్యే సినిమాలది ఒక లెక్క. సంక్రాంతి సీజన్ లో విడుదల అయ్యే సినిమాలు ఒక లెక్క. బడా స్టార్స్ - స్టార్ డైరెక్టర్స్ తమ సినిమాలను సంక్రాంతి సీజన్ లో రిలీజ్ చేయడానికి ఇష్టపడతారు. సంక్రాంతి సీజన్ లో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు వచ్చిన ప్రతి సినిమాను చూడడానికి ఇష్టపడతారు. అది చిన్న సినిమానా - పెద్ద సినిమానా అని ఆలోచించరు.2020లో కూడా అభిమానులకు కిక్ ఇవ్వడానికి మన స్టార్స్ సిద్దంగానే ఉన్నారు. ఈ సారి మహేష్ బాబు - అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోలు సంక్రాంతి బరిలో దూకబోతున్నారు. అయితే ఇక్కడ వింత ఏంటంటే ఈ ఇద్దరి సినిమాలు ఆదివారం రిలీజ్ కాబోతున్నాయి. సాధారణంగా చాలా అరుదుగా ఆదివారం సినిమాలను రిలీజ్ చేస్తారు. కానీ మహేష్ బాబు సినిమా 'సరిలేరు నీకెవ్వరు' - అల్లు అర్జున్ 'అల వైకుంఠపురంలో' సినిమాలు జనవరి 12న (ఆదివారం) రిలీజ్ చేస్తున్నారు. సంక్రాంతి సెలవుల్లో వీకెండ్ చూసుకోకుండా ఎప్పుడు రిలీజ్ చేసిన అభిమానులు సినిమాలను హిట్ చేస్తారని వాళ్ళ నమ్మకం.

కానీ వీకెండ్ ని ఈ స్టార్స్ ఎందుకు వదులుకుంటున్నారు అని ఆలోచిస్తే మాత్రం ఒక రీజన్ కనిపిస్తుంది. గతంలో మహేష్ బాబు నటించిన '1 నేనొక్కడినే' - త్రివిక్రమ్ డైరెక్ట్ చేసిన 'అజ్ఞాతవాసి' సినిమాలు జనవరి 10న రిలీజ్ అయ్యి అభిమానులను ఆకట్టుకోలేకపోయాయి. దాంతో జనవరి 10న (శుక్రవారం) తమ సినిమాలను విడుదల చేయడానికి ఆ స్టార్స్ భయపడుతున్నారు. ఈ సెంటిమెంట్ ఉంటె తమ సినిమాలను జనవరి 9న - లేకపోతె జనవరి 11న విడుదల చేయొచ్చు. కానీ వాళ్ళు జనవరి 12నే ఎందుకు ఎంచుకున్నారో వాళ్ళకే తెలియాలి. సంక్రాంతి సీజన్ లో కొంచెం లేట్ గా విడుదలైన సినిమాలు ఎక్కువ హిట్ అయ్యాయి అనే సెంటిమెంట్ వీళ్ళు ఫాలో అవుతున్నట్టున్నారు.