Begin typing your search above and press return to search.

విశాల్‌ టీం కు షాక్‌ నడిగర్‌ సంఘంకు మళ్లీ ఎన్నికలు

By:  Tupaki Desk   |   25 Jan 2020 5:43 AM GMT
విశాల్‌ టీం కు షాక్‌ నడిగర్‌ సంఘంకు మళ్లీ ఎన్నికలు
X
గత ఏడాది అనేక వివాదాల నడుమ జరిగిన తమిళ సినీ నటుల సంఘం(నడిగర్‌ సంఘం) ఎన్నికలు చెల్లవు అంటూ తమిళనాడు హై కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఎన్నికలు జరిగి చాలా నెలలు అవుతున్నా కూడా కోర్టు కేసు కారణంగా ఎన్నికల ఫలితాలను వెలువరించని విషయం తెల్సిందే. నడిగర్‌ సంఘం ఎన్నికల్లో తమను ఓటు హక్కు వినియోగించుకోకుండా చేశారంటూ బెంజ్‌ మన్‌ మరియు ఏలుమలై అనే నడిగర్‌ సంఘం మాజీ సభ్యులు హైకోర్టు ను ఆశ్రయించారు. తమపై తప్పుడు ఆరోపణలు చేసి సంఘం నుండి బహిష్కరించారు అంటూ వారు హైకోర్టుకు వెళ్లారు. గత కొన్ని నెలలు గా నడిగర్‌ సంఘం మాజీ అధ్యక్షుడు మరియు కార్యదర్శులు అయిన విశాల్‌ మరియు నాజర్‌ టీం లను ప్రతి వాదులుగా చేర్చి హైకోర్టు విచారణ జరిపింది.

గడువు ముగిసిన ఆరు నెలల తర్వాత నడిగర్‌ సంఘం ఎన్నికలు నిర్వహించడం వెనుక ఉద్దేశ్యం ఏంటీ అంటూ కోర్టు విశాల్‌.. నాజర్‌ టీంను ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో విశాల్‌.. నాజర్‌ లు ఒక టీంగా పోటీ చేయగా కే భాగ్యరాజ్‌ అధ్యక్షతన ఒక టీం పోటీ చేశారు. ఈ రెండు టీం లు కూడా హోరా హోరీగా ప్రచారం చేయడం జరిగింది. అధికారంలో ఉన్న నాజర్‌ విశాల్‌ టీం లు అక్రమాలకు పాల్పడ్డట్లు గా ప్రత్యర్థి భాగ్యరాజ్‌ టీం ఫిర్యాదు చేయడం జరిగింది. నడిగర్‌ ఎన్నికల పై పలు కేసులు మరియు ఫిర్యాదులు నమోదు అవ్వడం తో వాటన్నింటిని పరిశీలించిన కోర్టు నిన్న తుది తీర్పు ఇవ్వడం జరిగింది.

ఆ తీర్పు ప్రకారం గత ఏడాది జరిగిన ఎన్నికలు చెల్లవు. మళ్లీ కొత్తగా నడిగర్‌ సంఘం ఓటర్ల జాబితాను తయారు చేసి.. ఎన్నికలను సక్రమంగా నిర్వహించాలంటూ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఎన్నికల విధి విధానాలను పర్యవేక్షించేందుకు మాజీ న్యాయమూర్తి గోకుల్‌ దాస్‌ ను నియమిస్తున్నట్లుగా కోర్టు వెళ్లడించింది. మొత్తానికి మళ్లీ ఎన్నికలు అంటే విశాల్‌ అండ్‌ టీంతో పాటు భాగ్యరాజ్‌ టీం కు కూడా ఇబ్బందే అంటున్నారు. మూడు నెలల్లో ఎన్నికల పక్రియ పూర్తి అవ్వాల్సింది గా కోర్టు తీర్పు రావడంతో ఎన్నికల అధికారులు ప్రస్తుతం కొత్త ఓటరు జాబితా తయారు చేసే పనిలో పడ్డట్లుగా తెలుస్తోంది. మరో వైపు ఈ విషయమై సుప్రీం కోర్టుకు విశాల్‌ టీం వెళ్తుందా అంటూ చర్చలు జరుగుతున్నాయి.