'వాల్మీకి' విలన్ ఈయన కాదు ఆయన

Wed Sep 18 2019 22:36:04 GMT+0530 (IST)

ఒకే రోజు రెండు సినిమాలు రిలీజైతే ఆ మేరకు ఇరు సినిమాలకు కలెక్షన్ల పరంగా పంచ్ పడడం ఖాయం. ఆ కోవలోనే వరుణ్ తేజ్ వాల్మీకికి పంచ్ పడబోతోందన్నది ట్రేడ్ టాక్. వాస్తవానికి గ్యాంగ్ లీడర్ తో పాటుగా సెప్టెంబర్ 13న రిలీజ్ కావాల్సిన ఈ చిత్రాన్ని 20 నాటికి వాయిదా వేయడం పెద్ద మైనస్ అవుతోందన్నది ఓ విశ్లేషణ.అప్పట్లో నాని గ్యాంగ్ లీడర్ నిర్మాతలు కోరడంతో `వాల్మీకి`ని వారం పాటు వాయిదా వేశారు. ఇప్పుడదే ఆ టీమ్ ను చిక్కుల్లోకి నెట్టేస్తోందట. `వాల్మీకి` రిలీజ్ అవుతున్న రోజునే సూర్య నటించిన `బందోబస్త్` విడుదలవుతోంది.  `బందోబస్త్` రిలీజ్ తేదీని మార్చుకోవాలని .. వారం అయినా పోస్ట్ పోన్ చేయాలని మైత్రీ వారిలా 14 రీల్స్ నిర్మాతలు ప్రయత్నించలేదు. దీంతో సూర్యతో పోటీ వరుణ్ కు అనివార్యంగా మారింది.

సూర్య `బందోబస్త్` చిత్రాన్ని నైజాంలో దిల్ రాజు భారీగా రిలీజ్ చేస్తున్నారు. నైజామ్ హక్కుల కోసం పెద్ద మొత్తం వెచ్చించిన ఆయన ఇప్పుడు రిలీజ్ ని వాయిదా వేసే మూడ్ లో లేరట. దీంతో థియేటర్ల పరంగానూ నైజాంలో పోటీ నెలకొంది. ఇలాంటి టైమ్ లో టాక్ ఏమాత్రం తేడా కొట్టినా కలెక్షన్లపై  ప్రభావం పడే అవకాశం వుంది. అది `వాల్మీకి` టీమ్ ని భయపెడుతోందట. `ఫిదా` సినిమాతో వరుణ్ కు బ్లాక్ బస్టర్ హిట్ ని అందించిన దిల్ రాజు `బందోబస్త్` రూపంలో విలన్ గా మారడం విడ్డూరమే అని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. అప్పుడు మంచి రిలీజ్ తేదీని దానమిచ్చి ఇప్పుడు పోటీతో రిలీజవుతుండడం వాల్మీకికి మైనస్ గా మారుతోంది. త్యాగం చేస్తే కనీసం పోటీ అయినా లేకుండా చూసుకోవాలి కదా! అన్న చర్చ సాగుతోంది.