నితిన్ సరసన 'భీష్మ' బ్యూటీ?

Fri Jun 18 2021 17:00:01 GMT+0530 (IST)

Rashmika Mandanna To Romance Nithin

నితిన్ ఇప్పుడు మాంఛి దూకుడు మీద ఉన్నాడు. జయాపజయాలను గురించి పెద్దగా పట్టించుకోకుండా వరుస ప్రాజెక్టులను లైన్లో పెట్టేస్తున్నాడు. ఈ ఏడాది ఆయన మూడు సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువెళ్లాలనే ఆలోచనలో రంగంలోకి దిగాడు. ఆల్రెడీ 'చెక్' .. 'రంగ్ దే' సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి ... కానీ వాళ్ల ఆదరణను పొందలేకపోయాయి. ఇక త్వరలో 'మాస్ట్రో' సినిమాను థియేటర్లకు తీసుకురావాలనే పట్టుదలతో నితిన్ ఉన్నాడు. ఈ సినిమాలో ఆయన జోడీగా నభా నటేశ్ నటిస్తోంది. ప్తస్తుతం ఈ సినిమా చివరి షెడ్యూల్ షూటింగును జరుపుకుంటోంది.ఇక నితిన్ ఆ తరువాత సినిమాను వక్కంతం వంశీ దర్శకత్వంలో చేయనున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాకి సంబంధించిన సన్నాహాలు మొదలైపోయాయని అంటున్నారు. నితిన్ కి 'భీష్మ' తరువాత హిట్ పడలేదు. ఆ సినిమాలో రష్మిక జోడీ అదిరిందనే టాక్ వచ్చింది. అంతేకాదు .. 'రంగ్ దే'లో కూడా రష్మిక అయితే బాగుండేదని కూడా అభిమానులు చెప్పుకున్నారు. అందువలన వక్కంతం వంశీ సినిమాలో రష్మికను కథానాయికగా తీసుకోవాలనే ఆలోచన చేస్తున్నారని అంటున్నారు.

అయితే ప్రస్తుతం రష్మిక వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఒక వైపున 'పుష్ప' సినిమా చేస్తూనే మరో వైపున రెండు హిందీ సినిమాలను చేస్తోంది. ఈ సినిమాలతోనే ఆమె బాలీవుడ్ కి పరిచయమవుతోంది గనుక ఆమె అక్కడే ఎక్కువగా ఫోకస్  చేస్తున్నట్టుగా చెప్పుకుంటున్నారు. ఒకవేళ నితిన్ తదుపరి సినిమా కోసం ఆమెను సంప్రదించడం నిజమే అయినా ఆమె గ్రీన్ సిగ్నల్ ఇస్తుందో .. లేదో చూడాలి.