Begin typing your search above and press return to search.

కిక్కాస్ టైటిల్.. మైండ్ బ్లోయింగ్ ఫస్ట్ లుక్.. అంచనాలు పెంచేసిన రవితేజ డైరెక్టర్..!

By:  Tupaki Desk   |   11 Jun 2021 2:30 AM GMT
కిక్కాస్ టైటిల్.. మైండ్ బ్లోయింగ్ ఫస్ట్ లుక్.. అంచనాలు పెంచేసిన రవితేజ డైరెక్టర్..!
X
'క్రాక్' సినిమా సక్సెస్ తో ట్రాక్ లోకి వచ్చిన మాస్ మహారాజా రవితేజ.. ప్రస్తుతం రమేష్ వర్మ దర్శకత్వంలో 'ఖిలాడి' చిత్రాన్ని కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు. అలానే ఉగాది పండుగ సందర్భంగా కొత్త దర్శకుడు శరత్‌ మండవ తో ఈ సినిమాని లాంఛనంగా ప్రారంభించాడు. వాస్తవ సంఘటనల ఆధారంగా ఓ యాక్షన్‌ థ్రిల్లర్‌ గా ఈ సినిమా రూపొందనుంది. ఎస్.ఎల్.వి సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఇప్పటికే ఈ సినిమా రెగ్యులర్ షూట్ ప్రారంభించాల్సి ఉండగా.. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో సెట్స్ పైకి వెళ్లలేదు. అయితే ఈ సినిమా ఫస్ట్ లుక్ - టైటిల్ గురించి గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో రూమర్స్ వస్తున్నాయి. దీనిపై తాజాగా డైరెక్టర్ శరత్‌ మండవ స్పందిస్తూ అవన్నీ నిరాధారమైనవని కొట్టిపారేశాడు. అభిమానులు వాటిని నమ్మవద్దని కోరుతూ.. ఫస్ట్ లుక్ మైండ్ బ్లోయింగ్ అవుతుందని.. టైటిల్ కిక్కాస్ గా ఉంటుందని ట్వీట్ చేశాడు.

"గైస్! షూటింగ్ ప్రారంభించే వరకు ఎటువంటి అప్డేట్స్ పోస్ట్ చేయాలని మేము అనుకోవడం లేదు. నేను మీకు భరోసా ఇస్తున్నాను. టైటిల్ - కిక్కాస్.. ఫస్ట్ లుక్ - మైండ్ బ్లోయింగ్.. థీమ్ సాంగ్ - ఎప్పుడూ ఊహించనిదిగా ఉంటుంది. నేను కూడా మీలాగే ఆసక్తిగా ఉన్నాను. కాని పరిస్థితులు సరిగ్గా లేవు. దయచేసి అందరూ వేచి ఉండండి" అని శరత్‌ మండవ ట్వీట్ లో పేర్కొన్నారు. ఈ సందర్భంగా జూలైలో చిత్రీకరణ స్టార్ట్ కావచ్చని డెబ్యూ డైరెక్టర్ ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇకపోతే ఈ చిత్రానికి సామ్ సీఎస్ సంగీతం సమకూరుస్తున్నారు. సత్య సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించనున్నాడు. 'మజిలీ' ఫేమ్ దివ్యాన్ష కౌశిక్ ఇందులో రవితేజ సరసన కథానాయికగా నటించనుంది. ఈ చిత్రానికి సంబంధించిన ఇతర వివరాలు తర్వాత వెల్లడికానున్నాయి.